పదిలక్షల సిసి కెమెరాల ఏర్పాటు చేయాలి
పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్నందున రక్షణకు ప్రాధాన్యం
పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరాన్ని అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, అందులో భాగంగా 10 లక్షల కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలు గుమిగూడే ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. సైబర్ క్రై నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులకు మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షితంగా నగరంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి పెద్దఎత్తున పెట్టుబడులతో పాటు పట్టణీకరణ లో భాగంగా నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రస్తుతమున్న సీసీ కెమెరాలకు తోడుగా నూతనంగా పట్టణీకరణ చెందుతున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాట్లపై న పరిసర మునిసిపాలిటీలు కార్పొరేషన్లలో తో కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సూమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులకు మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలో మొత్తం పది లక్షల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరమని, ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్న నగరం హైదరాబాద్ అని ఒక రిపోర్ట్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, ఆ దిశగానే ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్లో శాంతి భద్రతలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతి భద్రతలను సాఫీగా కొనసాగించి పరిస్థితులను ముఖ్యమంత్రి సంకల్పించార ని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు గుమిగూడే ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులకు కేటీఆర్ సూచించారు. అంతేకాకుండా నూతన ఫ్లై ఓవర్లు, రోడ్లు, పార్కులు, బస్తీ దవాఖానల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. త్వరలో తీసుకురానున్న నూతన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చట్టాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ప్రత్యేక అంశాలను చేర్చాల్సిన అవసరం ఉన్నదా అని ఈ సందర్భంగా పోలీసు అధికారులను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పోలీస్ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసి తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రై కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రై సిబ్బందితో పాటు సైబర్ వారియర్లను పోలీస్ శాఖ తయారు చేసుకోవలసిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు హాజరయ్యారు.