Take a fresh look at your lifestyle.

ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం

అయోధ్యలో బుధవారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబాల కాలంగా దేశవ్యాప్తంగా నిరంతరం చర్చనీయాంశంగా మారిన ఇక్కడి రామమందిర నిర్మాణం భూమిపూజతో మొదలైంది. దేశ వ్యాప్తంగా ఎన్నో రామమందిరాలున్నా శ్రీరాముడి జన్మస్థానంగా దీనికొక ప్రత్యేకత ఉండడంవల్లే నేటి కార్యక్రమానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మందిర నిర్మాణం విషయంలో దశాబ్దాలుగా జరిగిన వాగ్వాదాలకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభైనాలుగు నిముషాల అభిజిత్‌ ‌ముహూర్తంలో జరిపిన ప్రారంభోత్సవాన్ని కేవలం భారతదేశవాసులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే అవకాశం లభించింది. ఇంతకాలంగా వివాద స్థలంగా కొనసాగుతున్న ఈ ఆలయానికి వచ్చిన మొట్టమొదటి ప్రధాని కూడా మోదీ కావడం విశేషం. భారతీయ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల మధ్య ఆయన ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుకూడా పలువురిని ఆకర్షించింది. రాముడు అందరివాడని, ప్రధానంగా భారతీయ సంస్కృతికి ఆయన ప్రతీకని ఆద్యాత్మిక వేత్తగా ఆయన మాట్లాడారు. అయోధ్య అనేక మతాలకు ఆలవాలమైఉంది. హిందూఇజం, బుద్ధిజం, జైనిజం, ఇస్లాం మతాలిక్కడ ఒక్కోసారి ఆధిపత్యాన్ని సంతరించుకున్నాయి. అయినా ఇది చిరకాలంగా హిందూ నగరంగాన్నే బాసిల్లిందని చెబుతూనే వివిధ రాష్ట్రంల్లో మహనీయులు వివిధ తీరుల్లో రాసిన రామాయణాలపేర్లను వివరించిన తీరుకూడా పలువురిని ఆకర్షించింది.

ఒకవైపు గంగా, మరోవైపు సరయూనదుల పవిత్ర ప్రవాహాల నడుమ నాటి కోసలరాజ్య వైభవానికి ప్రతీకగా నిలిచిందీ అయోధ్య. అలాంటి అయోధ్యలో రాముడు నడియాడినచోట నేడు బంగారు ఇటుకలతో భూమిపూజ నిర్వహించిన వేళ యావత్‌ ‌ప్రపంచంలోని కోట్లాది రామభక్తులంతా దూరదర్శన్‌ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. మోదీ చెప్పినట్లు శ్రీరాముడు అంటేనే మర్యాద పురుషోత్తముడు. అలాంటి మహనీయుడు సర్వమానవాళికి ఆదర్శప్రాయుడు. అందుకే కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్‌, శ్రీ‌లంక, నేపాల్‌ ‌లాంటి దేశాల్లో కూడా రాముడిని ఆదర్శనీయుడైనాడు. నేటికీ ఆయా దేశాల్లో రాముడు, సీత గాథలను, వారి మానవీయతను కొనియాడుతున్నాయి. అదుకే ఈ ఆలయ నిర్మాణం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలువడమే గాకుండా, జాతీయ భావనకు ప్రేరణ కలిగిస్తుంది. దీనివల్ల చరిత్ర పునరావృతమవుతుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్న నమ్మకాన్ని మోదీ నొక్కి చెప్పాడు. ఏదేమైనా దశాబ్దాలుగా దేశ ప్రజలు ఎంతో ఆదుర్దాగా ఎదురు చూస్తున్న మహోన్నత ఘట్టానికి ఆగస్టు అయిదు మలుపు తిప్పింది. ఆయోధ్య రామమందిరానికి నేడు జరిగిన అంకురార్పణ మూడేళ్ళ కాలంలో సంపూర్ణఫలాన్నిస్తుందని చెబుతున్నారు.

అయిదు శతాబ్దాల నిరంతర పోరాటానికి దీనితో పులిస్టాప్‌ ‌పడింది. అయితే ఇంత సుదీర్ఘకాలం తర్వాత నేటి చారత్రక ఘట్టానికి పునాదివేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కటం విశేషం. ఎందరెందరి త్యాగఫలం నేటి భూమిపూజతో సాక్షాత్కారమైంది. ఎనభై ఏళ్ళ మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ గత ఇరవై ఎనిమిది ఏళ్ళుగా గుడి కట్టేవరకు ఆహారం ముట్టనని ప్రతిజ్ఞ చేసిందంటే ఈ రామమందిర నిర్మాణం కోసం ప్రజలు ఎంతటి ధృడ సంకల్పంతో ఉన్నారన్నది అర్థమవుతుంది. అందుకే నరేంద్రమోదీ అన్నట్లు మందిర నిర్మాణ అంకురార్పణ అన్నది ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఏళ్ళ తరబడి కొనసాగుతున్న నిరీక్షణకిది ముగింపు కూడా. నదిని దాటడానికి రాముడికి గుహుడు ఎలా సహాయం చేశాడో….గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి తనతోటి బాలురు ఎలా సాయంచేశారో, ఆయోధ్య ఆలయ నిర్మించుకోవడానికి ఈ స్థాయికి రావడానికి బలిదానంచేసిన ఎందరో కరసేవకులను ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకోవాల్సిన అవసరముందన్న మోదీ మాటలు నిజంగానే అందరిని చలింపజేశాయి. దేశ రాజకీయాలెలా ఉన్నా రామమందిర నిర్మాణమన్నది భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందనడం నిర్వివాదాంశం.
మండువ రవిందర్‌ ‌రావు

Leave a Reply