Take a fresh look at your lifestyle.

ఆరు శాతం తగ్గిన నేరాలు

  • నేరరహిత తెలంగాణ కోసం నిరంతర కృషి
  • నేరం చేస్తే దొరికిపోతామనేలా కఠిన చర్యలు
  • త్వరితగతిన కేసుల ఛేదనకు కృషి
  • రాష్ట్ర వార్షిక నివేదికను విడుదల చేసిన డిజిపి మహేందర్

‌నేర, మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో నేరం చేయాలంటేనే భయం కలిగేలా పరిస్థితిని తీసుకుని వొచ్చామన్నారు. అలాగే ఎలాంటి కేసులనైనా త్వరితంగా ఛేదించడంలో విజయం సాధించామని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో ఆరు శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ప్రకటించారు. హత్యల్లో 8.59శాతం, ప్రాపర్టీ క్రైమ్‌లో 21శాతం, దోపిడీల్లో 28, రాబరి 33శాతం, చైన్‌స్నాచింగ్‌ 46‌శాతం తగ్గాయని చెప్పారు. అలాగే మహిళలపై నేరాలు 1.92శాతం, వైట్‌కాలర్‌ ‌నేరాలు 42శాతం, రోడ్డు ప్రమాదాలు 13.9శాతం తగ్గాయన్నారు. ఈ ఏడాది 54 శాతం ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. తెలంగాణ, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం నాలుగు కేసుల్లో మరణ శిక్షణలు పడ్డాయన్నారు. ఆసిఫాబాద్‌ ‌లింగాపూర్‌, ‌వరంగల్‌, ‌రాచకొండ కమిషనరేట్‌ ‌పరిధిలోని రెండు కేసుల్లో మరణ శిక్షలు పడ్డాయన్నారు. ఫంక్షనల్‌ ‌వర్టికల్‌ ‌సిస్టం అమలు ద్వారా పోలీసుల పనితీరు మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు.

బుధవారం ఆయన తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అభయహస్తంలా సేవలందిస్తున్నామన్నారు. డయల్‌ 100, ‌డయల్‌ 112 ‌ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామని, ఫిర్యాదు వొచ్చిన ఎనిమిది నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లు, ఏరియాల్లో ఒకే రకమైన సేవలు అందించేందుకు ఫంక్షనల్‌ ‌వెర్టికల్‌ ‌సిస్టమ్‌ అమలు ద్వారా పోలీసుల సేవలు మరింత మెరుగుపరిచామన్నారు. ప్రతి ఉద్యోగి పనితనాన్ని మెరుగుపరిచేందుకు స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌, ‌స్పెషలైజేషన్‌ ‌తీసుకువొచ్చేందుకు ఫంక్షనల్‌ ‌వెర్టికల్స్ ఎం‌తో ఉపయోగపడ్డాయన్నారు. పోలీస్‌ ‌సేవలు అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు, మరింత సులువుగా అందుబాటులో ఉండేలా సామాజిక మాధ్యమాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్‌, ‌వాట్సాప్‌, ‌ట్విట్టర్‌, ‌హాక్‌ ఐ ‌ద్వారా అవగాహన కల్పించి, ఫిర్యాదులు తీసుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణలో నేరం చేస్తే దొరికిపోతామని, శిక్షపడుతుందనే అనే భయాన్ని నేరస్థుల్లో తీసుకువొచ్చామని చెప్పారు. రాష్ట్రమంతా పీపుల్స్ ‌ఫ్రెండ్లీ, స్మార్ట్ ‌పోలీసింగ్‌ ‌విధానం తీసుకువొచ్చి ప్రజలకు మరింత చేరువైనట్లు చెప్పారు. రాష్ట్రంలోకి మావోయిస్టుల పునః ప్రవేశాన్ని సమష్టి కృషితో అడ్డుకున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.

Leave a Reply