- ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్
కొరోనా వ్యాప్తి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే, ఆ వైరస్‌తో కలసి జీవించే వ్యూహాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొరోనా ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో కచ్చితమైన ప్రణాళిక అవసరమని స్పష్టం చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో కొరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్
కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శులు నర్సింగరావు, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలనీ, వైరస్ వచ్చిన వారిని ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందించాలనీ, కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు నిర్వహించడంతో పాటు ఒకరి వైపు నుంచి మరొకరికి సోకకుండా కచ్చితమైన క్వారంటైన్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇప్పటికే అన్ని రకాల పరికరాలు, మందులు సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామనీ, వైద్యపరంగా అత్యుత్తమంగా స్పందిస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కొరోనాతో పోరాడుతూనే ఆర్థిక కార్యకలాపాలు సాగాలనీ, గ్రీన్,ఆ రెంజ్ జోన్లలో సడలింపుల కారణంగా కొన్ని పనులు అవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులను ఎలా అమలు చేయాలి ? ఎలాంటి వ్యూహం అనుసరించాలి ? హైదరాబాద్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? ఏయే రంగానికి సదలింపులు ఇవ్వాలి ? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి తదితర అంశాలలో అధికారులు లోతుగా ఆలోచించి ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.