- పేదలకు అందని రాష్ట్ర సంపద
- ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని 3కే పరిమితం చేశారు
- పేదలకు బియ్యం తప్ప మరే ఇవ్వడం లేదు
- అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క
ఏటేటా బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నా ఖర్చుపెడుతున్న తీరులో మాత్రం మార్పు రావడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు చేయాలన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో మాట్లాడుతూ పేదలకు గత ఎనిమిదేళ్లలో గజం స్థలం ఇవ్వలేదని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ఇల్లు కట్టుకోవటానికి రూ.5 లక్షలు సాయమని చెప్పి… రూ.3 లక్షలే బ్జడెట్‌లో పెట్టారని విమర్శించారు. రైతుబంధు ఇస్తామని ఎరువుల ధరలు పెంచారని మండిపడ్డారు. మంత్రిపైనా సుపారీ చేసే పరిస్థితి వొచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ సుపారీ అంశంపై స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హయాంలో పేదలకు బియ్యంతో పాటు 9 వస్తువుల సంచి ఇచ్చామని, రాష్ట్రం సంపద పెరిగింది.. కానీ పేదలకు ఇచ్చే బియ్యం సంచి లేదు..సంచిలో సరుకు కూడా మాయం అయ్యిందని ఆయన అన్నారు. నిత్యావసరాల ధరలు కనీసం నియంత్రణ చేయరని, సంపద పెరిగిందని అంటారు..అయితే పేదలకు అందని సంపద ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ ఏమైంది.. వడ్డీ ద వడ్డీ పెరుగుతుంది.. బ్యాంకులు రైతుబంధు డబ్బులను కూడా లోన్ కింద కట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతు బంధు ఇస్తున్న అంటూ.. ఎరువుల ధరలు పెంచారు.. సబ్సిడీ లపై కోతలు పెట్టారు.. ఐదు వేలు ఇచ్చి .. ఇవన్నీ రద్దు చేస్తే ఏం లాభం అని ఆయన విమర్శించారు. పెరిగిన సంపద పేదలకు ఎలా పంచాలి అనేది ఆలోచన చేయండని జూచించారు. మంత్రి పైనా సూపారీ చేసే పరిస్థితి వొచ్చిందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, మంత్రికే ఇలాంటి పరిస్థితి వొస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు తీర్చేలా అమలు జరగడం లేదన్నారు.
ప్రతీ ఏడాది బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారన్నారు. కానీ.. అమలు విషయంలో మాత్రం కోతలు పెడుతూ వొస్తున్నారన్నారు. పెరిగిన ధరల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సంపద తక్కువ ఉన్నప్పుడు రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఇప్పుడు సంపద బాగా పెరిగిన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరుతో రూ. 5000 ఇచ్చి పండగ చేసుకోమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సౌకర్యాలు, సబ్సిడీలు అన్నీ ఇచ్చి… రైతు బంధు కూడా ఇస్తే వారికి న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. అయితే ఇంటి నిర్మాణానికి తాము ఎప్పుడూ ఐదు లక్షలు ఇస్తామని అనలేదని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి అభ్యంతరం తెలిపారు.