Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గుతున్న కొరోనా కేసులు

  • తాజాగా 18,346 మందికి పాజిటివ్‌… 263 ‌మంది మృతి
  • అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని నిపుణుల హెచ్చరిక

దేశంలో కొరోనా కేసులు తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలపైనే నమోదవుతున్న కొత్త కేసులు..తాజాగా ఆ మార్క్ ‌దిగువకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.41 లక్షల మందికి వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు నిర్వహించగా..18,346 మందికి పాజిటివ్‌గా నమోదయింది. కొత్త కేసులు ఇంత తక్కువగా నమోదవడం 209 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే ఇదే సమయంలో మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అంతక్రితం రోజున మరణాల సంఖ్య 200 దిగువకు పడిపోగా..తాజాగా సోమవారం 263 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో సగానికి పైగా మరణాలు ఒక్క కేరళలోనే నమోదవడం గమనార్హం. ఆ రాష్ట్రంలో నిన్న 8,850 కొత్త కేసులు వెలుగుచూడగా..149 మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 4,49,260 మందిని కోవిడ్‌ ‌బలితీసుకుంది. అయితే కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త సానుకూలాంశం. నిన్న మరో 29,639 మంది వైరస్‌ ‌నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 3.31కోట్ల మంది కొరోనాను జయించారు.

రికవరీ రేటు 97.93శాతానికి పెరిగింది. ఇక కొత్త కేసులు తగ్గుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,52,902 మంది వైరస్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 0.75 శాతంగా ఉంది. ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ దూసుకెళ్తుంది. సోమవారం మరో 72.51లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 91.54కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు థర్డ్‌వేవ్‌కు కారణమైన వాటిల్లో జాగ్రత్తగా ఉండాలని, హోటళ్లు, కేఫ్‌ల్లో కూర్చొని కాఫీ తాగుతూ గంటల తరబడి మాట్లాడుతూ కూర్చుంటే కష్టమని, నోటి తుంపరల దర్వా కొరోనా వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కరచాలనం చేసుకోవడంవంటి వాటి ద్వారా కూడా కొరోనా ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కోవిడ్‌ ఆం‌క్షల్ని ఎత్తివేసి పర్యాటకుల తాకిడి లేకపోతే మూడోదశ ఉధృతి తగ్గుతుందంటున్నారు. అయితే దసరా, దీపావళి, రంజాన్‌, ‌క్రిస్మస్‌తోపాటు జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు ఉండటంతో అందరూ జాగ్రత్తగా ఉండాలని జనవరి వరకు ఓపిక పడితే ఆ తర్వాత పరిస్థితులన్నీ సద్దమణుగుతాయని, ఇదివరకటిలా ఉండొచ్చని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌రణదీప్‌ ‌గులేరియా చెబుతున్నారు. ప్రజలంతా మరో ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే చాలని, కొరోనాను నియంత్రించే బాధ్యత కూడా మనచేతిలోనే ఉందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆంక్షల్ని సరళం చేయకూడదని, భారత్‌ ‌జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశమని, ఏమాత్రం అలక్ష్యం చేసిన కేసుల పెరుగుదల 103 శాతం ఉంటుందని గులేరియా హెచ్చరించారు.

Leave a Reply