- రెండు లక్షలకు దిగువకు చేరుకున్న సంఖ్య
- దేశవ్యాప్తంగా కరోనా కేసులు 2.85 కోట్లకు చేరిక
- తాజాగా 2,713 మంది మృత్యువాత
వ్యాక్సిన్ దిగుమతికి అమెరికాతో చర్చలు సఫలంం
దేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,361 కొరోనా కేసులు నమోదు కాగా, కొరోనా వల్ల 2,713 మంది మృతి చెందారు. మొత్తం దేశవ్యాప్తంగా కొరోనా కేసులు 2.85 కోట్లకు చేరాయి. దేశంలో ప్రస్తుతం 16,35,993 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు దేశంలో 3,40,702 కొరోనా మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు 22.41 కోట్లకు పైగా వ్యాక్సినేషన్స్ తీసుకున్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వెల్లడించింది.
ఇదిలావుంటే కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరాను పెంచేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ • ఇటీవల అమెరికాలో కీలక నేతలను కలిసి చర్చలు జరిపిన నేపథ్యంలో జో బైడన్ అడ్మినిస్టేష్రన్ భారత దేశానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ప్రకటించింది. గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్‌లో భాగంగా భారత దేశానికి కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ గురువారం ప్రకటించారు. అనంతరం ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. భారత దేశంతోపాటు ఇతర దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా కోసం అమెరికా ప్రణాళికలను మోదీకి కమల హారిస్ వివరించారు. కోవాక్స్‌తో పాటు నేరుగా అమెరికా నుంచి మొదటి విడతలో 2-3 మిలియన్ డోసుల వ్యాక్సిన్ మన దేశానికి రాబోతున్నట్లు అంచనా.
అంటే మన దేశంలో ఒక రోజులో వేయగలిగే వ్యాక్సిన్లు రాబోతున్నాయన్న మాట. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం 2.62 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో 24,04,166 మంది మొదటి డోసు తీసుకున్నారని, 2,20,805 మంది రెండో డోసు తీసుకున్నారని తెలుస్తోంది. జూన్ నెలాఖరుకు దాదాపు 80 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందజేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా 25 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుంది.
కోవాక్స్ ద్వారా 19 మిలియన్ డోసులను అందజేస్తామని బైడన్ ప్రకటించారు. ఆరు మిలియన్ల డోసులను నేరుగా పంపిణీ చేస్తామన్నారు. కెనడా, మెక్సికో, భారత దేశం, కొరియావంటి దేశాలకు సరఫరా చేస్తామన్నారు. ఇదిలావుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్లో, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్‌తో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలిపారు. గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ కోసం అమెరికా ప్రణాళిక ప్రకారం భారత దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తామని ఆమె హావి• ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రభుత్వంతోపాటు వ్యాపార రంగం, భారత సంతతి ప్రజలు భారత దేశానికి సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రపంచ దేశాలన్నిటికీ సమానంగా అందాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ వంటి సంస్థలు కలిసి కోవాక్స్ను ఏర్పాటు చేశాయి.