వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దీపికా జెఎన్‌యు సందర్శన స్ఫూర్తినిచ్చింది..: రఘురామ్‌ ‌రాజన్‌

January 13, 2020

Deepika's visit to JNU inspires Raghuram Rajan

ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి దీపికా పదుకునే ఆ యూనివర్సిటీని సందర్శించడం అందరికీ ఉత్తేజాన్ని కలిగిందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌వ్యాఖ్యానించారు. అంతేకాక, అక్కడి సంఘటనలపై ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ ‌లావాసా, సివిల్‌ ‌సర్వెంట్సు శశికాంత్‌ ‌సెంథిల్‌, ‌కన్నన్‌ ‌గోపీనాథన్‌ ‌స్పందించిన తీరు రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు. బాలీవుడ్‌ ‌నటి దీపికా పదుకునే, ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ ‌లావాసా, రాజీనామా చేసిన ఐఏఎస్‌లు శశికాంత్‌ ‌సెంథిల్‌, ‌కన్నన్‌ ‌గోపీనాథన్‌లు ధైర్యంగా తమ అభిప్రాయాలను వెల్లడించగలిగారని ప్రశంసించారు. సెంథిల్‌, ‌గోపీనాథన్‌లు ప్రభుత్వ విదానాల పట్ల అసంతృప్తి చెంది ఐఏఎస్‌కు రాజీనామా చేశారు. ముఖ్యంగా, నిరసన తెలుపుతున్న పౌరులపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నచ్చకే వారు రాజీనామాలు చేశారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు పెదవి విప్పేందుకు ఆ పదవులను తృణప్రాయంగా త్యజించడం గొప్ప విషయమని రఘురామ్‌ ‌రాజన్‌ ‌ప్రశంసించారు. దీపికా పదుకునే బాలీవుడ్‌లో అగ్రనటిగా పేరు సంపాదించుకున్నారనీ, ఈ యూనివర్సిటీలో బాధితులను పరామర్శించేందుకు వెళ్ళారనీ, అక్కడ జరిగిన సంఘటలనకు నిరసన తెలిపారని, ఇది ఆమెలోని మానవీయ కోణానికి నిదర్శనమని రాజన్‌ అన్నారు. యూనివర్శిటీలో జరిగిన సంఘటనల్లో బాధితులకు సౌహార్దం, సానుభూతి తెలిపినందుకు ఆమెపై బీజేపీ నాయకులు నిప్పులు కురిపించారు. హిందుత్వ వాదులు కూడా ఆమెను దుయ్యబట్టారు. ఈ యూనివర్సిటీలో జరిగిన మూక దాడిలో 34 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంతేకాక, వీడియో పుటేజ్‌లో కూడా పోలీసులు చేష్టలుడిగి నిస్సహాయంగా చూస్తున్న దృశ్యాలు బయటపడ్డాయని ఆయన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఆ యూనివర్శిటీలో దాడి చేసిన ముసుగు వీరులు ఎవరో స్పష్టంగా తెలియకపోయినా ప్రత్యర్థులై ఉంటారనీ, పోలీసులు జోక్యం చేసుకోకవడాన్ని బట్టి అనుమానాలు మరింత బలపడుతున్నాయని ఆయన అన్నారు.

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలో ఇలాంటి సంఘటనలు జరిగితే మిగిలిన విద్యా సంస్థల్లో చోటు చేసుకునే ఘటనల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం హక్కునే కాదు, బాధ్యతలను ఇచ్చిందన్న విషయం మరిచిపోరాదని ఆయన అన్నారు. సెంథిల్‌, ‌కన్నన్‌లు ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో తమ బాధ్యతలను నిర్వహించలేమని నిర్ధారణకు రావడం వల్లనే రాజీనామా చేశారని రాజన్‌ అన్నారు. జాతీయ పౌర పట్టిక, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై బలప్రయోగాన్ని దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా ఖండిస్తున్నారు. అందరూ స్పందిస్తున్నారు, కేవలం నిరాశావాదులు మాత్రమే మిన్నకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌ ‌లావాసాపై ఎన్ని వొత్తిడులు వస్తున్నా ఆయన ధర్మం పక్షాన నిలబడటం అభినందనీయమని రాజన్‌ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశంలో పుట్టినందుకు ఆయన నుంచి స్ఫూర్తిని తీసుకుని అన్యాయాన్నీ, అక్రమాలను వారు ఎదిరిస్తున్నారని రాజన్‌ అన్నారు.

Tags: Deepika’s, JNU inspires, Raghuram Rajan,  Nrc caa,  jn university