వర్గల్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన మం్రతి హరీష్రావు
యావత్ దేశం మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలకు అవినీతి రహిత, స్వచ్ఛమైన, పారదర్శకమైన, వేగవంతంగా పరిపాలన సేవలు అందించాలన్న ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్ ధరణిని ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలో ధరణి వెబ్సైట్ ఎలా అమలు చేస్తున్నారని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు పది నిమిషాలు సేపు వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన వెంకట్ గౌడ్, మాసాయిపేట గ్రామానికి చెందిన శంకర్ భూ క్రయవిక్రయాలు జరిగే భూమి అమ్మిన, కొన్న వారితో చర్చించి, ధరణిలో ఇబ్బందులు లేకుండా అమలు జరుగుతున్నదా? లేదా? అంటూ ఆరా తీశారు. ఎలా జరిగిందని చూస్తే.. పది నిమిషాలలో వెంకట్ గౌడ్ భూమి అమ్మడం, శంకర్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ భూమి ట్రాన్స్ఫర్, మ్యూటేషన్, పట్టాదారు పాసు పుస్తకం కూడా ఇవ్వడం జరిగిందని భూ క్రయవిక్రయదారులు ప్రభుత్వ పనితీరుపై మంత్రితో సంబురాన్ని వ్యక్తం చేశారు.
ఈ మేరకు భూ క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. 15 నిమిషాల వ్యవధిలోనే రైతులకు భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్ జరగడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడం.. ఇలా పారదర్శకంగా వేగంగా జరగడం ఇది దేశంలోనే ఒక రికార్డుగా మారిందని తెలిపారు. గతంలో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా, కాళ్ల చెప్పులు అరిగినా, అనేక వ్యయ ప్రయాసాలకు లోనైనా భూ మార్పిడి జరగడంలో గానీ, పట్టాదారు పాసు పుస్తకం రావడానికి రైతులు చాలా కష్టాలు పడ్డారని మంత్రి గుర్తు చేశారు. సిఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త విధానాన్ని ధరణి పద్ధతిలో ప్రజల ముందుకు తెచ్చారని, ధరణి ఉద్దేశ్యం రైతులు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు, రైతుల డబ్బు ఖర్చు కావొద్దు, రైతులకు సులభంగా ఒకేసారి పని జరగాలని, గతంలో రిజిస్ట్రేషన్, తహశీల్దార్, పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగేదని, సదరు రైతు 3-ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని మంత్రి వివరించారు.