Take a fresh look at your lifestyle.

ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా దిల్లీ

“అత్యంత కలుషిత 50 ప్రపంచ నగరాల జాబితాలో 35 నగరాలు ఇండియావే కావడం గమనించారు. అత్యంత గాలి కలుషిత 100 ప్రపంచ నగరాలలో 63 నగరాలు భారత దేశానికే చెందినవే అని తేల్చారు. ఉత్తర భారత నగరాలు, ముఖ్యంగా యూపి, హర్యానా రాష్ట్రాల నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా ఉండడం, అందులో న్యూఢిల్లీ అతి కలుషిత నగరంగా నిలవడం గమనించారు.”

(తాజాగా స్విస్‌ ఐక్యూ ఏయిర్‌ ‌సంస్థ విడుదల చేసిన ‘ప్రపంచ గాలి నాణ్యత నివేదిక-2021’ ఆధారంగా)
ప్రపంచవ్యాప్తంగా 107 దేశాల రాజధానుల్లో అత్యంత గాలి కాలుష్య మహానగరంగా వరుసగా నాలుగవ సారి దిల్లీ తొలి స్థానంలో నిలవడం నగరవాసులకు ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నది. తాజాగా ‘స్విస్‌ ఐక్యూ ఏయిర్‌ ‌సంస్థ’ విడుదల చేసిన ‘ప్రపంచ గాలి నాణ్యత నివేదిక – 2021 (వరల్డ్ ఏయిర్‌ ‌క్వాలిటీ రిపోర్ట్-2021)’ ‌వివరాల ఆధారంగా 117 దేశాలకు చెందిన 6,475 నగరాల వార్షిక సగటు గాలి నాణ్యత వివరాలను పియం2.5 (పార్టిక్యులేట్‌ ‌మ్యాటర్‌ ‌గాఢత, సూక్ష్మ ధూళి కణాలు గాఢత) గణాంకాల రూపంలో అధ్యయనం చేశారు. సెంట్రల్‌-‌సౌథ్‌ ఆసియా ఖండానికి చెందిన అధిక గాలి కాలుష్యం కలిగిన 50 నగరాలలో 46 ఇండియా నగరాలు ఉన్నాయనే కఠిన వాస్తవాన్ని నివేదిక వెల్లడించింది. ఇండియాలోని రాజస్థానీ భివండీ నగరం 106.2 మైక్రోగ్రామ్స్/‌ఘనపు మీటర్‌ ‌పియం2.5 గాఢతను కలిగి కాలుష్యంలో అగ్రభాగాన నిలుస్తున్నది.

దిల్లీ నగరంలో పియం 2.5 వార్షిక సగటు 2020 ఏడాదిలో 84 మైక్రోగ్రామ్స్/‌ఘనపు మీటర్‌గా నమోదు కాగా 2021 సగటు మాత్రం 96.4 వరకు (దాదాపు 15 శాతం) పెరగడం గమనించబడింది. ఐరాస డబ్ల్యూహెచ్‌ఓ ‌నిర్థేషించిన ఆరోగ్యకర పియం2.5 (5-10 మై.గ్రా./ క్యూబిక్‌ ‌మీటర్‌) ‌విలువలకు లోబడి ఏ భారత నగరం లేకపోవడమే కాకుండా 48 శాతం నగరాల్లో 10 రెట్లు అధికంగా కాలుష్యం నమోదు కావడం, దిల్లీలో 20 రెట్లు అధిక కాలుష్యం రికార్డు కావడం బయట పడింది. అత్యంత కలుషిత 50 ప్రపంచ నగరాల జాబితాలో 35 నగరాలు ఇండియావే కావడం గమనించారు. అత్యంత గాలి కలుషిత 100 ప్రపంచ నగరాలలో 63 నగరాలు భారత దేశానికే చెందినవే అని తేల్చారు. ఉత్తర భారత నగరాలు, ముఖ్యంగా యూపి, హర్యానా రాష్ట్రాల నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా ఉండడం, అందులో న్యూఢిల్లీ అతి కలుషిత నగరంగా నిలవడం గమనించారు.

ప్రపంచ గాలి కాలుష్య నగరాలు :
ప్రపంచవ్యాప్తంగా 97 శాతం నగరాల గాలి కాలుష్య పరిమాణం ఐరాస నిర్థేషించిన ప్రమాణాలను మించి ఉండడం గమనించారు. అధ్యయనం చేసిన 6,475 నగరాల్లో 222 నగరాలు మాత్రమే సురక్షిత గాలిని కలిగి ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్‌, ‌యూకె దేశాల నగరాలలో గాలి కాలుష్యం కనిష్టంగా నమోదు అవుతున్నాయి. ‘స్విస్‌ ‌ఫర్మ్ ఐక్యూఏయిర్‌‘ ‌విడుదల చేసిన నివేదికలో అత్యధిక గాలి కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ (ఇండియా), ఢాకా (బంగ్లాదేశ్‌), ‌యన్‌ ‌జమెనా (ఛాద్‌?), ‌దుషాంబె (తజకిస్థాన్‌), ‌మస్కట్‌ (ఓమన్‌)‌లు జాబితాలో ముందు ఉన్నాయి. అధిక గాలి కాలుష్య దేశాల జాబితాలో బంగ్లాదేశ్‌, ‌ఛాద్‌?, ‌పాకిస్థాన్‌, ‌తజకిస్థాన్‌, ఇం‌డియా (5వ స్థానం), ఓమన్‌, ‌క్రిగిస్థాన్‌, ‌బెహరెయిన్‌, ఇరాక్‌, ‌నేపాల్‌ ‌దేశాలు తొలి 10 స్థానాలలో నిలిచాయి. అత్యధిక పియం2.5 కాలుష్యం కలిగిన 10 భారత నగరాల్లో భివండి (పియం2.5 విలువ 106.2), గజియాబాదు (102), ఢిల్లీ (96.4), జాన్‌పూర్‌ (95.3), ‌నోయిడా (91.4), బాగ్‌పట్‌ (89.1), ‌హిస్సార్‌ (89.0), ‌ఫరీదాబాదు (88.9), గ్రేటర్‌ ‌నోయిడా (87.5), రోహతక్‌ (86.9) ‌నగరాలు ఉన్నాయి. ఇండియాలో సగటు వార్షిక పియం2.5 విలువ 58.1గా నిర్ణయించబడింది. అమెరికాలో అధ్యయనం చేసిన 2,400 నగరాలలో లాస్‌ ఏం‌జలిస్‌లో కాలుష్యం అధికంగా ఉందని తేల్చారు.

గాలి కాలుష్యానికి కారణాలు, దుష్ప్రభావాలు : గాలి కాలుష్యానికి ప్రధాన కారణాలుగా వాహన శిలాజ ఇంధన ఉద్గారాలు, బొగ్గు ఆధార పవర్‌ ‌ప్లాంట్లు, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్ధాలను కాల్చడం, బయోమాస్‌కు అగ్గి పెట్టడం, వంట చెరుకు కాల్చడం, పొగమంచు, కార్చిచ్చులు, విచక్షణారహితంగా శిలాజ ఇంధనాల వినియోగం, ధూళి తుఫాన్లు లాంటివి వస్తాయి. పియం2.5 ధూళి కణాల పరిమాణం అతి సూక్ష్మంగా ఉండడంతో శ్వాసతో పాటు ఊపిరితిత్తులకు చేరి రక్త ప్రసరణలో సులభంగా కలవడంతో తీవ్ర అనారోగ్యాలు కలుగుతున్నాయి. ఇండియాలో గాలి కాలుష్యంతో 150 బిలియన్‌ ‌డాలర్ల నష్టం వాటిల్లుతున్నది. నగర ప్రజలు అత్యంత గరళ గాలి పీల్చుతూ తమ ఆరోగ్యాలను పణంగా పెట్టడం జరుగుతోంది. ఇండియాలో గాలి కాలుష్యాలతో ఆస్తమా, ఎలర్జీ, గుండె, శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలుగుతూ, గాలి కాలుష్య సంబంధ మరణాలు నిమిషానికి మూడు నమోదు కావడం నమ్మలేన నిజంగా భావించాలి.

2016లో పియం2.5 గాలి కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్ల మరణాలు నమోదు కాగా 2021లో పియం2.5 ప్రమాణాలను 5 నుంచి 10 కి పెంచడంతో వార్షిక మరణాలు 3.3 మిలియన్లుగా అంచనా వేశారు. గాలి కాలుష్య పియం2.5 ప్రమాదకర స్థాయిలను తగ్గించడానికి శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, సాంప్రదాయేతర తరగని శక్తి వనరుల వాడకాన్ని పెంచడం, వ్యవసాయ వ్యర్ధాలను కాల్చకుండా గ్రీన్‌ ‌శక్తిగా మార్చడం, పారిశ్రామిక వ్యర్ధాలను శుద్ది చేయడం, కార్చిచ్చులను కట్టడి చేయడం, భూతాపాన్ని తగ్గించడం లాంటి పలు చర్యలను సుదీర్ఘ కాలం పాటు నిక్కచ్చిగా తీసుకోవడంతో గాలి కాలుష్యం సురక్షిత స్థాయికి చేరుకొని, నగర జీవనం సుఖమయం అవుతుంది. నగర జీవనం నరక సమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత అందరి మీద ఉందని గమనిద్దాం, పట్టణీకరణ పట్టుతప్పకుండా జాగ్రత్త పడదాం.

Leave a Reply