Take a fresh look at your lifestyle.

దీపికా ఇచ్చిన బలమైన సందేశం

జేఎన్‌యు విద్యార్థులను పరామర్శించాలనే ఆమె నిర్ణయానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు సమాజంలో ఉన్నాయని అందరికి ఎరుక ఉన్న అంశమే. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే వాతావరణమే దేశంలో లేని తరుణంలో మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రశ్నించే వారిని సమర్థించినా ఎదురు దాడి జరుగుతున్న సమయంలో దీపికా తన అభిప్రాయాన్ని చాలా ధైర్యంగా ప్రకటించారు. యాసిడ్‌ ‌బాధితురాలి పాత్రలో ఆమె నటించిన ‘ఛపక్‌’ ‌సినిమా విడుదలకు ముందు ఇది ఆమెకు మరింత ప్రమాదకరం.

ISupport Deepika, Delhi pedestal, JNU launching pad, Boycott Chhapaakమంగళవారం సాయంత్రం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలోకి ఎవరూ ఊహించని ఓ వ్యక్తి వచ్చారు. తమపై జరిగిన దాడికి నిరసనలు చేస్తున్న విద్యార్థుల దగ్గరికి ఆమె వెళ్లారు. దాడుల్లో గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ను కలిశారు. విద్యార్థులకు తన సంఘీభావాన్ని తెలిపారు. పది నిమిషాల పాటు ఆమె అక్కడ ఉన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె ఏ ప్రసంగాలు చేయలేదు. అయినా ఆమె ఓ బలమైన సందేశాన్ని సమాజం ముందు పెట్టారు.

ధైర్య సంతకం
జేఎన్‌యు విద్యార్థులను పరామర్శించాలనే ఆమె నిర్ణయానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు సమాజంలో ఉన్నాయని అందరికి ఎరుక ఉన్న అంశమే. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే వాతావరణమే దేశంలో లేని తరుణంలో మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రశ్నించే వారిని సమర్థించినా ఎదురు దాడి జరుగుతున్న సమయంలో దీపికా తన అభిప్రాయాన్ని చాలా ధైర్యంగా ప్రకటించారు. యాసిడ్‌ ‌బాధితురాలి పాత్రలో ఆమె నటించిన ‘ఛపక్‌’ ‌సినిమా విడుదలకు ముందు ఇది ఆమెకు మరింత ప్రమాదకరం. దీపిక జేఎన్‌యూ విద్యార్థుల దగ్గరకు వెళ్లడంపై ఆగ్రహించిన కాషాయ నేతలు, భక్తులు త్వరలో విడుదల కాబోతున్న ఆమె సినిమా ఛపాక్‌ను బాయ్‌ ‌కాట్‌ ‌చేయాలని సోషల్‌ ‌మీడియాలో ట్రెండ్‌ ‌చేయటం మోదలు పెట్టారు. కొంతమంది బీజేపీ నేతలు కూడా ‘Boycott Chhapaak’తో ఛపాక్‌ను బహిష్కరించాలని అపీల్‌ ‌చేశారు. ‘టుక్డే టుక్డే గ్యాంగ్‌’‌కు దీపిక సపోర్ట్ ఇస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్‌ ‌పత్రాతో బాటు కొంతమంది నేతలు, మంత్రులు ఆమెను విమర్శించారు. ఆమె నటించిన సినిమాలను బహిష్కరించాలని సూచించారు. అదే సమయంలో సోషల్‌ ‌మీడియాలో దీపికకు మద్దతుగా నిలబడిన వారి సంఖ్యా తక్కువేమీ లేదు. బుధవారం ఉదయం ‘ISupport Deepika’ హ్యాష్‌ ‌టాగ్‌ ‌భారత్‌ ‌టాప్‌ ‌ట్రెండ్స్‌లో నిలవటం ఊరటనిచ్చే అంశం.

చైతన్యానికి చిరునామా జేఎన్‌యు
విశ్వవిద్యాలయాలు నాయకత్వానికి పునాది రాళ్లు వేస్తాయి. యూనివర్శిటీ ప్రాంగణాల్లోనే నాయకత్వం రూపు దిద్దుకుంటుంది. భారతదేశ భవిష్యత్తు ఆశలకు, కలలకు విశ్వవిద్యాలయాలే వేదికలు. దేశాన్ని ఏలిన చాలా మంది నేతలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో తమను తాము మలుచుకున్న వారే. కేవలం శాస్త్ర, సాంకేతిక పరిశోధనలే కాదు సామాజిక ప్రయోగాలు చేయగలిగే నేర్పు, చైతన్యం వారిలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ కోవలో ఢిల్లీలోనే జేఎన్‌యు అగ్రస్థానంలో ఉంటుంది. సామాజిక మార్పులను ఆహ్వానించటం, ప్రజాభిష్టానికి వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టడం, గట్టిగా గళం విప్పటంలో జేఎన్‌యు విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారు. అణచివేతను, నిరంకుశత్వాన్ని ఢీ కొట్టే వారి తెగువ చూసి ఎవరైన స్ఫూర్తి పొందాల్సిందే. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకీ భారతదేశాన్ని రెండు వర్గాలుగా చీలుస్తుంది, ఈ చట్టాలు వివక్షపూరితంగా ఉన్నాయని జేఎన్‌యు విద్యార్థులు గత కొంత కాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరో తేదిన యూనివర్శిటిపై కొంత మంది హఠాత్తుగా దాడికి పాల్పడ్డారు. కనిపించిన విద్యార్థులను కనిపించినట్లు చితకబాదారు. దాడికి బాధ్యత వహిస్తున్నామని హిందూ రక్షాదళ్‌ అనే సంస్థ మంగళవారం ఒక వీడియోను విడుదల చేసింది. పింకీ చౌదరిగా తనను తాను ఆ వీడియోలో పరిచయం చేసుకున్న వ్యక్తి జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేవారికి జేఎన్‌యూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

ఢిల్లీ పీఠం-జేఎన్‌యు లాంచింగ్‌ ‌ప్యాడ్‌
‌జేఎన్‌యులో జరుగుతున్న పరిణామాలను ఎన్నికల నేపథ్యంలో అర్థం చేసుకున్నప్పుడే వాస్తవ పరిస్థితి మనకు అర్థం అవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఢిల్లీ పీఠంపై జెండా ఎగరేయటానికి ఇప్పుడు కొంత మంది నేతలు, కొన్ని శక్తులు జేఎన్‌యునే లాంచింగ్‌ ‌ప్యాడ్‌ ‌చేసుకునే వ్యూహాలు పగడ్బందీగా అమలు చేస్తున్నాయి. వర్గాల మధ్య విభేదాలు, ఘర్షణలు తీసుకురావటం ద్వారా ఒక వర్గ ఓట్‌ ‌బ్యాంక్‌ ‌కన్సాలిడేట్‌ అయి తమ గెలుపుకు బాట పరుస్తుందని బలంగా నమ్మే వ్యక్తులు వీరు. ఈ ప్రమాదకర రాజకీయ క్రీడలో గెలిచిన సందర్భాలూ చాలా ఉన్నాయి. మరోసారి దేశ రాజధానిలో ఇదే ప్రయోగం జరుగుతోంది. నిర్మాత, దర్శకుడు అనురాగ్‌ ‌కశ్యప్‌ ‌చేసిన ట్వీట్‌ ‘‘‌దీపిక ఒక యాక్టర్‌గా మాత్రమే ఇలా ప్రమాదాలకు ఎదురెళ్లడం లేదు. ఆమె ఈ సినిమాకు నిర్మాత కూడా. అలాంటప్పుడు అది ఇంకా పెద్ద విషయం. కానీ ఆమె ధైర్యం చూపించారు.’’ అక్షర సత్యం.

rehana

– రెహాన,
సీనియర్‌ ‌జర్నలిస్ట్,
9492527352

Tags: ISupport Deepika, Delhi pedestal, JNU launching pad, Boycott Chhapaak

Leave A Reply

Your email address will not be published.