Take a fresh look at your lifestyle.

మానవీయశాస్త్ర అధ్యయనానికి డిజిటల్ వెలుగులు

సాంప్రదాయ మానవీయ శాస్త్రాల పరిశోధనలు, లోతైన అధ్యయనాల్లో డిజిటల్‌ టెక్నాలజీని వాడుకోవడాన్ని ‘డిజిటల్‌ మానవీయశాస్త్రం’ లేదా ‘డిజిటల్‌ హుమానిటీస్‌’గా అర్థం చేసుకోవాలి. డిజిటల్‌ వనరులను ఉపయోగించి హుమానిటీస్‌ విభాగాలను అధ్యయనం చేయడంతో పాటు పలు విభాగాల సహకారంతో పరిశోధనలు, బోధనలు, ముద్రణలు చేయడాన్ని “డిజిటల్‌ హుమానిటీస్‌”గా నిర్వచిస్తారు. హుమానిటీస్‌ పరిజ్ఞాన పరిధి పుస్తకాల ముద్రణ, పంపిణీలను దాటి విస్తృతం కావడానికి నేటి ఆధునిక శాస్త్రసాంకేతిక విప్లవం డిజిటల్‌ హుమానిటీస్‌ రూపంలో తోడవడం గత కొన్ని ఏండ్లుగా జరుగుతూ వస్తున్నది. హుమానిటీస్‌ పరిశోధనలతో బోధనలో నవ్య విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో సాంస్కృతిక వారసత్వం, డిజిటల్‌ సంస్కృతులు ప్రభావితం అవుతున్నాయి. మానవీయ శాస్త్ర పరిశోధనలు, లోతైన అధ్యయనాల్లో టెక్నాలజీ దూరి పోవడంతో హుమానిటీస్‌ విభాగాలు నూతన రూపాలను సంతరించుకుంటున్నాయి. హుమానిటీస్‌ డాటా వివరాలను కంప్యూటర్ అనువర్తనాలతో‌ అధ్యయనాలు, విశ్లేషణలు, పరిశోధనలు, బోధనలు, శోధనలు చేయడానికి డిజిటల్‌ ఈ-టెక్నాలజీ దోహదపడుతూ మరో నూతన డిజిటల్‌ హుమానిటీస్‌ రంగం ప్రారంభమైందని గమనించాలి.
కోవిడ్‌-19 నేర్పిన ఈ-పాఠాలు:
            అవసరం మనిషిని నిద్ర పోనివ్వదు, ఏ పనినైనా చేయిస్తుంది. ఆటంకాల కంచెలు మానవ మేధస్సుకు పరీక్ష పెడతాయి. అవాంతరాలు పురోగమనాన్ని ఆపలేవు. సంక్షోభాలు మానవాళి ప్రతిభకు సవాళు విసురుతాయి. కరోనా వైరస్‌ విజృంభణతో లోక నరులకు ఊపిరి ఆగినంత పని అయి పోయింది. ముక్కులు మూసుకోవడం, లాక్‌డౌన్లో ఇంట్లో తొంగోవడం, భౌతిక దూరాలు పాటించడం, తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, మనిషిని మనిషే శత్రువులా చూడడం, పోషకాహార ప్రాధాన్యతను తెలుసుకోవడం, తుమ్ములు/దగ్గులు విస్పొటనాలుగా తోచడం లాంటివి క్షణాల్లో అర్థం చేసుకున్నాం, ఆచరించాం, అలవాటు చేసుకున్నాం. కోవిడ్‌-19 మహా విపత్తు ప్రపంచ మానవాళి జీవనశైలిలో అనివార్య సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, జూమ్‌ సమావేశాలు, ఈ-వైద్యం, ఆన్‌లైన్‌ (ఈ-) బోధనలు, ఈ-వాణిజ్యం లాంటి పలు రంగాలకు తెర తీసాం. విద్యాలయాలు మూసివేయడంతో విద్యార్థి లోకం అయోమయంలో పడిన సందర్భంలో డిజిటల్‌ తరగతుల రూపంలో ఆన్‌లైన్‌ క్లాసుల తలుపులు తెరిచాం. సంప్రదాయ విద్యా విధానంలో ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లకు పెరిగిన ఆదరణతో ఇతర కోర్సులకు, ముఖ్యంగా భాషా/సాహిత్య రంగాల బోధనలు/పరిశోధనలు నిరాదరణకు గురి కావడం అనాదిగా జరుగుతోంది. గోరు చుట్టుపై రోకలి పోటులా అనాధలైన భాషా సాహిత్యరంగాలకు, వాటి బోధనలకు కరోనా కల్లోలం కోసుకోలేదని దెబ్బ తీసిన వేళ డిజిటల్‌ వేదికలు సాహిత్య రంగానికి కొంత ఊరటను ఇచ్చాయడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి కల్లోల సమయాన మానవాళికి, ముఖ్యంగా హుమానిటీస్‌ రంగ విద్యార్థులకు/బోధకులకు/పరిశోధనలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం తోడు కావడం తప్పనిసరి అయ్యింది, కొత్త రంగానికి తెర తీసింది. ఈ నేపథ్యంలోనే డిజిటన్‌ హుమానిటీస్‌ రంగం ఉద్భవించడం, ఊపునందుకోవడం, సరికొత్త అధ్యయన పరిశోధనల వేదికలను పరిచయం చేయడం చూస్తుండగానే జరిగి పోయి డిజిటల్‌ హుమానిటీస్ రంగం వేగంగా ప్రాచుర్యం పొందడానికి మార్గం సుగమం అయ్యింది‌.
డిజిటల్‌ హుమానిటీస్‌ పితామహుడు:
         1946లో రాబర్ట్‌ బూసా (డిజిటల్‌ హుమానిటీస్‌ పితామహుడు, ఫాదర్‌ ఆఫ్‌ డిజిటల్‌ హుమానిటీస్‌) ప్రారంభించిన డిజిటల్‌ హుమానిటీస్‌ లేదా హుమానిటీస్‌ కంప్యూటింగ్‌ క్షేత్రంలో దినదినం ప్రాచుర్యాన్ని పొంది నేడు హుమానిటీస్‌ బోధన, పరిశోధన, అధ్యయన రంగాలు పెను మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. భాషలు‌, చరిత్ర, మతపరమైన అధ్యయనాలు, ఫిలాసఫీ, ఆర్ట్‌, హిస్టరీ, న్యాయశాస్త్రం, అంతర్జాతీయ సంబంధాలు, లింగ – మహిళా అధ్యయనాలు, కళలు, సంగీతం, ఆధునిక భాషలు, సాహిత్యం లాంటి విభాగాలు డిజిటల్‌ హుమానిటీస్‌ పరిధిలో అధ్యయనం చేయబడుతున్నాయి. హుమానిటీస్‌ సమాచార సేకరణ, విశ్లేషణ, డాటా విశ్లేషణ, డిజిటల్‌ సమాచార ప్రక్రియలను డిజిటల్‌ హుమానిటీస్‌ చర్చిస్తుంది. డిజిటల్‌ టెక్నాలజీ, కల్చర్‌లను అనుసంధానం చేయడాన్ని డిజిటల్‌ హుమానిటీస్‌ విభాగంగా పేర్కొన వచ్చును. నేడు కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించి విజువల్‌ ఆర్ట్‌, మ్యూజిక్‌లను విశ్లేషించే పరిశోధనలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
డిజిటల్‌ హుమానిటీస్‌ కోర్సులు:
          డిజిటల్‌ హుమానిటీస్‌ అధ్యయనానికి పలు విశ్వవిద్యాలయాలు డిగ్రీ, పిజీ కోర్సులు అమలులోకి తేవడం జరిగింది. డిజిటల్‌ హుమానిటీస్‌ పట్టాలు పొందిన యువతకు డిజిటల్‌ క్యూరేటర్స్‌, పరిశోధన రంగాలు, బోధన రంగాలు, సాంకేతిక సమాచారాల రంగాలు, డాటా సైంటిస్టులు, వెబ్‌ డిజైనింగ్‌, గేమ్‌ డిజైనింగ్‌, సమాచార అర్కిటెక్ట్స్‌ రంగాల్లో ఆకర్షణీయ ఉద్యోగాలు వెలువడుతున్నాయి. మానవీయ శాస్త్ర డాటా విశ్లేషణ, సామాజిక మాధ్యమాలు, సౌండ్‌, వెబ్‌ అండ్‌ ఇమేజ్ ఆర్కీవ్స్‌ విభాగాలను అర్థం చేసుకోవడానికి కూడా డిజిటల్‌ హుమానిటీస్‌ తోడ్పడుతున్నది. డిజిటల్‌ హుమానిటీస్ విభాగపు ఆసక్తికర‌ అనువర్తనాల్లో పెలాజియోస్‌ కామన్స్‌, టోపోస్‌ టెక్స్ట్, మ్యాపింగ్‌ జూవిష్‌ యల్‌ఏ, విజ్యువలైజింగ్‌ పాలిటిక్స్‌, యన్‌వైయూ స్మార్ట్‌ సిటీస్‌ లాంటి ఆధునిక ప్రయోజనాలు వస్తాయి.
డిజిటల్‌ హుమానిటీస్‌ ప్రాధాన్యం:
          సాంప్రదాయ మానవీయ శాస్త్రానికి టెక్నాలజీ రంగులు అద్దడంతో శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాల నూతన దృక్కోణం పూర్తిగా మారిపోయింది. ఆధునిక హుమానిటీస్‌ అధ్యయనం డిజిటల్‌ వెలుగులు సోకేసరికి డిజిటల్‌ హుమానిటీస్‌ అనబడే నూతన అధ్యయన గవాక్షాలు తెరుచుకొని అభిరుచి కలిగిన యువతను ఆకర్షిస్తున్నది. డిజిటల్‌ హుమానిటీస్ విభాగంలో‌ యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన యువతకు నేడు పలు కొత్త ఉద్యోగ దారులు తెరుచుకొని అర్హులను ఆహ్వానిస్తున్నాయి. టెక్నికల్‌ రైటర్స్‌, డాటా జర్నలిస్ట్‌ లాంటి నూతన ఉద్యోగ మార్గాలు వెలిసాయి. హుమానిటీస్‌ రంగంలో పరిశోధనలు కొత్త పుంతలు తొక్కడానికి ‘హుమానిటీస్‌ కంప్యూటింగ్‌’ వైపు చూస్తున్నారు. డిజిటల్‌ హుమానిటీస్‌ కోర్సులు పూర్తి చేసిన యువతకు ‘ప్రాక్టికల్ హార్డ్‌‌ స్కిల్స్’‌ పట్ల పట్టు సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు సులభమవుతున్నాయి. అనేక యూనివర్సిటీలు పలు రకాల డిజిటల్‌ హుమానిటీస్‌ కోర్సులు ప్రారంభించడం, ఈ రంగంలో నైపుణ్యత సాధించిన యువతకు సరైన ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు కల్పించడం నేడు జరుగుతున్నది.
             సాంప్రదాయ మానవీయ శాస్త్రం, కంప్యూటర్‌ టెక్నాలజీ లేదా డిజిటల్‌ టెక్నాలజీల కలయికతో ఉత్పన్నమైన నవ్య విభాగంగా ‘డిజిటల్‌ హుమానిటీస్’‌ రంగం రేపటి మానవీయ శాస్త్రానికి ఆధునిక హంగులు చేకూర్చుతున్నదని గమనిస్తూ విశ్వవిద్యాలయ యువత ఆ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, పరిశోధనా రంగంలో లేదా సంబంధిత ఉద్యోగాల్లో స్థిరపడడానికి కృషి చేయాలని కోరుకుందాం.
image.png
         డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
        కరీంనగరం – 9949700037

Leave a Reply