Take a fresh look at your lifestyle.

తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది

  • ప్రజల ఆవేదన పాలకులకు పట్టడంలేదు
  • ప్రత్యామ్నాయ ప్రజారాజ్యంకోసం పాటుపడాలి
  • రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 26 : ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ద్వాంసం, విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆవేదన పాలకులకు పట్టడం లేదన్నారు. 1969 ఉద్యమకారులకు, అసలు తెలంగాణా వాదులకు గుర్తింపు దక్కలేదన్నారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, అసలు తెలంగాణ వాదుల ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రజా తెలంగాణ కోసం పంతం’ అనే అంశం ఐక్య వేదిక కన్వీనర్ బోనగిరి శ్రీనివాస్ నేత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా హాజరైన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, విఠల్, ప్రొఫెసర్లు ప్రభంజన్ యాదవ్, డిఎం.రవిప్రసాద్, విద్యాసాగర్ రెడ్డి, రవీందర్, 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు సుదర్శన్, దొంతు ఆనందం, రామచంద్రయ్య, జింజిరాల రాజేష్, లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.వెంకట్ రాములు, మేకల నర్సింహా రెడ్డి, అజయ్ కుమార్ తదితరులు హాజరై మాట్లాడుతూ కెసిఆర్ 8 ఏళ్ల పాలనలో ఆత్మహత్యలు, అవినీతి పెరిగిపోయిందని అన్నారు.
సిఎం కెసిఆర్ నేటికీ అమరుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ ప్రజలను ఆశపెట్టిన కెసిఆర్ చెప్పింది చేయకుండా కాలం గడుపుతుందని అన్నారు. ఆస్తులు కూడబెట్టుకునే పనిలో కెసిఆర్ కుటుంబం నిమగ్నమైందన్నారు. మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, యువకులు ఏకమై కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతి పాలకులకు వ్యతిరేకంగా క్షేత్ర స్తాయిలో లడాయికి సిద్ధం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అన్ని సంఘాలు ఏకమై ఒక పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళి ఓటు బ్యాంకు ఏర్పాటు సంపాదించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఓటును అమ్ముకోవడం వల్ల ప్రజల బ్రతుకులు బజారున పడుతున్నాయని అన్నారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు. సమిష్టి కార్యాచరణ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. ప్రజల కదలికను బట్టి పాలకుల పాలనా విధానం ఉంటుందని, ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయం, వివిధ సమస్యలపై ఈ నెల 28 రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. మే 2వ తేది నుంచి ఉమ్మడి జిల్లాల్లో కమిటీలు వేసి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతామన్నారు.

Leave a Reply