Take a fresh look at your lifestyle.

‘‘‌ఢిల్లీ’’ ముట్టడి..!

పూటకో మాట పల్లవిస్తేనే.
పంట చేలు ఏపుగా పండవు

అభివృద్ధి మంత్రం జపిస్తేనే…
రైతు బతుకు పొద్దు పొడవదు

సంక్షేమ జల్లులు కురిపిస్తేనే…
ఎవుసం ఏడింతలు రెట్టించదు

పథకాల పూతలు దట్టిస్తేనే …
మట్టి దేహాలు వన్నెలు చిందవు

తుచ్ఛ పలుకులు కట్టిపెట్టండి
పిచ్చి తుగ్లక్‌ ‌చేష్టలు చాలించండి

మీరు ఉహించినట్లుగా…
సత్తెకాలపు సత్థయ్యలం కాము

దేశం ఆకలి తీర్చిన చందంగా…
జాతి ద్రోహుల పాతిపెట్టే దిట్టలం

కలుపు మొక్కల వేరేసిన వైనంగా
వ్యవస్థ చీడల తొలిచేసే నేర్పరులు

నాగళ్లతో దుక్కి దున్నటమే కాదు
పలుగుతో కోటల పెకిలించటం ఎరుకే !

బురద నుంచి బువ్వ తీయటమే కాదు
పోరాట సేద్యంలోను నిష్టాతులమే !

అందుకే !
మీ విష శాసనాల నిరసిస్తూ …
చీకటి ‘‘ఎజెండా’’ ఛీత్కరిస్తూ..
తిరుగుబాటు ‘‘బావుటా’’ ఎత్తినం
రాజధాని హస్తినా నడిబొడ్డున
చారిత్రక ‘‘సంగ్రామం’’ సాగిస్తున్నం
ఇపుడు దేశం మా పక్షమే నిలిచింది
మద్ధతుగా జన ప్రభంజనం పోటెత్తింది
రైతు వ్యతిరేక పాలకుడా !
ఎగురుతున్న పోరు జెండా సాక్షిగా…
ఇక మీ రాజ పీఠాలు బద్ధలుగొట్టుడే ..
ఢిల్లీ కోటపై రైతు జెండా ఎత్తుడే ఆలస్యం
(నల్ల చట్టాల రద్దుకు సాగే కర్షక పోరుకు మద్దతుగా…)
– కోడిగూటి తిరుపతి
ఫోన్‌ ‌నెం. 9573929493

Leave a Reply