Take a fresh look at your lifestyle.

చిన్నతరహా పరిశ్రమల చేయూతపై భిన్నాభిప్రాయాలు

దేశంలో కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలను కల్పించే సూక్ష, చిన్న, మధ్య తరహా(ఎంఎస్‌ఎంఇ) ‌పరిశ్రమలకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్యాకేజీ విషయంలో ఆయా రంగాల్లోని ప్రముఖులు భిన్నాబిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. కొరోనా వైరస్‌ ‌కారణంగా గడచిన యాభై రోజులకు పైగా దేశవ్యాప్తంగా అమలులోనున్న లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో ఈ పరిశ్రమలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాయి. మే 30వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా లేక ఇంకా కొంతకాలంపాటు కొనసాగుతుందా అన్న విషయం ఇప్పుడప్పుడే తేలేట్లులేదు. దేశవ్యాప్తంగా రోజురోజుకు తగ్గాల్సిన కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఫలితంగా మరికొంతకాలం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమెంత్తైనా ఉంది. ఈ ‌నేపథ్యంలో కుదించుకుపోయిన దేశ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విడుతలవారిగా వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొంతవెసులుబాటును కలిగిస్తున్నది. అయితే ఈ రంగం ఇప్పుడప్పుడే కోలుకోలేని పరిస్థితిలోఉంది. అందుకే ఆర్థికంగా ఆదుకునే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. ఇందుకుగాను కేంద్రం ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఎంఎస్‌ఎంఇలకు 3 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సూక్ష్మ, మధ్య , లఘు, కుటీర పరిశ్రమ(ఎంఎస్‌ఎంఇ)‌లకు ఎలాంటి పూచీకత్తులేకుండానే రుణాలనివ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

రుణాల చెల్లింపుకు నాలుగేళ్ళ కాలవ్యవధితోపాటు, 10 నెలల మారిటోరియం ఉంటుందని చెప్పింది.ఎంఎస్‌ఎంఇల కోసం ఫండ్ ‌ ఆఫ్‌ ‌ఫండ్స్‌ను కూడా కేంద్రం ఏర్పాటుచేసింది. వృద్ధి, సామర్ధ్యమున్న చిన్న సంస్థలకు దాదాపు 50 వేల కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనున్నారు. తీవ్ర వొత్తిడుల్లో ఉన్న, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు 20వేల కోట్లమేర రుణ సదుపాయాన్ని కలిగిస్తామంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్యాకేజీపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ప్యాకేజీవల్ల చిన్నపరిశ్రమలకు జరిగే పెద్దమేలేమీలేదని కొందరు వాదిస్తుండగా దీర్ఘకాలికంగా ఈ ప్యాకేజీ మంచి ఫలితాన్నిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండు నెలలకాలంగా మూతపడిన పరిశ్రమలు పునరుద్దరణకు మరికొంత సమయం పట్టేట్లుంది. కాగా, ఈ పరిశ్రమలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య తమ సంస్థల్లోని ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం. అలాగే పరిశ్రమలు తెరువగానే ఆర్డర్లువొస్తాయన్నగ్యారెంటీ లేదు. ఉత్పత్తి, మార్కెటింగ్‌ ‌పూర్తిగా నిలిచిపోయినవాటిని పునరుద్దరించాల్సిఉంది. నగదు లావాదేవీలు దెబ్బతిన్నాయి. ఈ రంగాల్లో పనిచేస్తున్న స్కిల్‌ ‌లేబర్‌తో పాటు, ఇతర కార్మికులు కొరోనాకు భయపడి తమ గ్రామాలకు వెళ్ళిపోయారు. వారు తిరిగి రావాలంటేనే భయపడిపోతున్నారు. కొరోనాతోనే సహజీవనం సాగించాలంటున్న నేపథ్యం లో గతంలోలాగా కార్మికులు కలిసికట్టుగా పనిచేసే పరిస్థితిలేదు. ఈ పరిస్థితిలో ఎక్కువకాలం సంస్థలను కొనసాగించడం సాధ్యంకాదంటూ, ఈ ప్యాకేజీవల్ల అటు కార్మికులకుగాని, ఇటు యాజమాన్యానికిగాని పెద్దగా ఒరిగేదేమీలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎస్‌ఎంఇలకు ఊతమివ్వడంలో భాగంగా10 నెలలపాటు మారిటోరియాన్ని ప్రకటించడం ఒక్కటి తప్ప మరేదీ పెద్దగా ఉపయోగకారికాదంటున్నారు కొందరు పారిశ్రామికవేత్తలు. పరిశ్రమలు మూసివేసిన రెండు నెలల వేతనాన్ని కార్మికులకు చెల్లించే విధంగా ప్రభుత్వం ప్రకటిస్తే తమకు మరికొంత వెసులుబాటుండేదంటున్నారు.

అలాగే పిఎఫ్‌ ‌ప్రయోజనాలను మరో మూడు నెలలపాటు పొడిగించారు. అయితే సంస్థల్లో వందమంది ఉద్యోగులుండి, 15000లకన్నా తక్కువ వేతనం పొందుతున్న కంపెనీలు, ఉద్యోగుల తరఫున పీఎఫ్‌ ‌చెల్లిస్తామని కేంద్రం అంటున్నా అలా ఎంతమంది ఉంటారని ప్రశ్నిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమల్లో ఎక్కువగా కాంట్రాక్టు, రోజువారి కూలీలుగా పనిచేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారికిది ఏవిధంగా లాభదాయకం ..!. ఇదిలా ఉంటే ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్‌ ‌గ్రహీత అభిజిత్‌ ‌బెనర్జీ సూచన ప్రకారం చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలన్నిటినీ కేంద్రం మాఫీ చేసే దిశగా ఆలోచించాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, కేంద్రం అందిస్తున్న ప్యాకేజీ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నవారుకూడా లేకపోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఇల కోసం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఊతమిస్తుందంటున్నారు మరికొందరు చిన్న, మద్యతరహా పారిశ్రామికవేత్తలు. దీనివల్ల ఇంతకాలంగా చితికిపోయిన పరిశ్రమలు నిలబడడానికి ఆస్కారం ఏర్పడుతుండడంతోపాటు, ఈ రంగంలో మరింతమంది కార్మికులకు, ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశలుంటాయంటున్నారు.అయితే సూక్ష్మ, చిన్న, మధ్య, లఘు, గృహ పరిశ్రమలను ఏవిధంగా క్యాటగరైజ్‌ ‌చేస్తారు.. ఏరంగానికి ఎన్ని నిధులను కేటాయిస్తారు.. ఎలాంటి నిబంధనలు విధిస్తారన్న విషయంలో ఇంకా పూర్తిస్థాయి వివరణ వొస్తేగాని కేంద్రం అందించే సహకారం ఏ మేరకు ప్రజలకు, పరిశ్రమకు ఉపయోగపడుతుందని అర్థంకాదు.

Leave a Reply