Take a fresh look at your lifestyle.

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ రేపటి నుంచి నగదు జమ

ఈనెలలో కిలో కందిపప్పు కూడా… ముందుగా నాలుగు జిల్లాలలో

రాష్ట్రవ్యాప్తగా రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌కట్టడి చర్యలలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విధించిన నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం తెల్ల రేషన్‌ ‌కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతీ వ్యక్తికీ ఉచితంగా 12 కిలోలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రూ. 1500 నగదును కూడా తెల్లరేషన్‌ ‌కార్డు కలిగిన ఉన్న వ్యక్తి పేరుపై ఉన్న బ్యాంకులో డిపాజిట్‌ ‌చేసింది. ఇందులో భాగంగా గత నెలలో రాష్ట్రంలో 87.55 లక్షల తెల్ల రేషన్‌ ‌కార్డుదారులు ఉచిత బియ్యం, నగదు లబ్ది పొందారు. ఇదే విధంగా మే నెలలోనూ ఉచిత బియ్యం పంపిణీని మే నెల ప్రారంభం కానున్న శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. రూ. 1500 నగదును కూడా ఈనెల మొదటి వారంలోనే బ్యాంకులలో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించడంతో ఆమేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు, ఈనెలలో తెల్లరేషన్‌ ‌కార్డుదారులందరికీ ఉచితంగా బియ్యంతో పాటు కందిపప్పును కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి 8, 754 మెట్రిక్‌ ‌టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ కేవలం 3, 233 మెట్రిక్‌ ‌టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరింది. దీంతో కందిపప్పు ఉచిత పంపిణీని ముందుగా నిజామాబాద్‌, ‌నల్లగొండ, వరంగల్‌ ‌రూరల్‌, ‌మెదక్‌ ‌జిల్లాలలో మాత్రమే పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కందిపప్పు చేరుకున్న తరువాత రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాలలో సైతం కందిపప్పు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.

Leave a Reply