తిరువనంతపురం, డిసెంబర్ 12 : కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల భక్తుల తాకిడితో కిటకిటలాడుతుంది. కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతోంది. స్వామి దర్శనానికి గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులు అత్యధిక సంఖ్యలో శబరిమలకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. దిగువన పంబ నుంచి సన్నిధానం వరకూ ఆరు కిలోటర్ల మేర క్యూలైన్ భక్తులతో నిండిపోయింది.కాగా, గత కొద్ది రోజుల నుంచి రోజుకు లక్ష మంది అయ్యప్పను దర్శించుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
సోమవారం 1,07,260 మంది స్వామి దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకు న్నట్లు వెల్లడించారు. శనివారం లక్ష, ఆదివారం 1.10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు. మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నదానం, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.