ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమా వేశం జరు గనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యా హ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో కొరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై సైతం ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, కొత్త సచివాలయ నిర్మాణం, ఈ సీజన్ నుంచి ప్రవేశ పెట్టనున్న నియంత్రిత సాగు విధానంపై సైతం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగనుంది.
కాగా, అదే రోజు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో నెలకొన్న వివాదంపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం నుంచి లేఖ అందింది. అయితే, ఈ సమావేశాన్ని ఆగస్టు 20 తరువాత నిర్వహించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన రోజునే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుండటం చర్చనీయాంశంగా మారింది.