- పారదర్శకంగా లావాదేవీలు..పైసా లంచం ఇవ్వాల్సిన పనిలేదు
- సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలుగా 570 ఎమ్మార్వో ఆఫీసులు
- మేడ్చల్ జిల్లా మూడుచింతలలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ భారతదేశానికి ట్రెండ్ సెట్టర్ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. మేడ్చెల్ జిల్లా మూడు చింతల పల్లిలో ధరణి పోర్టల్ ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గత పాలకులు రెవెన్యూ చట్టాలు, భూ విధానాలకు శ్రీకారం చుట్టారని, కొన్ని ఫలితాలు ఇచ్చాయని, కొన్ని వికటించాయని, కొన్ని ప్రజలకు లాభం కలిగించాయని, ఇబ్బందులు కలిగించాయని, వాటన్నింటికీ శాశ్వత నివారణ కావాలని, తెలంగాణ రైతాంగం ఎలాంటి అటుపోట్లకు గురికావొద్దనే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చట్టం కోసం నిర్ణయం తీసుకున్నట్లు కెసిఆర్ తెలిపారు. తెలంగాణ తీసుకుని వచ్చిన ఈ పోర్టల్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయని అన్నారు.
ఒక తప్పు జరిగితే అనేక తరాలు ఇబ్బంది పడుతాయని, తప్పటడుగులు లేకుండా సరైన పంథాలో ముందుకెళ్లాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు ప్రజల బతుకంతా భూమి చుట్టూ ఉండేదని, అందుకే భూమికి ప్రాధాన్యత ఉండేది కాదన్నారు. కానీ క్రమపద్ధతిలో, నిర్ణీత పద్ధతిలో వ్యవసాయం చేయడం నేర్చుకున్న తర్వాత భూమికి విలువ పెరిగిందన్నారు. ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. సాగువిధానంలో అధునాతన మార్పులు వచ్చి ఆస్తిగా మారింది. రైతుల భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని ధరణి పోర్టల్ రూపకల్పన చేశామని, కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా వారి భూముల వివరాలు ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చన్నారు. ధరణి పోర్టల్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు ఉండదు. తప్పు చేసే అధికారం నాకులేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. వి•-సేవ, ధరణి పోర్టల్, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూముల రిజిస్టేష్రన్లు చేసుకోవచ్చు. ధరణి పోర్టల్ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్ పక్రియ చేసుకోవచ్చని సీఎం కెసిఆర్ వివరించారు.