Take a fresh look at your lifestyle.

అభివృద్ధి అంటే…రోడ్లు, భవనాలే కాదు… పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే

  • సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు
  • నాణ్యతలో రాజీ పడొద్దు
  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…
  • పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు
  • పల్లె, పట్టణ ప్రగతిపై సన్నాహక సమీక్షలో మంత్రి హరీష్‌రావు

అభివృద్ధి అంటే… భవనాలు, రోడ్లే కాదు. పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్‌ ‌వ్యాధులు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు చేపట్టాలి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పల్లె, పట్టణాలభివృద్ధికి ఇలాంటి కార్యక్రమం అమలు కావడం లేదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు బుధవారం సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్‌ ‌మహతి ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి అధ్యక్షతన నాల్గో విడత పల్లె, పట్టణ ప్రగతిపై సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పట్టణ, పల్లె ప్రగతి పనులపై అంశాల వారీగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి ముగిసిన 10 రోజుల తర్వాత అధికారులతో సమీక్షిస్తా. లోటుపాట్లు ఉంటే ముందే సవరణలు చేసుకునేలా బాధ్యతలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలానికో బృహత్‌ ‌పల్లె ప్రకృతి వనం 10 రోజుల్లో ప్రారంభించాలని ఈ బాధ్యతలను ప్రజాప్రతినిధులు తీసుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు 80 ట్రాక్టర్లు ఉండేవి.

కానీ, ఇవాళ రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఉన్నాయనీ, రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలకుగానూ 19 వేల 298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు, అదనంగా పలు గ్రామాల్లో రెండు చొప్పున 7 వేల పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు అయ్యాయని మంత్రి వెల్లడించారు. దేశంలో ఏ పల్లెకు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు నర్సరీ, డంప్‌ ‌యార్డు, వైకుంఠ ధామం ఉన్నాయనీ, తూతూ మంత్రంగా పని చేయొద్దు, సెలవులు పెట్టొద్దు. యుద్ధప్రాతిపదికన పల్లె, పట్టణ ప్రగతి సాధనలో ఆదర్శంగా నిలిచేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె, పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంకు హరీష్‌రావు సూచించారు.

ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని, హరితహారంలో నాటిన మొక్కలతో రోడ్లకు ఇరువైలా చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలన్నారు. విద్యుత్‌ ‌లైన్సు, పోల్‌ ‌షిఫ్టింగ్‌ ‌వంటి పెండింగ్‌ ‌పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల గ్రామానికి, మున్సిపాలిటీకి నిధులు అందిస్తున్నాం. సమస్యలకు పరిష్కారం వెంటనే చూపాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతీ నెలా నిధులు విడుదల చేస్తున్నట్లు, ఇప్పటికే ఈజీఎస్‌ ‌కింద సిద్ధిపేట జిల్లాలో 28 కోట్ల 32 లక్షల రూపాయలు బిల్లు క్లియరెన్స్ ‌చేశాం. పెండింగ్‌ ‌బిల్లులు ఉంటే ప్రతిపాదనలు ఇవ్వండి రెండు రోజుల్లో క్లియరెన్స్ ‌చేయిస్తాననీ అన్నారు. పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవు. వీరిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యులేననీ అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులు అమలుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను నియమించినట్లు మంత్రి తెలిపారు.

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు…
పనులు నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కంపోస్ట్ ‌షెడ్స్ ‌నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా చెత్త సెగ్రిగేషన్‌ ‌జరగాలని, వాటిని వాడుకలో తీసుకు రావాలని, చెత్త సేకరణ చేసి డంప్‌ ‌యార్డ్ ‌తరలించి చెత్త వేరు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు చెబుతూ వారి స్కెల్‌ ‌వేతనాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ‌సుముఖత వ్యక్తం చేశారని, ఏప్రిల్‌ ‌మాసం నుంచే అమలు జరగనున్నట్లు మంత్రి వెల్లడించారు. పల్లె ప్రగతిలో గ్రామ సర్పంచ్‌ అకౌంట్‌లోకి నేరుగా, పట్టణ ప్రగతిలో మున్సిపల్‌ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పాడుబడ్డ బావులు, బొందలు, బోర్లు ఉంటే వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడ కూడా విరిగిపోయిన కరెంట్‌ ‌స్తంభాలు, తుప్పు పట్టినవి ఉంటే వెంటనే తొలగించాలన్నారు. గ్రామాలలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోకుండా చూసి కావాలంటే అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయించాలనీ, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనులు ముమ్మరం చేయాలని విద్యుత్‌ ‌శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పల్లె, పట్టణ ప్రగతిని ఎప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మిక తనిఖీ చేసి అవకాశం ఉందన్నారు. ఈ యాసంగిలో 4లక్షల 90 వేల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం పండించినం. ఇదంతా కాళేశ్వరం జలాలతో సాధ్యమైందన్నారు. – జిల్లాలో పామాయిల్‌ ‌తోటలు పెంపు, సాగునకు యోగ్యమై ఉన్నదని, ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగు, మల్బరీ సాగు విరివిగా చేపట్టేలా రైతులను చైతన్యం చేయాలని ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాధవనేని రఘునందన్‌నావు, రసమయి బాలకిషన్‌, ‌వొడితెల సతీష్‌కుమార్‌, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డితో పాటు జిల్లాలోని అన్ని శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply