Take a fresh look at your lifestyle.

చలికాలంలో వేధించే డిప్రెషన్‌

‘‘‌శీతాకాల డిప్రెషన్‌ ‌సాధారణంగా నవంబర్‌ ‌నుండి ఫిబ్రవరి వరకు డిప్రెషన్‌ ‌లక్షణాలు తీవ్రంగా, స్పష్టంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో కొంత మేరకు దీని ప్రభావం ఉన్నప్పటికీ, ఎండాకాలంలో అంతగా ప్రభావం చూపించదు. శరీరంపై సూర్యుని వేడిమి, కాంతి ప్రభావం లేకపోవడం వల్ల మానసిక స్థితిని నియంత్రించే సెరటోనిన్‌ ‌స్థాయి తగ్గిపోవడం, నిద్రపద్ధతులను నియంత్రించే మెలటోనిన్‌ ‌హార్మోన్‌ ‌సమతుల్యతలో అంతరాయం కలగడం వల్ల చలికాల డిప్రెషన్‌ ‌కలిగే అవకాశాలు ఎక్కువగాఉంటాయి.’’

కొరోనా మహమ్మారి రోజురోజుకో రూపంలోకి మారుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ప్రజల మానసిక అనారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెగటివ్‌ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒత్తిడికి లోనవుతూ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మారుతున్న పరిస్తితులతో ప్రజల మానసిక స్తితి పూర్తిగా మారిపోయింది. సామాజిక ఒంటరి తనంతో ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించి ప్రతికూల వాతావరణంలో సానుకూల దృక్పథాన్ని అలవరచుకుని, మనసులో పాజిటివ్‌ ఆలోచనలు పెంచుకోవడం, మానసిక సమస్యల పై అవగాహన ఏర్పరుచుకోవాల్సిన అవసరం ఉంది.

శీతాకాల డిప్రెషన్‌ ‌సాధారణంగా నవంబర్‌ ‌నుండి ఫిబ్రవరి వరకు డిప్రెషన్‌ ‌లక్షణాలు తీవ్రంగా, స్పష్టంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో కొంత మేరకు దీని ప్రభావం ఉన్నప్పటికీ, ఎండాకాలంలో అంతగా ప్రభావం చూపించదు. శరీరంపై సూర్యుని వేడిమి, కాంతి ప్రభావం లేకపోవడం వల్ల మానసిక స్థితిని నియంత్రించే సెరటోనిన్‌ ‌స్థాయి తగ్గిపోవడం, నిద్రపద్ధతులను నియంత్రించే మెలటోనిన్‌ ‌హార్మోన్‌ ‌సమతుల్యతలో అంతరాయం కలగడం వల్ల చలికాల డిప్రెషన్‌ ‌కలిగే అవకాశాలు ఎక్కువగాఉంటాయి.

చలికాలంలో వేధించే డిప్రెషన్‌

‌రోజువారీగా నిర్వహించే కార్యక్రమాలపై ఆసక్తి సన్నగిల్లడం, ముభావంగా కూర్చోవడం, ప్రతి విషయానికి చికాకు పడడం, మధ్యాహ్నం సమయంలో నిద్ర ఎక్కువగా పోవడం, నిరాశ, నిస్పృహలకు లోనుకావడం, మానసిక ఆందోళనలు ఎక్కువ కావడం చలికాల డిప్రెషన్‌ ‌యొక్క ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి . యుక్త వయస్సులోని వ్యక్తులు, పురుషుల్లో కంటే ఎక్కువగా మహిళల్లో ఉన్నప్పటికీ లక్షణాలు పురుషుల్లో తీవ్ర స్థాయిలో ఉండవచ్చు. వ్యక్తి ఇప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లయితే, అప్పుడు లక్షణాలు కాలానుగుణంగా మరింత తీవ్రంగా మారవచ్చు.

చలికాల డిప్రెషన్‌కు చికిత్స సైకోథెరపీ

చలికాల డిప్రెషన్‌ ‌ను తగ్గించడానికి ఇండియాలో ఎక్కువగా సైకోథెరపీని ఉపయోగిస్తారు. సైకోథెరపీ ద్వారా వ్యక్తిలోని నైపుణ్యాలకు సానబెట్టడం, ప్రతికూల ఆలోచనలను గుర్తించి వాటిని తగ్గించేలా చేయడం. ఒత్తిడిని అధిగమించడానికి కావల్సిన పద్ధ్దతులు తెలుసుకోవడం మూలంగా డిప్రెషన్‌ ‌ను కౌన్సెలింగ్‌ ‌ద్వారా అదుపుచేయవచ్చు.

డిప్రెషన్‌ ‌కోసం లైట్‌ ‌థెరపీ

దీర్ఘకాలిక డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఫొటో థెరపి లేదా లైట్‌ ‌థెరపీతో మంచి ఉపశమనం పొందుతారు. లైట్‌ ‌థెరపీలో ఉపయోగించే ప్రత్యేక పరికరం నుండి వచ్చే కాంతి సహజమైన సూర్యకాంతి వలే పనిచేసేలా కాంతిని వ్యక్తి పై పడే విధంగా చేయడం వల్ల మానసిక స్థితికి సంబంధించిన మెదడు రసాయనాలలో మార్పును తీసుకు వచ్చి డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. సాధారణంగా చలికాల డిప్రెషన్‌ ‌తీవ్రతను బట్టి యాంటీ డిప్రెసెంట్‌ ‌మందుల ద్వారా డిప్రెషన్‌ ‌ను సైక్రియాట్రిస్టుల సూచనల మేరకు తగ్గించవచ్చు.

సహజ కాంతితో చలికాల డిప్రెషన్‌ను దూరం చేసుకోవచ్చు:

చలికాలం తీవ్రత కు తగ్గట్లుగా జీవన విధానంలో మార్పులను చేసుకోవాలి. మీ పరిసరాలను మార్చుకోవాలి. కిటికీలు , తలుపులు తెరిచి ఉంచాలి, దీని వల్ల ఎక్కువ మొత్తంలో సహజ కాంతి లోనికి ప్రవేశిస్తుంది. ఇంటిలో లేదా కార్యాలయంలో ఉన్నప్పుడు వెలుగులో లేదా కిటికీలకు దగ్గరగా కూర్చోండి దీని వల్ల ప్రకాశవంతమైన కాంతి మీపై పడుతుంది. బయటకు వెళ్లాలి. బయట కొంత దూరం నడవండి, వెలుగు వచ్చే స్థలంలో భోజనం చేయండి లేదా సూర్యకాంతి కోసం ఉద్యానవనంలో కొంత సేపు కూర్చోండి లేదా నడవండి.

ప్రకృతిలో సమయం గడపడం

శీతాకాలంలో కూడా, బయట సహజ కాంతి వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి, ముఖ్యంగా మీరు లేచిన తర్వాత ఒకటి-రెండు గంటలపాటు వెలుగులో కూర్చోవడం చాలా మంచిది. వ్యాయామం చేయడం మానుకోవద్దు. వ్యాయామం ఒత్తిడి, ఆందోళన తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇది డిప్రెషన్‌ ‌లక్షణాల తీవ్రత ఉపశమనానికి కూడా పని చేస్తుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీరు ఫిట్‌గా ఉండి, మీ గురించి పాజిటివ్‌ ఆలోచనలు వస్తాయి. సామాజిక ప్రవర్తన మెరుగుపరచు కోవాలి. మీరు ఇతరులతో మాట్లాడుతూ ఉండాలి లేదా ఇతర సమూహ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. వ్యక్తులతో మాట్లాడటం వల్ల మీ ఆలోచనలు పంచుకోవడానికి, మీ మనస్థితి మారడానికి సహాయపడుతుంది. ఇది రోజువారీ డిప్రెషన్‌ ‌లక్షణాల నుండి ఆలోచనలను మళ్లించడానికి కూడా దోహదపడుతుంది. పర్యటనలకు వెళ్లాలి. సాధ్యమైనట్లయితే, శీతాకాలాల్లో వెచ్చని ప్రాంతాలకు పర్యటనకు వెళ్లండి. ప్రకృతిలో సమయం గడపడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించుకోవచ్చు.

స్నేహితులతో ముచ్చటించండి

శీతాకాల డిప్రెషన్‌ ‌కి చికిత్స చేయకుండా విస్మరించినట్లయితే, దాని తీవ్రత పెరగవచ్చు. సమజానికి దూరంగా మెలగడం ఆత్మహత్యా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మన్యూనతా భావానికి ఎక్కువగా లోనవుతారు. ఇలాంటివన్నీ పోగొట్టుకోవాలంటే స్నేహితులతో మాట్లాడుతుండాలి. అందరితో కలివిడిగా ఉండటం నేర్చుకోవాలి. మనసులో బాధ కలిగితే శ్రేయోభిలాసులతో ఆ బాధను పంచుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ఎంతటి సమస్య అయినా చిటికెలో మాయం అవుతుంది.

సైకాలజిస్టును స్నేహితుడిగా భావించండి

సంవత్సరంలోని కొన్ని రోజుల్లో నిరుత్సాహంగా లేదా అలసటగా అనిపించడం సర్వసాధారణం. అయితే, మీరు దీర్ఘకాలంపాటు నిరుత్సాహంగా భావిస్తూ, మీరు సాధారణంగా ఆనందించే పనులపట్ల ఆసక్తి లేకపోయినట్లయితే సైకాలజిస్టును సంప్రదించాలి. అలాగే, మీ నిద్ర పద్ధతుల్లో అంతరాయం కలుగుతున్నా, ఆకలి మారినా, నిరాశగా ఉన్నా లేదా మీకు ఆత్మహత్యా ఆలోచనలు వస్తున్నా, అప్పుడు సాధ్యమైనంత తొందరగా మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్టును సంప్రదించాలి. చికిత్స తీసుకోవాలి. అంతేగానీ నిర్లక్షం చేయకూడదు.

సంవత్సరంలోని కొన్ని రోజుల్లో నిరుత్సాహంగా లేదా అలసటగా అనిపించడం సర్వసాధారణం. అయితే, మీరు దీర్ఘకాలంపాటు నిరుత్సాహంగా భావిస్తూ, మీరు సాధారణంగా ఆనందించే పనులపట్ల ఆసక్తి లేకపోయినట్లయితే వెంటనే సైకాలజిస్ట్ ‌లను సంప్రదించాలి.

– డా.అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి అసోసియేషన్‌ ఆఫ్‌ ‌రిహాబిలిటేషన్‌ ‌సైకాలజీస్టస్ అం‌డ్‌ ‌ప్రొఫెషనల్స్ ఇం‌డియా జాతీయ అధ్యక్షుడు, 9703935321

Leave a Reply