Take a fresh look at your lifestyle.

పాలకులకు రాష్ట్ర అభివృద్ధి పట్టదా ?

రాష్ట్ర అభివృద్ధిపై పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదు. ముఖ్యంగా బిజెపి, టిఆర్‌ఎస్‌లు ఇక్కడి అభివృద్ధి విషయంలో ఒక విధంగా దోబూచులాడుతున్నాయని సిపిఐ తీవ్రంగా విమర్శిస్తోంది. ఆ పార్టీ తాజా సమావేశంలో జాతీయ కౌన్సిల్‌ ‌మెంబర్‌ ‌తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు చేసిన కామెంట్‌ ‌నిజంగా ఆలోచించాల్సిన విషయమే. రాష్ట్రం విడిపోయేప్పుడు జరిగిన ఒప్పందాలను అమలు చేయించుకోవడంలో టిఆర్‌ఎస్‌, అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపించలేకపోయాయనడానికి రాష్ట్రంలో నాటినుండి నేటి వరకున్న పెండింగ్‌ ‌సమస్యలే నిదర్శనం. రాష్ట్ర విభజన ఒప్పందంలో భాగంగా కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌, ‌కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజక్టులకు జాతీయ హోదా, ములుగులో ట్రైబల్‌ ‌యూనివర్శిటీ ఏర్పాటు లాంటి అనేక విషయాలు ఎక్కడవేసిన గొంగళి అంటే అక్కడే అన్నట్లు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషించడం పక్కకు పెట్టి ఈరెండు పార్టీలు రాష్ట్రంలో రాజకీయ క్రీడలు కొనసాగి స్తున్నాయి.

ఎన్నికలు మరో రెండు సంవత్సరాలున్నప్పటికీ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఇప్పటినుండే పావులు కదుపుతున్నాయి. రాష్ట్రానికి అందాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల విషయంలో ఒకరిపై ఒకరు నిందారోపణ చేసుకోవడమేగాని, ఇరు పార్టీలు సామరస్యంగా తమ ప్రాంతానికి ఏం కావలన్న విషయంలోమాత్రం ఆలోచించడంలేదనడానికి నిత్యం రాష్ట్రంలో ఈ ఇరుపార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్దమే సాక్ష్యం. వాస్తవంగా తెలంగాణ ఏర్పడకముందునుండి కూడా హైదరాబాద్‌ ‌మినహా మిగతా తెలంగాణ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. హైదరాబాద్‌ ‌తర్వాతదిగా చెప్పబడుతున్న వరంగల్‌ ‌పూర్తిగా పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతమయింది. ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఆజంజాహి మిల్లు తప్ప మరే గొప్ప ఫ్యాక్టరీ నెలకొల్పబడలేదు. దాన్ని కూడా కొనసాగనివ్వకుండా ఉమ్మడి ఆంధ్ర పదేశ్‌ ‌లోనే చంపేశారు.

దాని పునరుద్దరణ, ఆ పక్కనే కాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో చేసిన పోరాటాలేవీ నేటికి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నేటికి దాదాపు అర్థ శతాబ్ధం గడిచిపోయింది. విభజన అనంతరమైనా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధిచెందు తుందేమోనని ఆశపడ్డారు. ప్రభుత్వఉద్యోగాలకు ఎలాగూ నోచుకోలేకపోతున్న యువతకు ఈపరిశ్రమలైనా ఉపాధిని కలిగిస్తాయని బ్రమపడ్డారు. ఆజంజాహి మిల్లు స్థానంలో అత్యంత ఆధునిక యంత్రాలతో మరో ప్రత్యమ్నాయ పరిశ్రమ వస్తుందని ఆశ చూపించారు. దారం తీయటం మొదలు బట్టలు నేయటం, డ్రస్‌లు తయారు చేయడం అంతా ఇక్కడే జరుగుతుందంటే నిజమే అనుకుని ఇంకా చకోర పక్షుల్లా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇకపోతే కాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ఇదొక ఆయుధంలా ప్రచారానికి తోడ్పడిందే తప్ప జరిగింది మాత్రం ఏమీలేదు. దీనిపై పెద్దగా ఉద్యమం జరుగుతున్నప్పుడే ఇక్కడ కాకుండా పంజాబ్‌లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడుతున్న క్రమంలోకూడా ఈ అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. విభజన చట్టంలో కూడా పొందుపర్చారు. కేంద్రంలో కొత్తగా బిజెపి ప్రభుత్వం రావడం, కొత్తగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడంతో చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలవుతాయని భావించారు. కాని, బిజెపి ప్రభుత్వం ఈ విషయాన్ని నేటి వరకు డ్రాగాన్‌ ‌చేస్తూనే ఉంది.

దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఇప్పటికే ఉన్న కోచ్‌ ‌ఫ్యాక్టరీలు తమ అవసరాలను తీరుస్తున్నాయని, అదనంగా మరో ఫ్యాక్టరీ పెట్టే ఆలోచన లేదని పార్లమెంట్‌ ‌సాక్షిగా కేంద్రం లిఖిత పూర్వకంగా తెలియజేసింది. కాని, 2018లో మహారాష్ట్రలోని లాతూర్‌లో దీని ఏర్పాటుకు పూనుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అడిగిన నాలుగు నెలల కాలంలోనే కేంద్రం అక్కడ ఫ్యాక్టరీని మంజూరి చేసి అందుకు కావాల్సిన నిధులను కూడా సమకూర్చిందంటే తెలంగాణపై ఆ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అనేక విన్నపాలకు ‘పిరియాడికల్‌ ఓవరాయిలింగ్‌’ ‌యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఈ రోజువరకు దాని విషయాన్ని పట్టించుకోలేదు. రాష్ట్రంలోని బిజెపి నాయ••త్వంకూడా తమ ప్రాంతానికి ఏదో ఒక యూనిట్‌ను సాధించుకుందామన్న చిత్తశుద్ధిని చూపించలేకపోతున్నది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట వద్ద 150 ఎకరాల భూమిని సేకరించినట్లు చెబుతోంది.

కాని, ఇంతవరకు తమకు ఆ భూమిని అందించలేదని కేంద్రం అంటున్నది. రాష్ట్రం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణిలో చేర్చిన తర్వాతే భూమిని తమకు అప్పగించాలంటోంది రైల్వే శాఖ. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో మాత్రం తెలియదు. వాస్తవానికి ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికి గాని ఈ ప్రాంతానికి గాని పెద్దగా ఒరిగేదేమీలేదన్న వాదన కూడా లేకపోలేదు. కోచ్‌ ‌ఫ్యాక్టరీ అయితే కాజీపేట చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అయితే దానికి కనీసం 1500 ఎకరాల భూమి అవసరంగా చెబుతున్నారు. అలాగే బయ్యారం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోద్య లేకపోవడంవల్లే కదలికలేకుండా పోతున్నదని కొందరు విమర్శిస్తుంటే, ఈ రెండు పార్టీలు ఒకటేనని, కావాలని ప్రజలను మభ్యపెడుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Manduva Ravinder Rao
( మండువ రవీందర్‌రావు )

 

Leave a Reply