Take a fresh look at your lifestyle.

హననం అవుతున్న ప్రజాస్వామ్య విలువలు ..!

ప్రజాస్వామ్య దేశాలకు ఇండియా సహజ మిత్రుడు. నిరంకుశత్వం బెడదపై జరిగే పోరాటంలో ఇండియా ప్రజాస్వామ్య దేశాలతో  కలిసి పనిచేస్తుంది. ఈ మాటలన్నది మన ప్రధాని నరేంద్ర మోదీ. సందర్భం జి7 సమావేశం. మోదీ మాటల్లోకి వెళ్లే ముందు జి7 గురించి కాస్త వివరం తెలుసుకుందాం. ఏడు సంపన్న దేశాలు..అమెరికా, ఇంగ్లండ్‌, ‌జర్మనీ, ఫ్రాన్స్, ‌కెనడా, ఇటలీ, జపాన్‌..‌కలిసి ఈ గ్రూప్‌ ‌గా తయారయ్యాయి. ఇంగ్లండ్‌ ‌లో జరిగిన జి7 తాజా శిఖరాగ్ర సమావేశానికి ఇండియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాలను అతిధి హోదాలో ఆహ్వానించారు.

ప్రధాని మోదీ వర్చువల్‌ ‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ నేపధ్యం..! ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి ఘనమైన దేశం ప్రతినిధులుగా మన నేతలకు ప్రపంచ దేశాల మధ్య గౌరవం దొరికితే మనకు కూడా చాలా సంతోషమే… కానీ ఆ ఘనతకు మనకు అర్హత ఉందా..? నిజాయితీగా  పరిశీలించుకోవాలి.. వలస పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత పద్ధతుల్లో సమరం సాగించి స్వాతంత్య్రం సంపాదించుకున్నాం. సత్యాగ్రహం అనే గొప్ప ఆయుధాన్ని ప్రపంచానికి అందించాం. దేశ విభజనలో చీలిన రెండో ముక్క మత రాజ్యంగా మారినా గానీ  మనం ఆ విపత్తును నివారించుకున్నాం. ఉత్తమమైన ప్రజాస్వామిక.. సెక్యులర్‌ ‌రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ప్రపంచ దేశాల్లో వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రతి పోరాటానికీ నైతికంగా మద్దతు ఇచ్చాం. మన చరిత్ర ఘనమైనదనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం. మోదీ మాటలను బేరీజు వేయదలచుకుంటే రెండు పార్శ్వాల్లో ఆ పని చేయాలి. దేశంలో అంతర్గతంగా ప్రజాస్వామిక విలువలకు ఏ మాత్రం చోటు దొరుకుతున్నది అన్నది మొదటి ప్రశ్న. ప్రపంచంలో ప్రజాస్వామిక విలువల పరిరక్షణకు ఇండియా ఏమాత్రం నైతికమైన దన్ను ఇస్తున్నదన్నది రెండవ ప్రశ్న.

ప్రధమ ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ తర్వాత దేశంలో కాంగ్రెస్‌ ‌పాలన కింద ప్రజాస్వామిక విలువలు క్షీణిస్తూ వచ్చాయి. కానీ ఆ క్షీణత రేటు చాలా తక్కువ. అయితే ఆదే కాలంలో అవినీతి పెరిగిన రేటు మాత్రం చాలా ఎక్కువ. 2014లో మోదీ నాయకత్వంలోని బిజెపి విజయానికి దోహదం చేసిన కారణాల్లో కాంగ్రెస్‌ అవినీతి ప్రధానమైనది. మరి ఈ ఏడేళ్లలో దేశం ఎలా తయారయింది. అవినీతి ఎక్కడికీ పోలేదు. అధికారం చేతులు మారినంత మాత్రాన అవినీతి అదృశ్యం అయిపోతుందని అనుకోవడమే అమాయకత్వం అనుకోండి. సరే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికే పరిమితమవుదాం. జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూను గాడిదగా చిత్రించిన శంకర్స్ ‌వీక్లీ శంకర్‌ ‌కు ప్రధమ ప్రధాని నుంచి ప్రశంసలు అందాయి. మరి ఇవాళో.

సోషల్‌ ‌మీడియాలో ప్రధాని మోదీని విమర్శించిన వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. బీజెపిని విమర్శించే వారిపై పాకిస్థాన్‌ ఏజెంట్లుగా ముద్ర వేస్తున్నారు. ప్రధాన స్రవంతి మీడియాను రకరకాల దారులలో తొక్కిపెడుతున్నారు. ఎన్నికలలో అధిక్యం కోసం మతాన్ని యధేచ్ఛగా వాడుతున్నారు. ఒకవేళ ఎన్నికలలో ప్రజాతీర్పు తమకు అనుకూలంగా రాకపోతే ఎన్నికయిన ప్రభుత్వాలను ధనబలంతో దొంగ దారుల్లో కూల్చి తాము గద్దె నెక్కడం ద్వారా ఆ ప్రజాతీర్పును అపహాస్యం పాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ క్రమేపీ బలహీన పరిచి నామమాత్రంగా తయారు చేశారు. సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ ‌వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై,, తమ దారికి రాని వారిపై దాడులకు బాహాటంగా వినియోగిస్తున్నారు. దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా.. ప్రత్యేకించి ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

ప్రధాని అంతటి ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఎలాంటి సంకోచాలూ లేకుండా ఈ విద్వేష ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. రాజ్యాంగ విలువలను గంగలో ముంచుతూ సిఎఎ.. సిటిజెన్‌ ‌షిప్‌ ఎమెండ్‌ ‌మెంట్‌ ‌యాక్ట్..‌వంటి చట్టాలను తీసుకువస్తున్నారు. మీరు రెండవ శ్రేణి పౌరులు మాత్రమే అని ముస్లింలకు ఇలాంటి చట్టాల ద్వారా స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఇండియాను మత రాజ్యంగా మార్చే రాజ్యాంగ సవరణ చేయడం మినహా చేతనైన అన్ని మార్గాలలో ఆ రకమైన వ్యవస్థను ప్రతిష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కేసుల ద్వారా విమర్శ నోరు మూయించడం..ప్రతిపక్షాలను దొంగదెబ్బ తీయడం, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం…ఈ మూడు కార్యక్రమాలూ నిరాటంకంగా జరుగుతున్న దేశంలో ఉత్తమ ప్రజాస్వామిక విలువలు ఉన్నట్లా లేనట్లా. మీరే ఆలోచించండి..! దేశంలో ప్రజాస్వామ్య విలువలను పెంచి పోషించే వారికే ఇతరులకు నీతులు చెప్పే నైతిక బలం సమకూరుతుంది. ప్రస్తుతం మన దేశాన్ని పాలిస్తున్న ప్రభుతకు ఆ నైతిక బలం ఉందని అనుకోవచ్చా..!

స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జరిగే పోరాటాలకు బేషరతుగా మద్దతు ఇచ్చిన ఇండియా ఇవాళ అంతర్జాతీయ సమాజంలో ఎక్కడ నిలబడి ఉంది. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయి వచ్చిన రోహింగ్యాలను శరణార్ధులుగా స్వీకరించలేమని నిర్ద్వంద్వంగా చెప్పింది మన ప్రభుత్వం. రోహింగ్యాలు ముస్లింలు కావడమే దానికి కారణం. స్వతంత్ర భారతం ఇన్నాళ్లూ కట్టుబడుతూ వచ్చిన మానవీయ విలువలకు ఇది పూర్తి విరుద్ధం.

పొరుగు దేశం బర్మాలో సైనికాధికారులు ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోస్తే..ఎదురు తిరుగుతున్న పౌరులను ఊచకోత కోస్తుంటే మోదీ సర్కారు ఒక్క మాట అనడం లేదు. పాలస్తీనా హక్కుల విషయంలో ఇన్ని దశాబ్దాలుగా అవలంబించిన పాలసీకి భిన్నంగా  ఇజ్రాయెల్‌ ‌తో స్నేహం కోసం ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనియన్ల పక్షాన నించోవడం మానేశాం మనం. ఆరేడు దశాబ్దాలుగా తమ కంటూ ఒక దేశం లేక పొరుగు దేశాల్లోని శరణార్ధుల శిబిరాల్లో తరాల తరబడి మగ్గుతున్న పాలస్తీనియన్లు..ఇజ్రాయెల్‌ ‌మానవహక్కుల హననానికి బలవుతున్న వెస్ట్ ‌బాంక్‌, ‌గాజా ప్రాంతాల్లోని  పాలస్తీనియన్లు మనకు కాకుండా పోయారు. ఇదేనా ప్రజాస్వామిక విలువల పక్షాన నిలుచోవడం…? భారత సమాజానికి ఇవాళ అంతర్జాతీయ సమాజంలో అంత గొప్ప స్థానమేమీ లేదు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినపుడు ఇండియాను ప్రపంచ దేశాలు ఎంత నిశితంగా గమనించాయో మోదీ ఏలుబడిలోని భారత్‌ ‌నడకను కూడా అంతకంటే ఎక్కువ నిశితంగా గమనిస్తున్నాయి. మనకు మనం గొప్పలు చెప్పుకుంటే అవి సత్యాలుగా చెలామణీ అయ్యే రోజులు పోయాయి.

Leave a Reply