డెత్ వారంట్లపై స్టే విధించిన కోర్టు
అనుకున్నట్లే నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య చివరకు వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు మరోసారి స్టే విధించింది. గతంలో ఇచ్చిన డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషన్లో గుప్తా కోరాడు. దీంతో విచారణ అనంతరం ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. స్టే ఇవ్వడం ఇది మూడోసారి. జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్ వారెంట్లు ఇచ్చింది. కానీ గుప్తా పిటిషన్‌తో అది కూడా ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్ వారెంట్లపై పటియాలా హౌస్ కోర్టు స్టే విధించింది. ఉరి శిక్ష అమలులో ఆలస్యం చేయాలన్న నిర్భయ దోషులు కుట్రలు మరోసారి తాత్కాలికంగా విజయం సాధించాయి. తెల్లారితే ఉరి తీస్తారనగా.. కొద్ది గంటల ముందు ఢిల్లీ పటియాలా కోర్టు మరణ శిక్ష అమలును నిలిపేసింది. నిర్భయ దోషుల ఉరి అమలును తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేయాలని సోమవారం సాయంత్రం ఆదేశాలిచ్చింది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని గతంలో డెత్ వారెంట్ ఇచ్చిన అదే కోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మరణ శిక్ష అమలు నిలిపేయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.
నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పిటిషన్‌పై విచారణ తర్వాత ఈ తీర్పు ఇచ్చింది కోర్టు. నిర్భయ దోషులు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ల ఉరిని ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అయితే రేపు ఉరి తీయడం ఖాయమని అందరూ అనుకుంటున్న సయమంలో ఉదయం నుంచి దోషుల తరఫు లాయర్ తన ప్రయత్నాలను మొదలు పెట్టారు. ముకేశ్ సింగ్, పవన్ గుప్తా విడివిడిగా ఉరి అమలుపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్లు వేశారు. ఉదయమే వాటిని విచారించిన కోర్టు వెంటనే తిరస్కరించింది. ఆ తర్వాత క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు పనవ్ గుప్తా. దీనిని సాకుగా చూపిస్తూ మధ్యాహ్నం మరోసారి పటియాలా కోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరి అమలుపై స్టే విధించాలని పిటిషన్ వేశాడు. అయితే అతడి క్షమాభిక్షను కోర్టు తీర్పు వచ్చేలోపే రాష్ట్రపతి తిరస్కరించారు. అయినప్పటికీ క్షమాభిక్ష పటిషన్ తిరస్కరించిన తర్వాత ఉరి అమలుకు కనీసం 14 రోజుల సమయం ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో పటియాలా కోర్టు మరోసారి ఉరిశిక్ష వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ నలుగురినీ ఉరి తీయొద్దంటూ డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చింది. 2012 డిసెంబరు 16న ఢిల్లీలో ఓ యువతి (నిర్భయ)ని కిడ్నాప్ చేసి రన్నింగ్ బస్సులో ఆరుగురు కలిసి దారుణంగా రేప్ చేశారు. అత్యాచారం చేస్తూ పైశాచికంగా హింసించి.. రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఆమె చికిత్స పొందుతూ 2012 డిసెంబరు 29న మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ (17సంవత్సరాల 6నెలలు)ను పోలీసులు అరెస్టు చేశారు. దోషిగా తేలినప్పటికీ మైనర్ జువైనల్ చట్టం ప్రకారం మూడు సంవత్సరాల జైలుశిక్షతో బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్ 13న తీర్పు చెప్పింది. 2017 మే 5న ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.