Take a fresh look at your lifestyle.

గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు

బీజేపీ గ్రేటర్‌ ‌ప్రచారంలో జాతీయ నేతలు

‌జీహెచ్‌ఎం‌సి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్‌కు మరి నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం నువ్వా నేనా అనే రీతిలో సాగుతోంది. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌, ‌రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు వొడ్డుతున్నారు. టీఆర్‌ఎస్‌ ‌పక్షాన ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ అం‌తా తానై ప్రచార బాధ్యతలను మోస్తున్నారు. రోడ్‌ ‌షోలు,ర్యాలీలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ జీహెచ్‌ఎం‌సి ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్‌ అధినేత,,సీఎం కేసీఆర్‌ ‌విడుదల చేశారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పీఠాన్ని తమకు అప్పగిస్తే నగర ప్రజలకు అందించే పథకాలు, చేయనున్న అభివృద్ధి, ప్రవేశపెట్టనున్న కొత్త పథకాల గురించి వివరించారు.

ఈ ఒక్క సమయంలో మినహాయిస్తే జీహెచ్‌ఎం‌సి ఎన్నికల నగారా మోగక ముందు నుంచే పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌హోదాలో కేటీఆర్‌ ‌పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. డివిజన్ల వారీగా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడం మొదలుకుని ప్రతిపక్ష పార్టీలు సంధిస్తున్న విమర్శలు, ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టడం వంటి బాధ్యతలన్నీ కేటీఆర్‌ ‌స్వయంగా చూస్తున్నారు. అయితే, ఎప్పుడో ఓసారి కొద్ది మంది మంత్రులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ నగర ప్రజలపై అంతగా ప్రభావం చూపడం లేదు. ఇక శనివారం ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జీహెచ్‌ఎం‌సి ఎన్నికల సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. సీఎం కేసీఆర్‌ ఈ ‌బహిరంగ సభలో సమర శంఖం పూరించనున్నారు. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలు అధికార పార్టీపై చేసిన విమర్శలకు, ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభతో • కొత్త జోష్‌ ‌వస్తుందని అది తమ విజయానికి దోహదం చేస్తుందని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ అభ్యర్థుల పక్షాన ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌, ‌నిజామాబాద్‌ ఎం‌పి అర్వింద్‌, ‌గోషామహల్‌, ‌దుబ్బాక ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ‌రఘునందన్‌రావు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాగా, జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల పక్షాన ప్రాచారం కోసం ఆ పార్టీ జాతీయ నాయకలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పార్టీ జీహెచ్‌ఎం‌సి ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌విడుదల చేయగా, ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ ‌జావదేకర్‌, ‌స్మ•తి ఇరానీ మీడియా ప్రతినిధుల సమావేశాలు నిర్వహించి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అంతటితో ఆగకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ అభ్యర్థుల పక్షాన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా, ఉత్తరప్రదేశ్‌ ‌సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‌కూడా బీజేపీ అభ్యర్థుల పక్షాన గ్రేటర్‌లో ప్రచారం చేయనున్నారు. అలాగే, ప్రధాని మోదీ అకస్మాత్తుగా తెలంగాణ పర్యటనకు రానుండటం కూడా రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్‌ ‌శివారులోని శామీర్‌పేటలో భారత్‌ ‌బయోటెక్‌ అభివృద్ది చేస్తున్న కోవాగ్జిన్‌ను పరిశీలించేందుకు ఆయన వస్తున్నప్పటికీ జీహెచ్‌ఎం‌సి ఎన్నికలపై ఆయన పర్యటన ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, నగర పాలక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకులు ప్రచారానికి రావడం ఏమిటని టీఆర్‌ఎస్‌ ‌నేతలు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ను వోడించడానికి బీజేపీ జాతీయ నేతలు డిల్లీ నుంచి దిగి రావడం వరకు బాగానే ఉన్నా ఒకవేళ ఆ పార్టీ వోటమి పాలైతే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply