ఆదాయాలు దెబ్బతినడంతో మద్యానికి దూరంగా జనం
ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గడంతో చాలామంది మద్యం విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. దీనికితోడు ధరలు పెంచడంతో మద్యం విషయంలో ప్రజలు ఎవరికి వారు కంట్రోల్ విధించుకున్నారు. ఈ ఎండాకాంలో బీర్ల అమ్మకాల్లో భారీ తగ్గుదల కనిపించింది. ఇదివరకు ఆరోగ్యం క్షీణిస్తుందని, జేబులకు చిల్లు పడుతుందని తెలిసినా మందుబాబులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏదో సాకుతో పీకలదాక తాగేసి చిందులేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. లాక్డౌన్ అమలులో ఉన్నందున పని దొరకక, చేతిలో పైసలు లేక మద్యం ప్రియులు గిలగిలలాడారు. మళ్లీ దుకాణాలు తెరవడంతో ఎగిరి గంతేశారు.
అయితే ఆదాయం లేకపోవడంతో చాలామంది మద్యం దుకాణాల వైపే వెళ్లలేదు. దీంతో కొన్నిరోజులుగా మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. సర్కారు ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రభుత్వం 16 శాతం ధర పెంచడం, వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లడం కూడా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.తెరుచుకున్న దుకాణాల్లో మొదట్లో కొన్నిరోజులు బీరు, లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగినా అనంతరం తగ్గుముఖం పట్టాయి. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చివరకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు సైతం తలలుపట్టుకుంటున్నారు. 25 నుంచి 30 శాతంవరకు మద్యం విక్రయాలతోనే సర్కార్కు ఆదాయం వచ్చేది.