Take a fresh look at your lifestyle.

దిగజారుతున్న జర్నలిజం ప్రమాణాలు

సామాజిక మాధ్యమాల హవా పెరిగిన తర్వాత జర్నలిజం ప్రమాణాల్లో మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. వార్తకు ప్రామాణికతను ఎవరూ పాటించడం లేదు. అదిగో పులి అంటే,ఇదిగో తోక అనే తీరులో మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన తర్వాత జాతీయ మీడియాకు వద్దన్నా డబ్బు అన్న చందంగా , వద్దన్నా వార్తలూ, కథనాలూ మీడియా ముందు వాలుతున్నాయి. ప్రింట్, ప్రసార మాధ్యమాల్లో ఈ మధ్య పెరిగిన పోటీ ఎంత వరకూ దారితీస్తోందంటే, అసలు కన్నా చిలవలు, పలవలతో అల్లిన కథనాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సుశాంత ఆత్మహత్య బాలీవుడ్ తీవ్రమైన కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్ కలిగిన యువనటుడు అర్థంతరంగా తనువు చాలించాడంటే అది సంచలనం కలిగించే వార్తే. సందేహం లేదు. అయితే, అలాంటి వార్తలు, కథనాలకు ప్రచారం ఇవ్వడంలో మీడియా సంయమనాన్ని పాటించాలన్న

ఇంగితాన్ని జాతీయ మీడియా పాటించడం లేదు. సుశాంత్ ఆత్మహత్యకు కారణాలపై ఇప్పటికి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటినీ పక్కకు తోసేసి ఇప్పుడు డ్రగ్స్ మాఫియా కోణం ప్రధానమైన కథావస్తువుగా మారింది. సాధారణంగా మాఫియా ప్రమేయం ఉన్న వార్తలు ఎక్కువ సంచలనాన్ని సృష్టిస్తుంటాయి. మొదట్లో అతడు పరిశ్రమలో సీనియర్లు తన పట్ల అవమానకరంగా వ్యవహరించినందుకు అవకాశాలు రాకుండా చేసినందుకు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. పోటీ ప్రపంచంలో ఇలాంటివన్నీ సాధారణమే కనుక, అతడు అంత సున్నితంగా ఉంటే ఎలా అనే కథనాలు వెలువడ్డాయి. బాలీవుడ్ లో అధోజగత్ ముఠా (అండర్ వరల్డ్ గ్యాంగ్)ల ప్రమేయం, పెట్టుబడులు పెరగడంతో ఆ పరిశ్రమలో కొత్త వారు స్థిరపడటం కష్టమేనన్న కథనాలు కూడా వెలువడ్డాయి.ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు బాలీవుడ్ లో మరో సంస్కృతి ప్రవేశించింది. అదే మాదక ద్రవ్యాల సంస్కృతి., ఎంత ఎత్తు ఎదిగితే అంతగా మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధాలు పెట్టుకున్న నటులు ఎఁతో మంది ఉన్నారు. వారిలో సునీల్ దత్, నర్గీస్ దత్ ల కుమారుడు సంజయ్దత్ ప్రముఖుడు. సంజయ్ దత్ డ్ర్రగ్స్ మాఫియాతోనే కాకుండా, ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు పెట్టుకుని ముంబాయి పేలుళ్ళ కేసులో నిందితులతో పాటు జైలుకు కూడా వెళ్ళి చాలా కాలం ఉన్నారు. అప్పట్లో అది సంచలనం కలిగించిన పెద్ద వార్త ఇప్పుడు అలాంటివి టాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్ ,శాండల్ వుడ్ సహా అన్ని భాషల సినీ రంగాలలోనూ అత్యంత సాధారణం అయ్యాయి. అయితే,సుశాంత్ ఆత్మహత్య విషయంలో మాత్రం జాతీయ మీడియా , దాంతో పాటు వివిధ భాషల ప్రసార,ప్రచార మాధ్యమాలు అతిని ప్రదర్శ స్తున్నాయన్న అభిప్రాయం జనంలో నెలకొంది.

సుశాంత ఆత్మహత్య సంఘటన పై రోజూ బ్రేకింగ్ న్యూస్ శీర్షికలో సంచలనాత్మక వార్తలు ప్రసారం అవుతున్నాయి. వీటిలో వాస్తవికత ఎంతో ఎవరి మాటుకు వారు నిర్ధారణ చేసుకోవల్సిందే. ఇది ఒక విధంగా మీడియా కమ్ జ్యుడిషయల్ సర్కస్ గా తయారైంది. గడిచిన రెండు మాసాలుగా మీడియాలో మరి ఏ వార్తకూ లభించనంత ప్రాధాన్యం సుశాంత్ ఆత్మహత్యకు లభిస్తోంది. ఈ క్రమంలో మీడియా లో కోవిడ్ -19 కేసుల గురించిన వార్తలు మరుగున పడిపోతున్నాయి. కోవిడ్ వల్ల దేశంలో ఎంతో మంది అకాల మరణం పాలవుతున్నారు. ముఖ్యంగా, సరైన సౌకర్యాలు, వైద్య పరికరాలు లేకపోవడం, వైద్యుల నిరాసక్తత, ప్రభుత్వం ఉదాసీనత వంటి కారణాలతో కొరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు కనుమరుగు అయ్యాయి. అంటే మోడీ పాలనలో ‘సబ్కా సాత్ సబ్ కా వికాస్’ నినాదం సాకారమైందేమోనని జనం విశ్వసించే పరిస్థితి వచ్చింది. సుశాంత కేసులో 10వ నిందితురాలుగా అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. ఆమెనూ, ఆమె సోదరుణ్ణి, ఇతర కుటుంబ సభ్యులను విచారణకు తీసుకుని వెళ్తున్న దృశ్యాలే మీడియా లో ప్రసారం అవుతున్నాయి.

రియా చక్రవర్తి వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు దృష్టి పెట్టింది. సుశాంత్ ఆత్మహత్యకు పన్నెండు కారణాలను పోలీసులు ఇప్పటికే వెల్లడించారు ఈ కేసు దర్యాప్తు తీరు చూస్తుంటే హాస్య ప్రహసనంగా కనిపిస్తోంది. బాలీవుడ్ లోనే కాకుండా , టాలీవుడ్ లో భారీగా ప్రచారం పొందిన డ్రగ్స్ కేసులు తుస్సు మన్నాయి. ఈ కేసు కూడా అలాగే, అవుతుందేమోనని జనం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే డ్రగ్స్ ముఠాలతో ఒక్క సినీ పరిశ్రమకు చెందిన వారే కాకుండా, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు తిలా పాపం తలా పిడికెడు మాదిరిగా అందరూ సంబంధాలు కలిగి ఉన్నారు.అందువల్ల ఇలాంటి కేసులో వాస్తవాలు బహిర్గతం కావడం చాలా కష్టమన్నది జనాభిప్రాయం. మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన ఇటువంటి కేసులన్నీ ఎటూ తేలకుండా మరుగున పడిపోయాయి.

బాలీవుడ్ లో ఆత్మహత్యలనేవి కూడా సర్వసాధారణం అయ్యాయి. సుశాంత్ యువతరం నటుడు కనుక అతడి ఆత్మహత్యకు కారణాలపై కథనాలతో మీడియా సంచలనాన్ని సృష్టిస్తోంది. నితిన్ కపూర్, డ్రగ్స్ కూ,బాలీవుడ్ ప్రముఖులకూ ఉన్న సంబందాల గురించి కంగనా రనౌత్ బహిర్గతం చేసింది. వారందరిన విచారణకు పిలిచి, విచారణ జరిపిస్తే కేసు పక్కదారి పట్టవచ్చు. టెలివిజన్ చానల్స్ తమ రేటింగ్ పెంచుకోవడానికి మాఫియా లింక్ లపై కథనాలను పోటాపోటీగా ప్రసారం చేస్తున్నాయి. ఈ కథనాలు టీవీ వీక్షకుల మతులను పోగొడుతున్నాయి. దేనిని నమ్మాలో, ఏది నిజమో తెలియక ప్రజలు తీవ్రంగా తికమక పడుతున్నారు. అమాయకుల మెదడు తినేస్తున్నాయి. ఈ కథనాల తీరు చూస్తుంటే ఉద్దేశ్య పూర్వకంగానే జనాన్ని తప్పు తోవ పట్టిస్తున్నాయేమోననిపిస్తోంది. మీడియా ట్రయిల్ తీరు చూస్తుంటే వ్యక్తిగత రాగద్వేషాలతో సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ తరహా వార్తా ప్రసారాలతో మీడియా ప్రమాణాలను దిగజారుస్తోందన్నది జనాభిప్రాయం.

Leave a Reply