- పోర్టల్ కుంభకోణాన్ని పరిశీలించాలి
- ఏడాదయినా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు
- పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 20 : ధరణి పోర్టల్‌ను తీసుకు వొచ్చి ఏడాది దాటిన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదనే విమర్శలు వొస్తున్నాయి. ఇదే విషయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ..ధరణి పోర్టల్ కొత్త సమస్యలకు నెలవుగా మారిందని ఫైర్ అయ్యారు. నిర్వహణ లోపమా లేదా భారీ భూ కుంభకోణమా తేలాల్సిన అవసరం ఉందన్నారు. ‘నిముషాల వ్యవధిలో భూముల రిజిస్ట్రేషన్ అని ఆర్భాటంగా ప్రకటించిన ధరణి..కొత్త సమస్యలకు నెలవుగా మారింది. భూమే ప్రాణంగా బతికే రైతు ఆ భూ హక్కు కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి వొచ్చింది. ఇది నిర్వహణ లోపమా! భారీ భూ కుంభకోణమా!? తేలాల్సిన అవసరం ఉంది’ అని రేవంత్ డిమాండ్ చేశారు. భూరికార్డుల ఎంట్రీలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు రైతులను వెంటాడుతున్నాయి.
భూమి ఉండి, కాస్తులో ఉన్నా కొందరికి పాస్ బుక్స్ రాలేదు. మరికొందరికి భూమి లేకపోయినా పాస్ బుక్స్ వొచ్చాయి. కొన్ని చోట్ల భూమి ఉండి, కొత్త పాస్ బుక్స్ కలిగి ఉన్నా ధరణి పోర్టల్‌లో చూస్తే ఆ వివరాలు కనిపించట్లేదు. సమస్యలు పరిష్కరిచాంటూ రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని సర్కార్‌పై మండిపడ్డారు.