అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కో ఆపరేషన్ ఒప్పందం(బెకా) ఇంత వరకూ మన దేశం చేసుకున్న ఒప్పందాలన్నింటిలో అత్యంత కీలకమైనది. చైనా నుంచి అనునిత్యం కవ్వింపులు ఎదురవుతున్న తరుణంలో అగ్రరాజ్యం అండ మనకు లభించడం హర్షదాయకమే. అయితే.. అమెరికాతో ఒప్పందం వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. అమెరికా శత్రువులు మనకు కూడా శత్రువులవుతారు. ఇప్పుడున్న అంతర్జాతీయ వాతావరణంలో అమెరికాకు కూడా భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అండ అవసరం ఉంది. అమెరికా పూర్వపాలకులు అనుసరించిన విధానాల వల్ల విశ్వసనీయతను కోల్పోయింది. దానిని తిరిగి పునరుద్ధరించడం కోసం భారత్ వంటి తటస్థ దేశాన్ని దగ్గర తీసుకోవడం అమెరికాకూ అవసరమే. చైనా విసురుతున్న సవాల్‌ను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ తోడు అవసరం కనుకనే, మన దేశంతో బెకా ఒప్పందానికి అమెరికా ముందుకు వొచ్చింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అంగీకరించారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రపంచంలో అనేక దేశాలు అమెరికాకు దూరమయ్యాయి. వారం రోజుల్లో తిరిగి దేశాధ్యక్షుడి ఎన్నిక జరగనున్న తరుణంలో భారత్‌తో ఈ ఒప్పందాన్ని అమెరికా ఇంత అర్జంట్‌గా చేసుకోవల్సిన పరిస్థితి రావడానికి అక్కడి రాజకీయ ఒత్తిళ్ళు కూడా కారణం కావచ్చు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలో ఫలితాన్ని ప్రవాస భారతీయుల(ఎన్నారైల) వోట్లు నిర్ధారిస్తాయి. ప్రవాస భారతీయులు గత జనవరి వరకూ ట్రంప్‌కి అనుకూలంగానే ఉన్నారు. తర్వాత కొరోనా వైరస్ ప్రభావం ట్రంప్ వల్లే ఎక్కువైందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రవాస భారతీయులను గాయపర్చాయి.
ముఖ్యంగా, డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారీస్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రవాస భారతీయుల్లో అసంతృప్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి ఎన్నిక వారం రోజులలో జరగనున్న తరుణంలో ట్రంప్ తన విదేశాంగ మంత్రి పోంపియోనూ, రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్లను భారత్‌కి పంపించారు. అసలు ఈ ఒప్పందం ఎప్పుడో కుదరాల్సి ఉంది. ఈ ఒప్పందంలో పేర్కొన్న కొన్ని అంశాలపై మన దేశం స్పష్టత కోరింది. వాటికి అమెరికా సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యర్థి కూటములు లేకపోయినా, అమెరికా అగ్రరాజ్యంగా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే, చైనా ఆర్థిక శక్తిగా ఎదగడంతో పూర్వపు సోవియట్ యూనియన్ పాత్రను ఇప్పుడు పోషిస్తోంది. ఈ కారణంగా చైనా,అమెరికాల మధ్య ఇప్పుడు ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది. గతంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగినప్పుడు మన దేశం అలీన విధానాన్ని అనుసరించింది. అంటే ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థవిదానాన్ని అనుసరించింది. ఇప్పుడు అలా ఉండటం కుదరదని మోడీ ప్రభుత్వం పేర్కొంటోంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన సమయంలో మన ప్రధానిగా పీవి నరసింహారావు ఎటువైపూ మొగ్గు చూపకుండానే, ఆర్థిక సంస్కరణలను అమలు జేశారు. ఇప్పటి పాలకులకు అది సాధ్యం కావడం లేదు. పైగా, గతంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం జరిగినప్పుడు రెండు కూటములు కూడా ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే రీతిలో వ్యవహరించలేదు. ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానం వల్ల తటస్థంగా ఏ దేశమైనా ఉందామన్నా కుదరని పరిస్థితి ఏర్పడుతోంది.
అందువల్ల కాలానుగుణంగా కూటములు, పొత్తులు మార్చుకోవడం తప్పని సరి అని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఆయన మాటలను తోసిరాజనలేం కానీ, అమెరికా తన సహజగుణం ప్రకారం మిత్ర దేశాలలో అతి జోక్యం చేసుకోవడానికి వెనుకాడదన్న వాస్తవాన్ని మరిచిపోరాదు. గతంలో అమెరికా అనుసరించిన వైఖరినే ఇప్పుడు చైనా అనుసరిస్తోంది. అగ్రరాజ్యం హోదా కోసం చైనా వ్యూహాలు, ఎత్తుగడలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్న మాట నిజమే. ముఖ్యంగా మనకు పొరుగు దేశం కావడం వల్ల మన భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా సాగిస్తున్న యత్నాలను అడ్డుకోవడానికి బలమైన దేశం అండదండలు అత్యవసరం. ఈ కోణం నుంచి ఆలోచిస్తే అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న బెకా ఒప్పందం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని తావంగ్ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. లడఖ్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా, మన సైనికులు తరిమి కొట్టారు. ఈ పోరులోనే తెలంగాణకి చెందిన మేజర్ సంతోష్ బాబు సహా 20 మంది మరణించారు. మళ్ళీ అలాంటి చొరవకు, దూకుడుకు చైనా పాల్పడకుండా ఉండేందుకు ముందుగానే చైనా పోకడలను ఉపగ్రహ వ్యవస్థ ద్వారా కనిపెట్టి సమాచారాన్ని బెకా ఒప్పందం ప్రకారం అమెరికా అందించనుంది. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రరాజ్యానికి ఉన్న వెసులుబాట్లు మనకు తోడ్పడతాయి. అయితే, అదే పరిజ్ఞానాన్ని మన దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అమెరికా వినియోగించే ప్రమాదం ఉంది. అందువల్ల బెకా ఒప్పందం వల్ల లాభాలతో పాటు బెదురు కూడా ఉందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాతో పూర్తిగా అంటకాగకూడదన్న పూర్వపు ప్రధానులు విధానాలను దాటుకుని ప్రధాని మోడీ చొరవ తీసుకుంటున్నారు. దీని ప్రయోజనాలు, మంచి చెడ్డ•లు భవిష్యత్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి బెకా ఒప్పందం చైనాకు చెక్ పెట్టేందుకు ఉపయోగ పడుతుందన్నడంలో సందేహం లేదు.