- సంక్రాంతి తరువాత థర్డ్‌వేవ్ వొచ్చే అవకాశం
- టీకా రెండు డోసులతో ఒమిక్రాన్ నుంచి రక్షణ
- ఆందోళన అవసరం లేదు..మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి
- ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.శ్రీనివాస్
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్, డిసెంబర్ 30: ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదనీ, రానున్న థర్డ్‌వేవ్‌కు ఇది సంకేతమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు తెలిపారు. కొరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామనీ స్పష్టం చేశారు. గురువారం ఆయన కోఠిలోని డీహెచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోనూ గత రెండు మూడు రోజులుగా కేసులు ఎక్కువ నమోదయ్యాయన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నదని చెప్పారు. అయితే, కేసుల పెరుగుదలపై ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత రెండు వేవ్‌లలో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నామనీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే కొరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడించారు.ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
టీకా రెండు డోసులు తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షణ పొందవచ్చని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదనీ లక్షణాలు కనిపించిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలలో జాగ్రత్తగా ఉండాలనీ, వచ్చే రెండు మూడు వారాలు చాలా కీలకమనీ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కొరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దేశంలో సామాజిక వ్యాప్తి ప్రారంభమైందనీ, సంక్రాంతి నాటికి ఇది పూర్తవుతుందని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి కానీ, మాస్క్ తప్పనిసరిగా ధరించండి అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న కోవిడ్ చికిత్సనే ఇప్పుడు కూడా అందిస్తామనీ, ఎలాంటి మార్పులు లేవన్నారు. ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు 90 శాతం మందిలో కనిపించడం లేదనీ, లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కొరోనా కొత్త వేరియంట్ 130 దేశాలకు విస్తరించిందనీ, అమెరికాలో ఒకే రోజు 4 లక్షలు, యూకేతో పాటు పాటు పలు దేశాలలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలు కూడా సహకరించడం ద్వారా సామాజిక వ్యాప్తిని తగ్గించవచ్చని ఈ సందర్భంగా డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.