Take a fresh look at your lifestyle.

వికటిస్తున్న ప్రజారోగ్యం

కల్తీ మరియు కాలుష్యం అనే అంశాలపై  అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా దృష్టి సారించకపోతే ప్రజలంతా వయోబేధం లేకుండా జీవితాంతం అనారోగ్యంతో జీవశ్చవాల్లా జీవించే రోజులు దగ్గర పడుతున్నాయి. కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై ఆసుపత్రులకు అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా తయారైన ‘‘కల్తీ’’ ఆహార పదార్థాలను,నకిలీ ఔషధాలను నియంత్రించి ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా అభివృద్ది చెందుతుంది.కోట్లకు పడగలెత్తాలనే దురాశతో నిత్యావసర వస్తువులను కూడా కల్తీ చేస్తూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్న  కల్తీ మాఫియాను కూకటి వేళ్ళతో సహా పెకలించక పోతే ప్రజలంతా అనారోగ్య వంతులై దేశ పురోగతికి అవరోధం గా తయారయ్యే పరిస్థితులు ఏర్పడతాయి.కల్తీ ప్రపంచంలో కల్తీ కారకులు కోట్లకు పడగలెత్తి, ఆకాశహర్మ్యాల్లో  నివసిస్తూ, విలాసాల్లో  విహరిస్తుంటే కల్తీ భూతానికి  బలై  కాటికి పోతున్న  వారెందరో. కల్తీ ఘోరకృత్యాలకు  నిరంతరం నరకయాతన అనుభవిస్తున్న ప్రజలకు న్యాయం జరగాలి. నకిలీ దందా నుండి  విముక్తి కలిగించినప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతారు.ఉన్నరోగానికి మందు వేస్తే లేని రోగం పుట్టుకురావడం కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. శాస్త్రపరిశోధనా ఫలాలు  లేని సమస్యలను పుట్టించాయి.
ఆధునిక పరిజ్ఞానం విలాసాలను పెంచింది. కాలుష్య కారకాలకు పరోక్షంగా సాయపడింది. నిత్యావసర వస్తువులన్నీ నిత్య నూతన పరిజ్ఞానంతో భయంకరమైన కల్తీతో భయకంపితులను చేస్తున్నాయి. పాలు,నీరు ఇతర  ఆహార పదార్థాలన్నీ కల్తీతో నింపబడుతున్నాయి. కల్తీ కారకుల తెలివి తేటలతో, ప్రజలంతా బెంబేలెత్తి పోతున్నారు. రోగాలతో జనం నరకం అనుభవిస్తుంటే, రోగులతో ఆసుపత్రులు కళ కళలాడుతున్నాయి. జనజీవితాలు కళతప్పి  ఘోషిస్తున్నాయి.’’ బ్రతుకంతా భయం…చావే నయం’’ అనే విధంగా రోగాలకు తట్టుకోలేక ఆర్థిక బాధలు భరించలేక సామాన్యులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.కల్తీ ఆహార పదార్థాల యొక్క వాడకం వలన కేన్సర్‌,‌పక్షవాతం మరియు పలురకాల చర్మ సంబంధమైన సమస్యలు ఏర్పడుతున్నాయి.శరీర అవయవాలు చెడిపోయి అకాల మరణాలు  సంభవిస్తున్నాయి. కల్తీ ఆహార పదార్థాల నుండి ప్రజలను రక్షించడానికి  అమల్లోకి వచ్చిన చట్టాలు తమ లక్ష్యసాధనలో విఫలమౌతున్నాయి. పటిష్ఠమైన ఆహార కల్తీ నిరోధక చట్టాలు రావాలి. వాటి అమలులో చిత్తశుద్ధి కావాలి.ఆరోగ్యాలు చెడి, రోగాలతో ఆసుపత్రుల పాలైతే ఆదుకునే నాథుడెవరు? ఖరీదైన వైద్యానికి ఆసుపత్రులకు నైవేద్యం చెల్లించుకోలేక సామాన్య ప్రజానీకం తల్లడిల్లి పోతున్నారు.
కిడ్నిలు చెడి,కేన్సర్‌, అల్సర్‌, ఉదర, శ్వాసకోశ వ్యాధులు పట్టి పీడిస్తే,వైద్యం చేయించుకునే స్థోమత లేక గతిస్తున్న మధ్య తరగతి ప్రజల దయనీయ గాథలు చెప్పనలవి కాదు. చిరుప్రాయం లోనే కంటి చూపు పోవడం,పక్షవాతం,గుండె జబ్బులు,కాలేయ సంబంధిత వ్యాధులు ప్రబలుతుంటే భావితరాల భవితవ్యం ప్రశ్నార్ధక మౌతున్నది. నిగనిగలాడే సరుకుల్లో నిండా మోసం-నిలువునా ముంచే ద్రోహం. కాసుల కక్కుర్తితో కల్తీకి తెగబడి, మాటల గారడీతో దర్జాగా,దర్పంగా ప్రజల జేబులకు చిల్లుపెట్టే  కల్తీ కేటుగాళ్ళ వ్యాపార దందాను నిలువరించడం సాధ్యమా? అవినీతికి,కల్తీకి మధ్య అవినాభావ సంబంధముంది.కల్తీ అనేది అవినీతి వృక్షానికి ఒక శాఖ వంటిది. కల్తీతో ప్రజలను మోసం చేసి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేసి కోట్లకు పడగలెత్తి, ఆకాశహర్మ్యాలను నిర్మించే కల్తీ వ్యాపారులను కట్టడి చేయాలి. కల్తీ మాఫియా విశృంఖల విహారం చేస్తున్నది. పంచభూతాలను తమ కల్తీ సామ్రాజ్యంలో బంధించి కాసుల గలగలల మధ్య, సకలసుఖాలనుభవించే స్వార్ధపరులు తాము సంపాదించిన ఐశ్వర్యమంతా  అమాయకుల చెమట చుక్కలతో తడిసి తమభో షాణాల్లో చేరిందని గ్రహించాలి.
ఆధునిక ప్రపంచం నేడు అనేకమైన భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అయినా ఎవరికీ రాబోయే విపరీత పరిణామాలపై ఎలాంటి భయం లేదు. ఈ పూట గడిస్తే చాలు అనే ధోరణి ప్రబలిపోయింది. ప్రపంచం కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నది. అంతు తెలియని వింత రోగాలతో జనమంతా కకావికలమైపోతున్నారు. పంచభూతాలు కాలుష్యంతో నిండిపోయాయి.మానవ జీవితాలు దినదిన గండం లా తయారైనాయి.నూరేళ్ళ ఆయుస్సు కు కాలం చెల్లింది.రోగాలకు బాల్యం,యవ్వనం,వృద్ధాప్యం అనే వ్యత్యాసం లేదు. గర్భస్థ దశ నుండే రోగాలు పీడించుకు తింటున్నాయి.తినే తిండి,త్రాగే నీరు,పీల్చే గాలి అన్నీ కలుషితాలుగా మారిపోయిన నేపథ్యంలో మానవాళి బ్రతుకు నీటి బుడగలా మారిపోయింది.  ఒకప్పటి తరం ఈనాటి సుఖాలు అనుభవించలేదు. కాయకష్టం చేసి  బలవర్ధకమైన ఆహారం భుజించి,నిండు నూరేండ్లు ఆరోగ్యంగా జీవించే వారు. నేడు విజ్ఞానం పెరిగింది.విలాసాలు పెరిగాయి. విలాసాలు కూడా అవసరాలుగా మారిపోయాయి. ఎలాంటి ఆహారం భుజించినా నిస్సత్తువ ఆవహిస్తున్నది. ఆరోగ్య వంతమైన జీవన విధానం విధ్వంసమైపోయింది. వినూత్నమైన ఆవిష్కరణలు, విలాసవంతమైన జీవన శైలి, క్రొంగొత్త  ఆహారపుటలవాట్లు మనిషి ఆయుస్సును హరించి, కాలం తీరకుండానే కాటికి పంపుతున్నాయి.గాలిలో నాణ్యత తరిగింది. విషవాయువులను పీల్చి, రసాయనాలతో నిండిన ఆహార పదార్థాలను భుజిస్తున్నారు. సహజ సిద్ధమైన వాతావరణాన్ని నాశనం చేసి,కృత్రిమమైన అలవాట్లకు లోనై మానవ జీవితం అస్తవ్యస్తంగా మారింది. కాలుష్య ప్రపంచంలో అంటురోగాలతో నిరంతరం చస్తూ, బ్రతుకుతూ అతలాకుతల మౌతున్న మానవ జీవితం ఇలా ఎన్నాళ్ళు మనుగడ సాగించగలదు ప్రభుత్వాలు, ప్రజలు, అంతర్జాతీయ సంస్థలు కల్తీ మరియు కాలుష్య కారకాల విషయంలో కఠిన వైఖరి అవలంభించాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు నిలిపివేయాలి. ప్లాస్టిక్‌ ‌తయారీ యూనిట్లను తక్షణమే మూసివేయాలి. నగరాలు మురికి కూపాలుగా మారకుండా పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. భూతాపం పెరగడానికి కారణాలను విశ్లేషించి, భూఉపరితల ఉష్ణోగ్రతలను అదుపు చేయాలి. పలు దేశాలు తమ వ్యాపార సౌధాలు నిర్మించు కోవడానికి  ఇతర దేశాలపై తమ అభిప్రాయాలను, ప్రణాళికలను బలవంతంగా రుద్దే ప్రయత్నంలో ప్రజలను పావులుగా మార్చుతున్నాయి. ఇకనైనా ఈ ధోరణి మారాలి. పంటపొలాల్లో రసాయనాల,పురుగు మందుల వాడకాన్ని కనీస స్థాయికి తగ్గించాలి. దిగుబడులు తగ్గకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. శ్రీలంక మాదిరిగా కాకుండా అంచెలంచెలుగా సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులకు  చేరువ చేయాలి. ఇందుకోసం పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. కల్తీ మరియు కాలుష్య కారకాలను నిలువరించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి.
image.png
సుంకవల్లి సత్తిరాజు,  9704903463

Leave a Reply