Take a fresh look at your lifestyle.

నిర్భయ -హత్రాస్‌.. ఇదీ తేడా..!

‘ఆనాడు ‘నిర్భయ’ కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వాన్ని దూషించలేదు. ఎవరిపై ఆరోపణలు చేయలేదు. ఒత్తిళ్ళు తేలేదు. నిర్భయ భౌతిక కాయాన్ని వెంట ఉండి ఇంటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు పూర్తిచేసుకున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా హాజరయ్యారు. మృతురాలి సోదరునికి పైలట్‌ ‌శిక్షణ ఇప్పించడంలో స్వయంగా రాహుల్‌ ‌గాంధి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో సోనియా గాంధి స్వయంగా చెప్పేవరకూ ఆ విషయం లోకానికి తెలియదు. రాహుల్‌ ‌చెప్పుకోలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించలేదు. నిర్భయ కుటుంబ సభ్యులు ఆ విషయంలో రాహుల్‌ ‌కు కృతజతలు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్య పోయారు..’

చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టమన్నారు.

ఒక తప్పు తోవ పట్టిన వ్యక్తిని తక్షణం సక్రమమార్గంలో పెట్టకపోతే, జీవితమంతా వక్రమార్గంలో వెళతాడు. చిన్న తప్పు అని నిర్లక్ష్యం చేసి వదిలేస్తే మహా నేరస్థుడై సమాజానికి ముప్పు తెస్తాడు. రాజకీయ లబ్దికోసం పాలకులు నేరస్తులను కాపాడి, దన్నుగా నిలిస్తే లోకకంటకులై నిర్భీతితో వ్యవహరించి ప్రజల ఆస్తులకు, మాన ప్రాణాలకే రక్షణ కరువవుతుంది. నేర విచారణ, దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వ్యవహరించి, న్యాయ వ్యవస్థ ధర్మం నిర్వర్తించక పోతే అరాచకానికి దారి తీస్తుంది. ముఖ్యంగా హత్యాకాండ, అత్యాచారాల నేరాల్లో దోషులను తక్షణం చట్టానికి అప్పగించి, బాధితులను ఆదుకుని రక్షణ కల్పించి న్యాయం జరపాల్సిన బాధ్యత విస్మరించే ప్రభుత్వాలను ప్రజలు క్షమించరు. ముఖ్యంగా, వర్ణ వివక్షనేరాలు, స్త్రీలపై అత్యాచారాలు జరిగినప్పుడు నేరస్థుల విషయంలో తాత్సారం జరిగితే ప్రజాగ్రహానికి పాలకులు బలవ్వక తప్పదు. మహిళల పై అత్యాచారాలు జరిగినప్పుడు బాధితులు, ప్రజలు కోరుకునేది తక్షణ న్యాయం. దర్యాప్తులు, న్యాయవిచారణలో జాప్యం జరిగితే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది.

దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులపట్ల సానుకూలంగా వ్యవహరించకూడదు.

స్త్రీలపై నేరాలకు పాల్పడితే చావు తప్పదన్న భయం ప్రతి వ్యక్తిలో కలగాలి. ఈ విషయంలో తెలంగాణ నేలపై జరిగిన రెండు అత్యాచార సంఘటనల్లో ఒక పోలీసు అధికారి స్పందించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలందు కున్నది. గతంలో డా. వై ఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్‌ ‌జిల్లాలో నిందితులిరువురు ఎన్కౌంటర్‌ ‌కు గురై బాధితులకు న్యాయం జరిగింది. అదే మాదిరి గత ఏడాది సైబరాబాద్‌ ‌పరిధిలో ఒక యువతి పై అత్యాచారం జరిగినప్పుడు కూడా తక్షణ న్యాయం జరిగింది. నిందితులు ఎన్‌ ‌కౌంటర్లో మరణించారు. రెండు సంఘటనల్లోనూ పోలీసు అధికారి సజ్జనార్‌ ‌కావడం విశేషం. ఆయనకు ఆ నాడు రెండు ప్రభుత్వాలూ అండగా నిలిచాయి. ప్రజలు భేష్‌ అన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ ‌హథ్రాస్‌ ‌లో జరిగిన అత్యాచారం, హత్య సంఘటనలో పోలీసు అధికారులు, ప్రభుత్వం స్పందించిన సాచివేత ధోరణి దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. నిందితులను కాపాడే రీతిలో యంత్రాంగం వ్యవహరిస్తున్నదన్న అభియోగం బలం పుంజుకుంటున్నది. బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలని ముక్తకంఠంతో ప్రజలు కోరుకుంటున్నారు.

పోలిక ఎప్పుడూ రెండు మంచి విషయాల మధ్య సత్ఫలితాలనిస్తాయి.

రెండు చెడు విషయాల మధ్య, ఇరువురు చెడ్డవారి మధ్య అయితే రెంటిలో ఏది నిష్కృత్యమో, ఎవరు పరమ దుర్మార్గులో తేలుస్తుంది. ఇప్పుడిక్కడి చర్చ గతంలోని నిర్భయ- తాజాగా హాథ్రాస్‌ ‌హత్యాచార గురించి. ఈ రెంటికీ మధ్య పోలిక లేదు కానీ, ఆయా సంఘటనలపై ఆయా ప్రభుత్వాలు, పోలీసు యంత్రాగం ..! అర్ధరాత్రి నిర్భయ దుర్ఘటన జరిగిన సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం బాధితురాలిని తక్షణ చికిత్స, పరీక్ష కోసం సఫ్దర్‌ ‌జంగ్‌ ఆస్పత్రికి తరలించింది. అధికారపార్టీ అధినేత సోనియా గాంధి వెనువెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి కుటుంసభ్యులను కలుసుకుని వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. తెలవారంగనే విషయం లోకానికి తెలిసి నిరసనలు వెల్లువెత్తాయి. సోనియా స్వయంగా నిరసనకారులను కలుసుకుని దోషులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు., అత్యాచార బాధితురాలిని మెరుగైన చికిత్స మేలైన వైద్యం కోసం భారతప్రభుత్వం హుటాహుటిన విమానంలో సింగపూర్‌ ‌తరలించింది. చికిత్సకాలంలో నిర్భయ అక్కడ మృతి చెందడంతో భౌతిక కాయం స్వదేశానికి తరలించినప్పుడు కూడా మౌనముని అని అందరూ హేళనచేసినా అన్ని వేళలా హుందాగా వ్యయవహరించే దేశప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌స్వయంగా విమానాశ్రయంలోనే పార్టీ అధ్యక్షురాలు సోనియా సహా వేచి ఉండడం, వారి ఔన్నత్యం. అర్ధరాత్రి జరిగిన దుష్కృత్యంలో ఆనవాళ్ళే లేని నేరాన్ని చాకచక్యంతో దర్యాప్తు జరిపి సాక్షాలు, ఆధారాలు సేకరించి నేరస్థులందరినీ కటకటాల వెనుక బంధించిన ఘనత దిల్లీ పోలీసులది. ఆ దుర్ఘటన నేపథ్యంనుంచే నిర్భయ కొత్తచట్టం రూపుదిద్దుకుందని అందరూ గుర్తుంచుకోవాలి. పాపం ఆ విషయం గురించి ఈషణ్మాత్రం తెలియని చీకటిలో నేటి ఉత్తర ప్రదేశ్‌ అడిషనల్‌ ‌డిజి ఉండడం విచారకరం.

ఆనాడు నిర్భయ కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వాన్ని దూషించలేదు.

ఎవరిపై ఆరోపణలు చేయలేదు. ఒత్తిళ్ళు తేలేదు. నిర్భయ భౌతిక కాయాన్ని వెంట ఉండి ఇంటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు పూర్తిచేసుకున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా హాజరయ్యారు. మృతురాలి సోదరునికి పైలట్‌ ‌శిక్షణ ఇప్పించడంలో స్వయంగా రాహుల్‌ ‌గాంధి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో సోనియా గాంధి స్వయంగా చెప్పేవరకూ ఆ విషయం లోకానికి తెలియదు. రాహుల్‌ ‌చెప్పుకోలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించలేదు. నిర్భయ కుటుంబ సభ్యులు ఆ విషయంలో రాహుల్‌ ‌కు కృతజతలు చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్య పోయారు.

సరే, ఇప్పుడు హాథ్రాస్‌ అత్యంత అమానుష.. దుర్ఘటన విషయానికొద్దాం

అసలా విషయాన్ని ఎవరైనా పట్టించు కుంటున్నారా, తీక్షణంగా భావిస్తున్నారా.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు, కనీసం విషయం తెలుసుకునేందుకు శ్రద్ధచూపారా.. మానవత్వం ప్రదర్శించారా.. ప్రజాగ్రహం మిన్నంటిన తరువాత.. మొక్కుబడిగా వీడియో పరామర్శ సరిపోయిందా.. బాధిత కుటుంబాన్ని, మృతురాలి తండ్రిని పెదవి విప్పనీయకుండా భయపట్టిన జిల్లా మేజిస్ట్రేట్‌ ‌పై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎందుకు చర్య తీసుకోలేదు.

తన కూతురిని చివరిసారిగా ఇంటికి తీసుకెళ్ళి, అంత్యక్రియకు ముందు ఆమెపై హల్దీ పెట్టుకునేందుకు అనుమతించాలని పోలీసులకాళ్ళు పట్టుకుని దీనంగా విలపించినా ఆ కరకు కాఖీ గుండెలు కరగకుండా.. పోలీసులే హడావిడిగా అర్ధరాత్రి, కుటుంబ సభ్యులెవరినీ అనుమతించ కుండా శవదహనం ఎందుకు చేయాల్సి వచ్చింది..? తమను బెదరిస్తున్నారంటూ, ఆ మహిళ జిల్లా మేజిస్ట్రేట్‌ ‌కారు వెనుక పరుగులెత్తుతూ ఎందుకు శాపనార్ధాలు పెట్టవలసి వచ్చింది. తాము అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని భయంతో బతుకుతున్నామని కుటుంబ సభ్యులు ఎందుకు ఆక్రోశించవలసి వచ్చింది? బాధిత కుటుంబ సభ్యులనెవ్వరూ కలుసు కోకుండా, వారిని, పరామర్శించకుండా, అనునయిం చకుండా.. ఎందుకా కఠిన ఆంక్షలు..? బాధితురాలి మరణ వాంగ్మూలంలో తాను అత్యాచారానికి గురయ్యానని స్పష్టంగా పేర్కొంటే, అసలు అత్యాచారమే జరగలేదని, అసలు వైద్య పరంగా రుజువులే లేవని అధికారికంగా ఉత్తర ప్రదేశ్‌ ‌పోలీసులు మీడియాకు ఎలా చెబుతారు.

వారెవరు జరిగిందో, లేదో నిర్ధారించడానికి??
బలాత్కారం ఒక పాశవిక చర్య ..! అంతకంటే ఎక్కువ బాధిత కుటుంబానికి యు పీ పోలీసులు అత్యాచారానికి గురయిన యువతి మృత దేహాన్ని అంత్యక్రియలకు అప్పగించక పోవడం ..! ఇటువంటి అమానవీయ చర్యను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ..ప్రధానంగా మీడియా పైన ఉంది.
– రోహిణి సింగ్‌

Leave a Reply