Take a fresh look at your lifestyle.

బంగ్లాదేశ్‌లో విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ

  • పథకం ప్రకారమే దుర్గా మండపాలపై దాడులు
  • మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర అన్న బంగ్లా మంత్రి
  • 4 వేలకు పైగా కేసులను నమోదు చేశామని వెల్లడి

బంగ్లాదేశ్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే దుర్గా పూజ మండపాలపై పథకం ప్రకారం కొందరు దుండగులు దాడులు చేశారని ఆ దేశ హోంశాఖ మంత్రి అసదుజ్జామాన్‌ ‌ఖాన్‌ ఆరోపించారు. దేశంలో హింసాకాండను ప్రేరేపించడం వల్లనే గాజీపూర్‌, ‌బందర్‌బన్‌, ‌చాపైనావాబ్‌గంజ్‌, ‌చంద్‌పూర్‌, ‌చిట్టగాంగ్‌, ‌మౌల్విబజార్‌లలో ఘటనలు చెలరేగాయని మంత్రి చెప్పారు. హింసాకాండ కేసుల్లో తాము అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత మరిన్ని వివరాలను బహిరంగపరుస్తామని మంత్రి పేర్కొన్నారు. బాధ్యులైన వారికి కఠినమైన శిక్ష విధిస్తామని మంత్రి ఖాన్‌ ‌హామి ఇచ్చారు. గతవారం దుర్గా పూజ ఉత్సవాల సందర్భంగా ఒక పండల్‌ ‌వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలతో హింసాకాండ చెలరేగింది. ఖురాన్‌ అపవిత్రం జరిగిందనే వార్త వ్యాప్తి చెందడంతో పలు దుర్గా పూజ మండపాలు, దేవాలయాలపై దాడి చేశారు. విధ్వంసకారులు హిందువుల దుకాణాలు, ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. హింసాకాండ, కాల్పుల ఘటనలపై 4వేలకు పైగా కేసులను బంగ్లాదేశ్‌ ‌పోలీసులు నమోదు చేశారు. హింసాకాండ తరువాత దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్‌ ‌ప్రధాన మంత్రి షేక్‌ ‌హసీనా హామి ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ పండళ్లు, హిందువులపై దాడులకు వ్యతిరేకంగా చిట్టగాంగ్‌లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి.

శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. తొలుతు శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్‌ ‌హిందు బుద్ధిస్ట్ ‌క్రిస్టియన్‌ ‌యూనియన్‌ ఈ ‌నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్‌, ‌చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి.

హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్‌ ‌పూజ ఉద్జపన్‌ ‌పరిషత్‌ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్‌ ‌చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్‌ ‌హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్‌ ‌డిప్యూటీ హైకమిషన్‌ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు.

Leave a Reply