- పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
- నిజాల నిగ్గు తేల్చినప్పుడే గుర్తింపు
- ఆ కోవలోనిదే ప్రజాతంత్ర దినపత్రిక
- రెండున్నర దశాబ్దాల అలుపెరుగని పోరాటం ప్రజాతంత్రది
- తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్రది ముఖ్య భూమిక
- మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 25 : సమాజంలోని రుగ్మతలను ఎండగడుతూ, జనాలను జాగృతం చేసినప్పుడే పత్రికలకు గుర్తింపు కలుగుతుందని, నిరంతర సత్యాన్వేషణ ద్వారా సమాజాన్ని ఎప్పటికప్పుడు మేల్కొలుపుతూ వాస్తవాలను ప్రజలకు చేరవేసినప్పుడే పత్రికలకు మనుగడ సాధ్యమవుతుందని మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కుందన్ బాగ్ లోని ఆయన స్వగృహంలో బుధవారం ప్రజాతంత్ర దినపత్రిక నూతన సంవత్సర డైరీ తో పాటు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత మీడియా రంగం కొత్త పోకడలతో వెళుతున్నప్పటికీ, వక్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాస్తవాలను మరుగునపెట్టి అవాస్తవాలు వెలుగులోకి తేవడం కారణంగా విలువలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు పెద్ద, చిన్న పత్రికలే కారణమని తేడా లేదని కూడా కుండబద్దలు కొట్టారు.
అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించి, ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళినప్పుడే పత్రికలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ఆ కోవాలో ప్రజాతంత్ర ముందు ఉంటుందని స్పష్టం చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ఉద్యమానికి అండగా నిలిచింది ప్రజాతంత్ర దినపత్రిక మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదన్నారు. పత్రికలన్నీ ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో కొనసాగుతున్న ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాతంత్ర దినపత్రిక తన వంతు పాత్ర పోషించిందని అనడంలో సందేహం లేదన్నారు. రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతూ లాభనష్టాలతో సంబంధం లేకుండా నిరంతరంగ ప్రచురించబడడం అసామాన్యమని ఆయన కొనియాడారు.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో వార్తా ప్రచురణలో నిబద్ధతగా వ్యవహరిస్తున్న ఏకైక దినపత్రిక ప్రజాతంత్ర మాత్రమేనని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా ప్రజాతంత్ర దినపత్రిక ఎలాంటి బేషజాలు లేకుండా, ఒత్తిళ్లకు లొంగకుండా కొనసాగడం పట్ల యాజమాన్యాన్ని ఆయన అభినదించారు. ఇదే ఒరవడితో కొనసాగుతూ వార్తలను ప్రచురిస్తూ ప్రజల అభిమానం చూరగొనాలని మధుసూదనాచారి కోరారు. అయితే ప్రస్తుత పోటీ తత్వం కారణంగా ఆర్థికంగా కూడా కొంత అవరోధాలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పత్రికలకు అవరోధం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి మాజీ ఓఎస్డి భాస్కరరావు, నియోజకవర్గంలోని నాయకులు చల్లూరి సమ్మయ్య, చింతల రమేష్, నల్ల బుచ్చయ్య, గడ్డి రాజ్ కుమార్, చిట్యాల ప్రజాతంత్ర విలేఖరి రాము, జన్నె రవీందర్ తదితరులు పాల్గొన్నారు.