Take a fresh look at your lifestyle.

పరువు హత్యలతో ఉన్న పరువు పోతుంది

పరువు హత్యలనేవి ఇంతవరకూ ఉత్తరాదికే పరిమితం. ఇప్పుడవి తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. పరువు హత్యలంటే కులాంతర వివాహాలకు సంబంధించినవే. నాగరిక సమాజంలో అందునా  మహానగరాల్లో ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు, సహోద్యోగులతో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్న సంఘటనల్లో అన్నీ విషాదాంతం కావడం లేదు. అయితే, ఆడపిల్లల తల్లితండ్రులు తమ బిడ్డలు తీసుకునే స్వతంత్ర నిర్ణయాలను జీర్ణించుకోలేక   ఎంతటికైనా తెగబడుతున్నారు. గ్రామాల్లో కుల వ్యవస్థ ఇప్పటికీ బలంగా పాతుకుని పోవడమే ఇందుకు కారణం. పరువు హత్య కేసుల్లో నిందితులకు  సకాలంలో తగిన శిక్షలు పడకపోవడం వల్ల  ఇలాంటి హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రెండేళ్ళ క్రితం సరిగ్గా ఇదే నెలలో మిర్యాల గూడాలో   ప్రణయ్‌ అనే యువకుడు  పరువు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అది మరవక ముందే  తాజాగా హైదరాబాద్‌ ‌చందానగర్‌లో హేమంత్‌ అనే యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. ఈ రెండు సంఘటనల్లోనూ ఆ యువకులను ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువతులు తల్లితండ్రులతో విభేదించడమే కాకుండా, వారిపై నిప్పులు కక్కడం, హత్యలు చేసినవారినీ, చేయించిన వారినీ ఉరితీయాలంటూ డిమాండ్‌ ‌చేయడం గమనార్హం. ఈ రెండు సంఘటనలూ కులాంతర వివాహాల కారణంగానే జరిగాయి. తమ ఆడబిడ్డలు స్వతంత్రించి వేరే కులానికి చెందిన వారిని పెళ్ళి చేసుకోవడాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేక ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి మన సమాజంలో రక్షణ కరువవుతోంది. ఈ విషయంలో ఆడపిల్లలు సాహసం చేసి ముందుకు వస్తున్నా, వారి తల్లితండ్రులు మాత్రం  నిప్పులు చెరుగుతున్నారు.

తమ బిడ్డల భవిష్యత్‌ ‌గురించి ఆలోచించకుండా, వారు ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకులను హతమారుస్తున్నారు. సోషల్‌ ‌మీడియా వ్యాప్తి కారణంగా, యువతీ యువకుల మధ్య పరిచయాలు పెరుగుతున్నాయి. వాట్స్ అప్‌లలో, ఫోన్‌ ‌లలో చాటింగ్‌ల కారణంగా సాన్నిహిత్యం పెరుగుతోంది. తల్లితండ్రులకు  తెలియకుండా సాగుతున్న ఈ తతంగాలు చివరికి స్వతంత్రంగా పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలకు పునాది అవుతున్నాయి. ఇలా ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకున్నవారి జీవితాలన్నీ విషాదాంతాలు కావడం లేదు. పరస్పర అవగాహనతో వారు జీవనం సాగిస్తున్నారు. ఆస్తులూ, హోదాలు కలిగి సమాజంలో పేరు ప్రతిష్ఠలను నిలుపుకోవాలనే తాపత్రయం ఉన్న వారు మాత్రం  తమ ఆడపిల్లల జీవితాల్లో నిప్పులు పోయడానికి సిద్ధపడుతున్నారు. ఆర్థిక పరమైన అంతరాలే ఇలాంటి దారుణాలకు పురి కొల్పుతున్నాయి. సామాన్య ఉద్యోగులు తమ పిల్లలు ఒక వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా సర్దుకుని పోతున్నారు. కులాభిమానం రాజకీయ నాయకుల కారణంగా కులోన్మాదంగా మారింది. సర్పంచ్‌ ‌స్థాయి నుంచి ఎంపీ పదవి వరకూ అన్నింటికీ  కులాల ఆధారంగానే  అభ్యర్థుల ఎంపిక జరుగుతుండటంతో కుల పిచ్చి మరింతగా ముదురుతోంది. రాజకీయాల్లో కులాభిమానం గతంలో ఎన్నికల వరకే పరిమితం అయ్యేది. ఇప్పుడు రాజకీయాల ద్వారా పదవులు అనుభవిస్తున్నవారూ, ఆశిస్తున్న వారూ కులాంతర వివాహాలను సరిపెట్టుకోలేక     ఎంతకైనా తెగిస్తున్నట్టు వెలుగులోకి వస్తున్న సంఘటనలు రుజువుగా నిలుస్తున్నాయి.

మిర్యాల గూడాలో ప్రణయ్‌ అనే యువకుణ్ణి చంపేందుకు సాక్షాత్తూ అతడి భార్య తండ్రే కిరాయి హంతకుల సాయం తీసుకున్నాడు. ఆ ఘటనలో  ప్రణయ్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువతి అమృత తల్లితండ్రులను ఎదిరించి అత్తమామల పక్షాన నిలిచింది. తాజాగా జరిగిన హేమంత్‌ అనే యువకుని హత్య ఘటనలో అతడి భార్య  అవంతి కూడా తన తల్లితండ్రులనే కాకుండా మేనమామను దోషులుగా వేలెత్తి చూపుతూ వారికి తగిన శిక్ష పడాలని డిమాండ్‌ ‌చేస్తోంది. ఈ రెండు ఘటనల్లోనూ ఆడపిల్లలు మైనారిటీ తీరిన వారే. ఈ విషయం వారే స్వయంగా చెబుతున్నారు. తమకు మైనారిటీ తీరినందున తమ పెళ్ళి తమ ఇష్టమని వారే చెబుతున్నారు. అలాంటప్పుడు ఆ ఆడపిల్లల తల్లితండ్రులు సాధ్యమైనంత వరకూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలే తప్ప ఇలాంటి దారుణాలకు పాల్పడకూడదు. మిర్యాల గూడా సంఘటనలో అమృత తన తండ్రిపై బహిరంగంగానే విమర్శలు చేసింది.   తన పరువును ఆయనే తీసుకున్నాడని ఆరోపించింది. ఇప్పుడు తాజా సంఘటనలో అవంతి కూడా అదే మాట అంటున్నది. వారి మాటల్లో నిజం ఉంది.   తల్లితండ్రులు అవమానమని భావించినా, ఆగ్రహావేశాలకు లోనుకాకుండా, సంయమనాన్ని పాటిస్తే కాలక్రమంలో అన్నీ సర్దుకుని పోతాయి. తమ ఆడపిల్లలను మొదట్లో వ్యతిరేకించినా వారి కాపురాలు ఏ చీకూ చింతా లేకుండా సాగిపోతుండటంతో తిరిగి సంబంధాలను  కొనసాగిస్తున్న తల్లితండ్రులు కూడా ఉన్నారు. ఇది సామాజిక సమస్య. కులాంతర వివాహాలు చేసుకోమని ప్రోత్సహించేవారే, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి దన్నుగా నిలవడం లేదు. ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు ఎవరి దన్నూ, దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, లేదా ఎదురు చూడకుండా తమ సంసారాలను  చక్కదిద్దుకుంటున్నారు. ఆడపిల్లలకు ఆస్తి కన్నా చదువు ఉద్యోగాలు అవసరమన్న డిమాండ్‌ ఎం‌త సమంజసమైనదో ఇలాంటి వారే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇది సామాజిక సమస్య కనుక,  సామాజికంగానే దీనిని ఎదుర్కోవాలి తప్ప పరువు హత్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. సమాజం దీనిని హర్షించదు. కులాంతర వివాహాలను ఆదర్శంగా తీసుకునే వారు ఇలాంటి ధోరణులను సమర్థించరు. తమ పిల్లలు ఎక్కడున్నా భర్త, బిడ్డలతో  సంతోషంగా కాపురం చేసుకుంటే చాలని ఆకాంక్షించేవారే  అసలైన తల్లితండ్రులు. పరువు హత్యలు పెరగడానికి డబ్బు, అధికారం, అంతస్తు ప్రధాన కారణాలు.

Leave a Reply