Take a fresh look at your lifestyle.

దేశంలో తగ్గిన కొరోనా కొత్త కేసులు

  • ఆందోళన కలిగిస్తున్న మరణాల సంఖ్య
  • కర్నాటకలో మెల్లగా పెరుగుతున్న కేసులు
  • టీకా వేసుకున్న వారి నుంచీ వ్యాప్తి..అధ్యయనంలో వెల్లడి

దేశంలో కొరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నా థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతకు ముందురోజు 16 వేలకు చేరిన కేసులు.. తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు..క్రియాశీల కేసులు, రికవరీల వి•ద ప్రభావం చూపుతున్నాయి. తాజాగా రోజువారీ కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..గరువారం 12,84,552 మందికి కోవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు నిర్వహించగా..14,348 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 11 శాతం మేర కేసుల్లో తగ్గుదల కనిపించింది. బుధవారం 13,198 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.42 కోట్లకు చేరగా..అందులో 3.36 కోట్ల మందికి పైగా కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,61,334కి తగ్గి..ఆ రేటు 0.47 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి నుంచి ఇదే అత్యల్పం.

నిన్న రికవరీ రేటు కాస్త తగ్గి..98.19 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వారపు సగటు పాజిటివిటీ రేటు 1.18 శాతానికి చేరింది. అలాగే రోజువారీ సగటు పాజిటివిటీ రేటు గత 25 రోజులుగా రెండు శాతం(1.12 శాతం)లోపే నమోదవుతోందని తెలిపింది. ఇటీవల కాలంలో కేరళ కొరోనా మృతుల సంఖ్యను సవరిస్తుంది. గతంలో నమోదైన మరణాల్ని కొత్తగా చేరుస్తుంది. దాంతో కేంద్రం వెల్లడించే గణాంకాల్లో రోజువారీ మరణాలు భారీగా కనిపిస్తున్నాయి. తాజాగా ఆ సంఖ్య 805గా ఉంది. అందులో 708 కేరళ నుంచి వొచ్చినవే. ఫలితంగా అక్కడ ఇప్పటివరకు 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి. మరోపక్క గురువారం 74,33,392 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 104.82 కోట్లుగా ఉంది.

ఇకపోతే రాష్ట్రంలో కొవిడ్‌ ‌కేసులు మరోసారి పెరిగాయి. గురువారం 478 మందికి పాజిటివ్‌ ‌ని ర్దారణ కాగా బెంగళూరులో 235 మందికి, తుమకూరు 53, మైసూరు 47 మందికి పాజిటివ్‌ ‌ప్రబలింది. 11 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 334 మంది కోలుకోగా 17 మంది మృతి చెందారు. ఇటీవల నెల రోజుల్లో మృతుల సంఖ్య పెరిగినట్లయ్యింది. బెంగళూరులో ఏడుగురు, దక్షిణ కన్నడలో నలుగురు, కోలార్‌, ‌మైసూరులలో ఇరువురి చొప్పున, హాసన్‌, ‌రామనగర్‌లలో ఒక్కొక్కరు మృతి చెందారు. 24 జిల్లాల్లో ఒక్కరూ మృతిచెందలేదు. 30 జిల్లాల్లో 8557 మంది చికిత్స పొందుతున్నారు.

టీకా వేసుకున్న వారినుంచీ వ్యాప్తి..అధ్యయనంలో వెల్లడి
కొరోనా మహమ్మారి రక్కసిని అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్‌ ‌డోసులను కూడా అందిస్తున్నాయి. అయినా సరే యూకే, రష్యా లాంటి దేశాల్లో మళ్లీ కోవిడ్‌ ‌విజృంభణ మొదలైంది. ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్‌ ‌వ్యాప్తి విపరీతంగా ఉంది. మరి.. టీకాలు అందుబాటులోకి వొచ్చినప్పటికీ కొరోనా ఉద్ధృతికి కారణమేంటి? అంటే.. టీకా వేసుకున్నవారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి చెందడమే అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొరోనా రకాల్లోనే అత్యంత ప్రమాదకరమైన, వేగవంతమైన వేరియంట్‌గా పిలుస్తున్న డెల్టా రకం వైరస్‌..‌టీకా వేసుకున్న వ్యక్తి నుంచి కూడా సులువుగా ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.

టన్‌కు చెందిన ఇంపీరియల్‌ ‌కాలేజ్‌ ‌లండన్‌.. 621 ‌మందితో ఏడాది పాటు చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందట. వీరి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా..టీకా వేసుకున్న వ్యక్తుల నుంచి వారి కుటుంబసభ్యులకు వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. 621 మందిపై ఈ అధ్యయనం జరపగా.. ఇందులో 205 మంది నుంచి వారి కుటుంబసభ్యులకు డెల్టా వేరియంట్‌ ‌సోకినట్లు తేలింది. వైరస్‌ ‌సోకిన వారిలో 38 శాతం మంది కుటుంబ సభ్యులు టీకా తీసుకోలేదని, 25శాతం మంది టీకా వేయించుకున్నప్పటికీ కొరోనా బారిన పడ్డారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే టీకా తీసుకున్నవారు కొరోనా నుంచి త్వరగా కోలుకోగలిగారని పేర్కొన్నారు. అధిక టీకా రేటు ఉన్న దేశాల్లోనూ డెల్టా వేరియంట్‌ ‌వైరస్‌ ‌విజృంభణకు కారణమిదేనని వెల్లడించారు.

మన చుట్టూ ఉన్నవారు టీకా తీసుకున్నారు కదా..మనం వేయించుకోవాల్సిన అవసరం లేదులే అనుకుంటే అది చాలా పొరబాటు. టీకా తీసుకున్నవారి నుంచి కూడా వైరస్‌ ‌ముప్పు ఉంటుంది. అందువల్ల ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేగాక, టీకాతో పాటు మాస్క్ ‌ధరించడం, భౌతిక దూరం వంటి కొరోనా నిబంధనలు కూడా పాటించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply