Take a fresh look at your lifestyle.

కేంద్ర, రాష్ట్రాల మధ్య ముదురుతున్న విభేదాలు

దేశంలో ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాలతో కేంద్ర సంబంధాల్లో విభేదాలు పొడసూపుతున్నాయి. ఇది దేశ పురోగతికి ఎంతో అవరోధంగా మారుతున్నది. కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ, రాష్ట్రంలో మరో రాజకీయపార్టీ అధికారంలో ఉన్నచోట ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట తమ ఉనికికోసం ఆయా పార్టీలు తీసుకునే పథకాలు కేంద్రానికి ఆమోదయోగ్యంగా లేకపోవడం, లేదా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఆయా రాష్ట్రాల కాలమాన పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం కూడా విభేదాలకు కారణమవుతున్నాయి. మన రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి అధికారాలతోపాటు, ఆదాయ వనరులు కూడా ఎక్కువగా ఉండటం ఒకటైతే, రాష్ట్రాలకు నేరవేర్చాల్సిన బాధ్యతలూ ఎక్కువగా ఉండటం, ఈ పరిస్థితిలో కేంద్ర వనరులపై రాష్ట్రాలు ఆధారపడాల్సి వొస్తున్న నేపథ్యంలో రెండింటి మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్రం కేంద్రం మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి ఇదే కారణంగా మారుతున్నది. ప్రతీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తూ వొస్తున్నది. స్వాతంత్య్రం వొచ్చినప్పటి నుండీ ఇదే పద్ధతి కొనసాగుతున్నది. ప్రారంభంలో అధిక ధాన్యం ఉత్పత్తి కోసం కేంద్రం హరిత విప్లవం లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ధాన్యం ఉత్పత్తి విషయంలో రాష్ట్రాలను ప్రోత్సహించిన విషయం తెలియంది కాదు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత గత నష్టాలను పూడ్చివేసుకునే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పలు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. ఏ ప్రాజెక్టు కింద ఎంత సాగు ఎక్కువగా పెరిగిందన్న విషయాన్ని పక్కకు పెడితే, మొత్తంమీద పంటల విస్తీర్ణం మాత్రం పెరిగిందన్నది ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పండించేది వరి ధాన్యమే. అయితే గత సంవత్సరం నుండి వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోడై కూస్తున్నది. అందుకు కారణం కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేక పోతున్నట్లుగా రాష్ట్రాలను హెచ్చరించడమేనన్నది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నమాట. తమ వద్ద నిల్వ ఉన్న మూడు లక్షల కోట్ల టన్నుల బియ్యాన్ని ఏం చేయ్యాలో పాలుపోవటం లేదని కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్డరి చెప్పడం, మరో కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తాము ఎట్టి పరిస్థితిలో వరి ధాన్యాన్ని కొనేదిలేదని గంటా పథంగా చెప్పిన మేరకే తాము రైతులను హెచ్చరించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. అయినా అలవాటుగా వరిసాగు చేస్తున్న రైతులకు నష్టం జరుగకూడదని ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెయ్యి కోట్ల రూపాయల విలువగల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నది. అంతే కాకుండా తాము కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బును వారం రోజుల్లో రైతుకు అందజేస్తున్న క్రమంలో, కేంద్రం మాత్రం తమకు ఆరు నెలల తర్వాతగాని డబ్బులు ఇస్తుందని, దీని వల్ల తమపై వడ్డీ భారం పెరుగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఘోషిస్తున్నది.

ఒకటి కొనుగోలు చేయవద్దని చెప్పడం, రెండవది సకాలంలో నిధులను సమకూర్చక పోవడం అన్న ఈ రెండు విషయాలపైన ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వకుండా, కొనుగోలు చేయకపోవడం రాష్ట్ర చేతగాని తనంగా పేర్కొంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నదన్నది టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆక్రోషిస్తున్నది. అంతటితో ఆగకుండా ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ప్రతి వరి గింజను కొనుగోలు చేయాల్సిందేనంటూ బిబెపి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే గుడ్డకాల్చి మీద వేసినట్లు అన్యాయంగా తమపై బురద చల్లడమేంటని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ ఇప్పుడు కేంద్రంపై కాలు దువ్వుతున్నది. కేంద్రం ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వైఖరికి నిరసనగా ధర్నాలు జరుపాల్సిందిగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే పిలుపు నిచ్చారు. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ ఇతర నేతలు శుక్రవారం జరుపనున్న ధర్నాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ఇది మరో ఉద్యమాన్ని తలపించేదిగా ఉండాలని మంత్రి కెటిఆర్‌ ‌లాంటి వారు తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో పాల్గొని తమ నిరసనను తెలియజేయాల్సిందిగా రాష్ట్ర రైతాంగానికి కూడా పార్టీ పక్షాన ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వైపు తమ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల విద్యుత్‌ను అందజేయటంతో పాటు, రైతు బంధును అమలు చేయటం, ఎరువులు, విత్తనాలను సమరూర్చటం, వివిధ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడం లాంటి పనుల కారణంగా తెలంగాణ పచ్చని పంటలతో కళకళలాడుతున్న దశలో పండిన పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించేదిలేదని, కేంద్రం మెడలు వంచాల్సిందేనంటూ ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జరుగనున్న ఈ భారీ ధర్నా ఇరు రాష్ట్రాల సంబంధాలపై భవిష్యత్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపనుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply