విపక్షాల గొంతు నొక్కుతున్నారు
కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం
నరేంద్ర మోదీ ప్రభుత్వం ధరల మంట, రైతుల సమస్యలు, పెగాసస్ స్పైవేర్‌పై పాలక పక్షం విపక్షాలను నోరు మెదపనీయడం లేదని, విపక్షాల గొంతునొక్కుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్షాలను పనిచేసేందుకు అనుమతించకుండా పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సభ్యులు తమ ప్రజల గళం వినిపించడంతో పాటు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించడం ప్రజాస్వామ్యంలో మౌలిక విధానమని రాహుల్ అన్నారు.
పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు కలిసికట్టుగా డిమాండ్ చేస్తున్నాయని, పార్లమెంట్లో ఈ అంశం చర్చకు పట్టుబడుతున్నామని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంట్ కార్యకలాపాలకు తాము విఘాతం కలిగించడం లేదని విపక్షాలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని పేర్కొన్నారు. పెగాసస్ వివాదం జాతీయ అంశంమని, ఇది గోప్యతకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని అన్నారు. దేశంపై ఈ ఆయుధాన్ని మోదీ సర్కార్ ప్రయోగిస్తుందని రాహుల్ దుయ్యబట్టారు.