Take a fresh look at your lifestyle.

పి.వి నినదించిన దేశ్‌ ‌బనావో, దేశ్‌ ‌బచావో

“రాజకీయ అనిశ్చిత పరిస్థితితో విదేశాలలో పనిచేయుచున్న భారతీయులు స్వదేశానికి పంపించే ధనం తగ్గిపోయింది. అదియేకాక బ్యాంకులలో డిపాజిట్‌లను తిరిగి తీసుకోవడము వలన ఆర్థిక మాంధ్యం ఏర్పడింది. ఇటువంటి సంక్షోభం సమయంలో సరియైన సమయంలో సరియైన ప్రధానిగా పి.వి బాధ్యతలను తీసుకోవడం అతని సాహసానికి నిదర్శనం. అందుకే చరిత్రలో ఆయన ‘ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా పిలువబడ్డాడు.”

పాములపర్తి వెంకట నరసింహరావు (పి.వి) భారత దేశ 9వ ప్రధానిగా మే 21, 1991న ప్రమాణ స్వీకారం సమ యానికి జమ్ము – కాశ్మీర్‌, ‌పంజాబ్‌, అస్సాం రాష్ట్రాల శాంతి భద్రతలు క్షీణించి అల్లక ల్లోలంగా ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కావేరి నదీ జలాల జగడము, వెనుకబడిన కులాల రిజర్వేషన్‌ ‌పోరాటాలు, సామాజిక పథకాల వైఫల్యాలతో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మౌళిక సదుపాయాల కల్పనలో వెనుకబాటుతనముతో అభివృద్ధి మొత్తం కుంటుపడింది. విదేశీ అప్పులను చెల్లించుటకు డాలర్లులేవు. అంతర్జాతీయ ద్రవ్యనిధి విదేశీ సంస్థలు కొత్తగా అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. సోవియట్‌ ‌యూనియన్‌ ‌విచ్ఛిన్నానికి సిద్ధంగా ఉంది. గల్ఫ్ ‌యుద్ధంతో చమురు ధరలు పెరిగినాయి. రాజకీయ అనిశ్చిత పరిస్థితితో విదేశాలలో పనిచేయుచున్న భారతీయులు స్వదేశానికి పంపించే ధనం తగ్గిపోయింది. అదియేకాక బ్యాంకులలో డిపాజిట్‌లను తిరిగి తీసుకోవడము వలన ఆర్థిక మాంధ్యం ఏర్పడింది. ఇటువంటి సంక్షోభం సమయంలో సరియైన సమయంలో సరియైన ప్రధానిగా పి.వి బాధ్యతలను తీసుకోవడం అతని సాహసానికి నిదర్శనం. అందుకే చరిత్రలో ఆయన ‘ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా పిలువబడ్డాడు. ఆనాటి క్యాబినెట్‌ ‌కార్యదర్శి నవీన్‌ ‌చంద్ర దేశ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ తయారు చేసిన ఒక నోటును పి.వి.కి అందించగా దానిని అధ్యయనం చేసిన ఆయన ఆనాడున్న ఆర్థిక పరిస్థితులనుండి దేశాన్ని గట్టెక్కించాలంటే అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థల విషయ పరిజ్ఞానమున్న బయటి వ్యక్తి ఆర్థికమంత్రిగా కావాలి అని భావించి ఇందిరాగాంధీకి అంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన పి.సి అలెగ్జాండర్‌ను సలహా అడుగగా, ఐ.జి పటేల్‌ ‌మరియు మన్మోహన్‌ ‌సింగ్‌ల పేర్లను పి.వికి సూచించినారు.

ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవమున్న మిత్రుడైన రాష్ట్రపతి ఆర్‌.‌వెంకట్రామన్‌కు దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, ఆర్థిక మంత్రులుగా ఐ.జి.పటేల్‌ ‌లేదా మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పేర్లను సూచించినప్పుడు రాష్ట్రపతి ఆ ఇద్దరిలో ఎవరైన ఫర్వాలేదు అని అన్నారు. రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌గవర్నర్‌గా, లండన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్ ‌సారధిగా, దేశానికి సంబంధించిన 14 బడ్జెట్లకు రూపకలప్పన చేసిన ఐ.జి.పటేల్‌ను ఆర్థిక మంత్రిగా స్వీకరించమని అడుగగా ఆయన నిరాకరించడంతో, తప్పని పరిస్థితులలో పి.సి అలెగ్జాండర్‌ను రంగంలోకి దింపి మన్మోహన్‌సింగ్‌ని ఒప్పించినారు. కాని నాకు స్వేచ్ఛను ఇస్తేనే ఆర్థిక మంత్రిగా స్వీకరిస్తానని మన్మోహన్‌ అనగా పి.వి కూడ ఒప్పుకున్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముందే పి.వి.మరియు మన్‌మోహన్‌సింగ్‌, ‌ప్రభుత్వాధికార్లు, అహ్లువాలియాతో సమావేశమును ఏర్పాటుచేసి దేశ ఆర్థిక పరిస్థితులను సమీక్షించినారు. ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారము చేసిన అనంతరం ప్రసార మాధ్యమాలలో (దూరదర్శన్‌) ‌దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశపు దుస్థితిని, ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను, విదేశీ అప్పులను, చెల్లించేందుకు డాలర్లులేని స్థితిని, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు కొత్తగా అప్పులు ఇవ్వడానికి ముందుకురాని పరిస్థితులను, చేసిన అప్పును తిరిగి చెల్లించలేని స్థితిని సవివరంగా వివరించారు. దీనిని అధిగమించడానికి సత్వరంగా దేశ ఆర్థిక, పారీశ్రామీకకరణ విధానాలను సరిదిద్దవలసిన అవసరమున్నదని చెప్పారు. విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తూనే, సాంకేతిక వనరులను మెరుగుపరిచి అభివృద్ధిని వేగవంతం చేస్తామని, ఎగుమతులను పెంచి భారతదేశాన్ని అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు మనమందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఒక దేశ పరిస్థితిని అధికారం చేబట్టేముందు శ్వేత పత్రంగా విడుదల చేసిన పి.వి.లాంటి పాలకుడు ప్రధానమంత్రి ప్రపంచంలోనే ఎవ్వరూలేరు.

వాస్తవానికి పి.వి నాయకత్వంలో ఆనాడు ఏర్పడ్డది మైనార్టీ ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీనాయకులు కావచ్చు లేదా కాంగ్రెస్‌ ‌పార్టీలోనే అసంతృప్తివాదులు కావచ్చు సహాకరించకపోతే ప్రధానిగా కొనసాగలేనని గ్రహించి, అందరి సహాకారముతో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయవలసిన అవసరముందని గ్రహించినారు. పి.విగారు తన వెంట మన్‌మోహన్‌సింగ్‌ను తీసుకొని మాజీ ప్రధానులైన వి.పి సింగ్‌, ‌చంద్రశేఖర్‌, ‌బి.జె.పి నాయకుడైన అటల్‌ ‌బిహారీవాజ్‌పేయిలాంటివారిని వేర్వేరుగా కలిసి దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, మీరు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగింపుకు మీ మద్ధతు అవసరమని మద్ధతును కూడగట్టుకున్నారు. సంపద సృష్టికి అవరోధాలు లేకుండా ఆర్థిక సంస్కరణలు సాధించాలంటే ఆర్థిక మంత్రి, వాణిజ్య మంత్రి, పారిశ్రామికవేత్తల పాత్ర చాలా ముఖ్యమని భావించి, ఆర్థికశాఖకు మన్మోహన్‌ ‌సింగ్‌, ‌వాణిజ్యశాఖకు పి.చిదంబరం, పరిశ్రమల శాఖను తానే స్వయంగా నిర్వహించాలని నిర్ణయించుకొని, దీనికిగాను నిజాయితీగా పనిచేసే అధికార్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచబ్యాంక్‌ అప్పు‌లను చెల్లించుటకు బంగారాన్ని లండన్‌ ‌బ్యాంక్‌లో తాకట్టు పెట్టి అప్పు చెల్లించిన విషయము వార్త పత్రికలలో రావడముతో ప్రతిపక్షనాయకులు, ప్రజలు ఆందోళనలు చేసినారు.

పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మన్‌మోహన్‌సింగ్‌ ‌రూపాయి విలువను, రైతులకు ఎరువులపై 40% సబ్సిడీలను తగ్గించినారు. సబ్సిడి చక్కెర, ఎల్‌.‌పి.జి సిలెండర్ల ధరలను పెంచినారు. చిదంబరం ఎగుమతులకు సబ్సిడీలను తగ్గించి, కంట్రోలర్‌ ఆఫ్‌ ‌క్యాపిటల్‌ ఇష్యూస్‌ (‌సి.సి.ఐ)ను రద్దుచేసినారు. రైతులకు విపరీతమైన నష్టం జరుగుతుందని, సంస్కరణలు పేదవారికి వ్యతిరేకంగా ఉన్నాయని, బడ్జెట్‌లో పేదరిక నిర్మూలన కోసం ప్రతిపాదనలు లేవని ప్రతిపక్షాలతో పాటుగా కొంతమంది కాంగ్రెస్‌లోని వారు సైతం ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. వారిని సంతృప్తి పరుచడానికి ఎరువులపై 40% నుండి 30% సబ్సిడీని తగ్గించి, ఎగుమతుల సబ్సిడీలనుండి అదనంగా వచ్చిన విదేశీ మారకాన్ని పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల దిగుమతికి వాడతామన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ గార్ల సామ్యవాదాన్ని, సోషలిస్ట్ ‌పంథానే బలపరుస్తున్నాననీ కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులను నియంత్రించకల్గినారు. ఈ విధంగా విప్లవాత్మకమైన తన ఆర్థిక సంస్కరణలు మద్దతును కూడగట్టుకోవడమేకాదు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడము ద్వారా రూపాయలను సేకరించినారు. లైసెన్స్‌రాజ్‌లైన (ఆస్కోకాబ్‌) అసోసియేషియాటిక్‌ ‌చాంబర్స్ ఆఫ్‌ ‌కామర్స్ అం‌డ్‌ ఇం‌డస్ట్రీ ఇన్‌ ఇం‌డియా, (ఫిక్కి) ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ఇం‌డస్ట్రీలు లైసెన్స్‌ను పొందిన కంపనీయే బోగస్‌ ‌పేర్లమీద లైసెన్స్‌లు అన్ని అయిపోయేదాకా తీసుకొని గుత్తాదిపత్యంతో ఉత్పత్తులను తగ్గించి మార్కెట్లో వస్తువుల డిమాండ్‌ను గుర్తించి ధరలను పెంచి లాభాలను పొందేవారు. ఈ రెండు సంస్థల నుండే యువ పారిశ్రామిక వేత్తలను తయారుచేసి కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ఇం‌డస్ట్రీని ఏర్పాటు చేసినారు. వారు విదేశీ పారీశ్రామీకీకరణకు వ్యతిరేకం కాదని ప్రకటించి, మౌళిక సదుపాయాలలో ప్రధాన పాత్రను పోషించారు. విద్యుత్పత్తి, రహాదారులు, వంతెనల నిర్మాణంలో ప్రోత్సాహము, టోల్‌రోడ్లు బిల్ట్ ఆపరేట్‌ ‌పద్ధతిలో అనుమతించినారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ, బహుళ కంపెనీలకు ఆహ్వానం పలికి, పరిశ్రమలకు అనుమతించే కార్యాలయాలను మూసివేసినారు. 1991 సంవత్సరముకు ముందు ఘోరంగా దిగజారిన ఆర్థిక వ్యవస్థ, పి.వి విజ్ఞతతో చేసిన ఈ విప్లవాత్మక చర్యలతో 1996 నాటికి ఆర్థిక వ్యవస్థ 7.5% వృద్ధి రేటును సాధించింది. 1991కి ముందు 5.8 బిలియన్‌ ‌డాలర్లలో ఉన్న భారతదేశము ఇప్పుడు 350 బిలియన్‌ ‌డాలర్లను మించాయి. 1991కి ముందు ఫోన్‌ ‌కావాలంటే మంత్రి లేక యం.పిగారితో రెకమండ్‌ ‌కావాలి. నేడు ఎవరి అవసరం, రెకమండ్‌ ‌లేకుండానే ఫోనును పొందవచ్చును. 1991 ముందు దూరదర్శన్‌ ‌తప్ప మరేదిలేదు. నేడు 60 కోట్ల టి.వి. సెట్లు, 1000పైగా చానళ్ళ ప్రసారము చేయగల స్థితిలో ఉన్నాము. 1991 ముందు ఇండియన్‌ ఏయిర్‌లైన్‌లో సంపన్నులు మాత్రమే ప్రయాణము చేసేవారు. నేడు మద్యతరగతికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరానికి ప్రపంచంనుండి భారతదేశం1000 టన్నుల బంగారాన్ని కొనుగోలు స్థాయికి ఎదిగింది. సంపన్న దేశాలలో జి.20లో భారతదేశము భాగస్వామిగా చోటు సంపాదించింది. ఒకనాడు షావుకార్ల చేతులలోనున్న వ్యాపారం నేడు అన్ని కులాల, వర్గాల వారు చేస్తున్నారు. సామాన్యులు విదేశాలలో ఉన్నత పదవులను అందుకొని కోట్లకు పడగలెత్తారు. ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. పి.వి పదవికాలము ముగిసేనాటికి పంజాబ్‌, అస్సాంలలో శాంతి నెలకొంది. కాశ్మీర్‌లో ఎన్నికలు జరుపుకొని హింసకు తెరదించినారు. ఇవన్నీ పి.వి తెలివితేటలు మరియు సంస్కరణల పుణ్యమే!.

ప్రభుత్వ రాబడి రక్షణ శాఖకు, నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన కొద్ది ఆదాయంలో సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తారు. దేశ ప్రధానమంత్రి గొప్ప స్వాప్నికుడైనంత మాత్రాన పేద ప్రజల కడుపు నిండదు. చిట్ట చివరి శ్రేణిలో ఉన్న పేదవారికి అందవలసిన సంక్షేమ పథకాలను స్వార్థపరులైన లంచగొండులతో ధనవంతులకే సంక్షేమ పథకాలు దక్కుతున్నాయి. దీనితో ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారుగా మారి సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయని, ఈ అసమానతలను తొలగించడానికి శ్రీమతి ఇందిరాగాంధీ ‘‘గరీభీ హటావో’’ నినాధమును తీసుకువచ్చిన, ప్రభుత్వం పన్నుల రూపంలో రాబడి అనుకున్నంత రానందున పేదవారికి అందవలసిన సంక్షేమ పథకాలు అందక అది నినాదంగానే మిగిలి పోయింది. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి శాఖను పి.వి.స్వయంగా నిర్వహించినారు. పి.వి తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగా పేదవారికి తెలియకుండానే వారి జీవితాలలో చాలా మార్పులు వచ్చినాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను పూర్తి సబ్సిడీగా మార్చినారు. రెన్యూడ్‌ ‌పబ్లిక్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌సిస్టం (ఆర్‌.‌డి.పి.ఎస్‌)‌ను దేశంలోని 5వ వంతు జిల్లాలో రేషన్‌ ‌దుకాణంలోని ధరలకంటే తక్కువ ధరకు దొరికే విధంగా అమలు చేసినారు. పేదలకోసం, అణగారిన వారికోసం తీసుకువచ్చిన ఆర్‌.‌డి.పి.ఎస్‌ ‌స్కీమ్‌ ‌వారికి అందుతుందా? అని సర్వే చేసినప్పుడు అవినీతిలో ఈ సరకులు పక్కదారి పడుతున్నానయని తెలిసిన తర్వాత ఆర్‌.‌డి.పి.ఎస్‌ను రద్దు చేసినారు. నెహ్రూ రోజ్‌గార్‌ ‌యోజన, ఇందిరా ఆవాస్‌ ‌యోజన, ఆరోగ్యం కుటుంబ సంక్షేమములాంటి ఎన్నో పథకాలను తీసుకువచ్చి వారి ప్రయోజనాలను పెంచినారు. వస్త్ర, చేనేత, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించి ఉత్పాదక దేశంగా ఎదగాలని, పేదల్లో ఆకలి కన్నీళ్ళను తుడిచి వారి జీవితాలను మెరుగుపరిచినారు. గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి నవభారత నిర్మాణానికి రూపకర్తగా నెహ్రు వారసునిగా, గాంధీజీ కన్న కలలను నిజం చేయించే బహుముఖ వ్యక్తిగా కనబడతారు. దేశ్‌ ‌బనావో-దేశ్‌ ‌బచావో (దేశాన్ని రక్షించు – దేశాన్ని నిర్మించు) అనే నినాదంతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి దేశాభ్యుదయాన్ని సాధించడానికి నిస్వార్థంతో సమర్థవంతముగా కృషిచేసిన పి.వి తెలంగాణవాడు కావడం, ఆయన శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకు రావడం సముచిత నిర్ణయం!

Leave a Reply