దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసుకు నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ జంట పేలుళ్లలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మందికి గాయాలయ్యాయి. పేలుళ్లలో చనిపోయిన వారికి బాధిత కుటుంబాలు, స్థానికులు ఇవాళ నివాళులర్పించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6:45 గంటలకు ఉగ్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. నిజంగా ఆ రోజు జరిగిన మారణ•మం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ నెత్తుటి గాయం ఇప్పటికీ పచ్చిగా సలపరిస్తూనే ఉంది. 2013 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6:45 గంటలకు దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. 17 మంది మాంసపు ముద్దలైపోయారు. 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట మలక్ పేట, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో 2013 మార్చి 13న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఎ దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసుపై చర్లపల్లి సెంట్రల్ జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసిన ఎన్ఐఎ మూడేళ్లపాటు విచారణ జరిపింది. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. 502 డాక్యుమెంట్లు, 201 మెటీరియల్ ను పరిశీలించింది. నిందితులకు వ్యతిరేకంగా ఎన్ఐఎ పక్కా సాక్ష్యాధారాలు సమర్పించింది. ఎన్ఐఎ లాయర్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. 2016 నవంబరు 7న వాదనలు పూర్తయ్యాయి. ఇండియన్ ముజాహిదినే పేలుళ్లకు పాల్పడినట్టు తేలింది. నిందితులందరూ దోషులేనని 2016, డిసెంబర్ 13న ఎన్ఐఎ కోర్టు నిర్దారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల దోషులకు ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్ లను ఉరికంబం ఎక్కించాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నాడు. మిగతా నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.