కొరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉంది
కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదు
తాజాగా 18 మంది మృత్యువాత
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
హైదరాబాద్,మే 27: తెలంగాణలో కొరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, ప్రస్తుతం కొరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఆయన వి•డియాతో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మరణాలు సంభవించాయి. కొరోనా నుంచి కోలుకుని 3,961 మంది డిశ్చార్జి అయ్యారు. లాక్డౌన్ సమయంలో కొరోనా పాజిటివిటీ రేటు చాలా తగ్గిందని స్పష్టం చేశారు. రాష్ర్టంలో కొరోనా పాజిటివిటీ రేటు 4 శాతం ఉండగా, మరణాల రేటు 0.5 శాతంగా ఉందన్నారు. పది రోజుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి తగ్గిందన్నారు. తెలంగాణలో కొరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు.
లాక్డౌన్, ఫీవర్ సర్వేలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. జ్వర సర్వేలో 17 వేలకు పైగా బృందాలు పాల్గొన్నాయని చెప్పారు. ఆరోగ్య బృందాలు 6 లక్షల ఇండ్లలో జ్వర సర్వేలు చేశాయని తెలిపారు. కొవిడ్ ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం. 64 ప్రయివేటు హాస్పిటల్స్ పై 88 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు పరిశీలించి ఆయా హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ఆయా హాస్పిటల్స్ 24 గంటల నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డీహెచ్ సూచించారు. హాస్పిటల్స్‌పై ఫిర్యాదులకు 9154170960 నంబర్‌ను సంప్రదించొచ్చు. బ్లాక్ ఫంగస్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. ఆ వ్యాధికి కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని శ్రీనివాస్ రావు తెలిపారు.