Take a fresh look at your lifestyle.

వైకుంఠ ఏకాదశిన తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో ఆలయాలన్నీ కళకళలాడాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ జాము నుంచే ఆలయాల వద్ద క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల, అన్నవరం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం తదితర అన్ని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. తిరుమల  శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ప్రముఖులు,మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  ఉదయం 2 గంటల నుంచే వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకున్నారు. అనంతరం ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ద్వారం దర్శనం ఈ నెల 11 వరకు అనుమతించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నది. శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

శ్రీరంగంలో వైకుంఠ శోభ
భారీగా తరలివచ్చిన భక్తులు…ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు

చెన్నై, జనవరి 2 : తమిళనాడులోని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి వారి దేవాలయంలో వైకుంఠ దర్శనాలకు భక్తులు పోటెత్తారు. వేకుమజాము నుంచే భక్తులకు దర్శనాలకు అనుమతించారు.  వైకుంఠ  ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారాలు తెరచి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. మిగిలిన రోజులలో ఈ ద్వారం మూసి ఉంటుంది. పురాణాల ప్రకారం రంగనాథస్వామి దక్షిణ ముఖంగా నిలిచి ఉత్తర ముఖంగా ఉన్న విభీషణుడికి దర్శనమిచ్చాడని చెబుతారు. అక్కడ 20 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరంగనాధులు ఇక్కడ స్వయంగా వెలిశారిన ప్రతీతి. రంగనాధుడిని నిత్యం ఇక్కడ కొలిచేందుకు విభీషణాదులు వస్తారని అంటారు. స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు దేశంలోని నలుమూలలనుంచి ఇక్కడికి తరలివచ్చారు. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆచరించాల్సిన పూజా విధిని పెద్దలు సూచించారు. దాని ప్రకారం, సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించాలి.

శుచిగా పూజా మందిరంలో శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ పరమశివుని బిల్వదళాలు, శంఖం, పూలు, తులసి దళాలతో అర్చించాలి. ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్యం వైపు చూసే విధంగా దీపాలు వెలిగించాలి. ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఈ రోజు లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించాలి. పూజానంతరం నేతిలో పెసరపప్పు, బియ్యం వేయించి ఉడికించిన పొంగలి నివేదన చేయాలి. ఏకాదశి వ్రత ప్రభావం వలన జన్మజన్మాంతరాల నుంచి పీడిస్తున్న బాధలు తొలగిపోయి, ఐశ్వర్యం, సుఖ జీవన ప్రాప్తి కలుగుతాయన్నది పురాణ ప్రవచనం. ఈ క్రమంలో ఏటా శ్రీరంగం శ్రీరంగనాధుడిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు.

Leave a Reply