Take a fresh look at your lifestyle.

తెలంగాణలో తగ్గుతున్న.. కొరోనా మరణాల రేటు

  • టెస్టుల సంఖ్య పెంచడం, చికిత్సల వికేంద్రీకరణతో సాధ్యం
  • గత నెలలో 0.92 శాతం, ఇప్పుడు 0.75 శాతం

రాష్ట్రంలో కొరోనా మరణాల రేటు తగ్గింది. పరీక్షలు, చికిత్సలను వికేంద్రీకరించడంతో కోవిడ్‌ ‌మరణాల శాతం తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. గత నెల 18న కొరోనా కేసుల్లో మరణాల శాతం 0.92గా ఉండగా, అది ఇప్పుడు 0.75 శాతానికి చేరిందని పేర్కొన్నారు. ఈనెల 1న రాష్ట్రంలో కోవిడ్‌ ‌మరణాల రేటు 0.81 శాతంగా ఉండగా, అది బుధవారం నాటికి 0.75 శాతానికి తగ్గిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డా.జి.శ్రీనివాసరావు తెలిపారు. దీంతో పాటు కొరోనా కేసుల్లో రికవరీ రేటు కూడా పెరిగిందని చెప్పారు. గత నెలలో కొరోనా బాథితుల రికవరీ రేటు 70 శాతంగా ఉండగా, నెలాఖరు నాటికి 72.3 శాతానికి పెరిగిందనీ, అదే విధంగా ఈరేటు ఈనెల 18 నాటికి 77.31 శాతానికి చేరినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రస్తుతం కొరోనా మరణాల రేటు 1.92 శాతంగా ఉండగా అదే మన రాష్ట్రంలో సగానికి పైగా తగ్గడం గమనార్హం.మరోవైపు, నెల క్రితం వరకు కొరోనా పరీక్షలు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే జరిగేవి. ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు సైతం హైదరాబాద్‌కే పరిమితమయ్యాయి.

ఆ తరువాత ర్యాపిడ్‌ ‌యాంటిజెన్‌ ‌పరీక్షలను ప్రభుత్వం రాష్ట్రంలోని పీహెచ్‌సి స్థాయి వరకు విస్తరించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1076 కేంద్రాలలో యాంటీజెన్‌ ‌పరీక్షలు జరుగుతున్నాయి. అంతే• కాకుండా పరీక్షలు నిర్వహించిన అర గంటలోనే ఫలితాలు కూడా వస్తుండటంతో కొరోనా రోగులకు వైద్య చికిత్సలు సైతం తక్షణమే అందుతున్నాయి. ఇదిలా ఉండగా, కింది స్థాయిలోనూ వైరస్‌పై ప్రజల్లో చైతన్యం బాగా రావడంతో వైద్యుల్లోనూ గందరగోళం పోయింది. దీంతో ఏమాత్రం జ్వరం లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదిస్తున్నారు. అవసరమైతే తక్షణ వైద్య చికిత్సల కోసం దగ్గరలోని పెద్ద దవాఖానాలకు వెళుతున్నారు. వెంటనే స్పందించని వారు మాత్రమే వైరస్‌ ‌లక్షణాలు బాగా ముదిరిన దశలో పెద్ద దవాఖానాలకు వెళుతున్నారు. దవాఖానాలకు వెళ్లడానికి ఇష్టపడని వారు ఇంట్లోనే ఉంటూ ఐసోలేషన్‌లో చికిత్సలు తీసుకుంటూ కోలుకుంటున్నారు. వీరిని సైతం వైద్య,,ఆరోగ్య శాఖ అధికారులు ప్రతీ రోజూ సమీక్షిస్తున్నారు. మరోవైపు, ప్రతీ రోజూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 వేలకు పైగా కొరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, ఎప్పటి మాదిరిగానే జీహెచ్‌ఎం‌సీ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎం‌సీ కాకుండా మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, వికారాబాద్‌ ‌జిల్లాలలో మాత్రమే 100కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ జిల్లాలను మినహాయిస్తే రాష్ట్రంలోని మిగతా సగం జిల్లాలలో వందలోపే కేసులు నమోదవుతుండగా, మిగిలిన జిల్లాలలో 50 లోపే పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవుతుందటం గమనార్హం.

Leave a Reply