వైద్య సిబ్బందితో సమానంగా తమకు కూడా 10 శాతం బోనస్‌తో పాటు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎంజిఎం ఆసుపత్రిలో సానిటేషన్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఎంజిఎం ప్రధాన గేటు ఎదురుగా బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఎంజిఎం బాధ్యులు రమేష్ మాట్లాడుతూ కొరోనాతో వైద్య సిబ్బందితో సమానంగా సానిటిషన్ సేవలు నిర్వహిస్తూ రోగాలు ప్రబలకుండా నిరంతరం శ్రమిస్తున్న సానిటేషన్ కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇప్పటికే పలు రోగాల భారీన పడి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
వైద్య సిబ్బందితో సమానంగా పిపిఈ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంజిఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావుకు వినత పత్రం అందజేశారు. కాగా ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో చర్చలకు ఆహ్వానించడంతో ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సానిటేషన్ కార్మికులు ధర్నా చేయడంతో సానిటేషన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.