పట్టణ ప్రజల కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు
సంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు
పట్టణ ప్రజల కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని, జిల్లాలోని అన్ని పురపాలికల్లో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సంగారెడ్డి ఎక్స్ రోడ్లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. కలెక్టరేట్లో అమీన్ పూర్, సదాశివ పేట, బొల్లారం పురపాలక సంఘాల కొరకు ఏర్పాటయిన మూడు మోబైల్ బయో టాయిలెట్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా సంగారెడ్డిలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నిబంధనల మేరకు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక మరుగుదొడ్డి ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన 346 మరుగుదొడ్లు ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు 115 మాత్రమే ఉన్నాయని, గత నెలన్నరగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, తాను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణాలపై రెగ్యులర్‌గా సమీక్షించడం జరిగిందన్నారు.
సంగారెడ్డిలో డీసీఎంఎస్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుక్రవారం పాత కలెక్టరేట్ భవనం ఆవరణలో నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్‌ను తన సీటులో మంత్రి కూర్చోబెట్టి ఆయనకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జెడ్ పి ఛైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్జి , కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజహర్షి షా, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డీసీఓ ప్రసాద్,మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.