Take a fresh look at your lifestyle.

పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని తహశీల్దార్‌పై డీజిల్‌

  • తహశీల్దార్‌పై డీజిల్‌ రైతులు పోసుకుని…
  • శివ్వంపేటలో ఉద్రిక్తత

ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా మండల కేంద్రమైన శివ్వంపేట తహశీల్దార్‌ ‌కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పాసు పుస్తకాలు ఇవ్వడం లేదనీ, పాసు పుస్తకాలు ఇవ్వని కారణంగానే విద్యుద్ఘాతంతో మృతి చెందిన రైతు మాలోత్‌ ‌బాలుకు రైతు బీమా రాదనీ కోపోద్రిక్తులైన పలువురు రైతులు తహశీల్దార్‌ ‌భానుప్రకాష్‌పై డీజిల్‌ ‌పోశారు. వారూ పోసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే…శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తండాకు చెందిన రైతు మాలోత్‌ ‌బాలు సోమవారం విద్యుద్ఘాతంతో మృతిచెందాడు. మృతి చెందిన రైతు బాలుకు పాసు పుస్తకం రాలేదు. బాలు రైతు అయినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడంలో యేండ్లుగా జాప్యం చేయడంతో…విద్యుద్ఘాతంతో మృతి చెందిన బాలుకు రైతుబీమా రాదన్న ఆగ్రహంతో తాళ్లపల్లి తండాకు చెందిన రైతులు మంగళవారం రైతు బాలు మృతదేహంతో శివ్వంపేట తహశీల్దార్‌ ‌కార్యాలయం వద్ద ఆందోళను దిగారు.

మాలోత్‌ ‌బాలు కుటుంబానికి న్యాయం చేయాలని కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. పాసు పుస్తకం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేశారంటూ రైతులు కోపంలో తహశీల్దార్‌ ‌భానుప్రకాష్‌పై డీజిల్‌ ‌పోశారు. తాము ఆందోళన చేస్తున్నా తహశీల్దార్‌ ‌పట్టించుకోకపోవడంతో కార్యాలయం నుంచి బటయకు వెళ్తున్న భానుప్రకాశ్‌పై రైతులు డీజిల్‌ ‌పోయడంతో రైతులు కూడా వారిపై డీజిల్‌ ‌పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తహశీల్దార్‌తో రైతులు వాగ్వివాదానికి దిగారు. దీంతో తహశీల్దార్‌ ‌కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

రైతులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి పాసు పుస్తకాల కోసం సంబంధిత రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇప్పటి వరకు పాసు పుస్తకాలు రాలేదనీ ఆరోపించారు. విద్యుద్ఘాతంతో మృతి చెందిన రైతు బాలుకు కూడా రైతుబీమా రాదన్నారు. పాసు పుస్తకం ఉంటే రైతుబీమా వొచ్చేదన్నారు. శివ్వంపేట తహశీల్దార్‌ ‌కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతను తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పారు. ఎలాంటి సంఘటన జరగకుంగా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శివ్వంపేటలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వ్యాప్తంగా హాట్‌ ‌టాపిక్‌గా మారింది.

Leave a Reply