- ట్రైబ్యునల్ ద్వారా నీటిని కేటాయించాలని కేసీఆర్ కోరారు
- నదీ జలాల పంపిణీపై రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు తీసుకుంటాం
- ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం ట్రైబ్యునల్‌కు ఉంది
- ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తాం
- కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
- నదీ జలాల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం
- పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్
కృష్ణా గోదావరీ బోర్డుల పరిధిపై నిర్ణయాధికారం కేంద్రానిదేననీ, ఏ రాష్ట్రానికి ఎంత నీటి వాటాను కేటాయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని సాంకేతిక అంశాలను సైతం త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు కొత్తగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టుల రిపోర్టులు సంబంధిత నదీ బోర్డులకు అందించాలనీ, వాటిని పరిశీలించి అపెక్స్ కౌన్సిల్ రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. .ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జల వివాదంపై ఇరు రాష్ట్రాలు గట్టిగా వాదనలు వినిపించినట్లు సమాచారం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయకుండా.. పరిధిని నోటిఫై చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏపీ మాత్రం నోటిఫై చేయాలని పట్టుపట్టినట్లు తెలియవచ్చింది. ఇప్పటికే ఉన్న నాగార్జున సాగర్‌తోపాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకే అప్పగించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
రెండు ప్రాజెక్టుల నిర్వహణను పూర్తిగా బోర్డుకే అప్పగించాలని ఏపీ సమావేశంలో మంత్రిని కోరిందని సమాచారం. అనంతరం షెకావత్ నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సమావేశం ఫలవంతంగా జరిగిందనీ, రెండు రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలు, ప్రాజెక్టుల నిర్వహణ, గోదావరీ జలాలను సమర్థంగా వాడుకోవడం, కృష్ణా బోర్డు తరలింపు అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు.2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పడింది. చట్టం ప్రకారం కృష్ణా నదీ జలాల బోర్డు ఏర్పాటైందని తెలిపారు. వివాదాల పరిష్కారానికి కమిటీ ఒక విస్పష్టమైన విధానంతో ఉందని తెలిపారు. తెలంగాణ, ఏపీలో ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలు తమ వాదనలు వినిపించారనీ, ఆయా రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను సమర్పించాలని కోరామని చెప్పారు. ఇందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారనీ, డీపీఆర్‌లు పరిశీలించి అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలను నిర్ణయిస్తామని తెలిపారు. కృష్ణా గోదావరీ యాజమాన్య బోర్డులపై సైతం చర్చించామనీ, ఆరేళ్లు దాటినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదని చెప్పారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ పరిష్కారానికి వచ్చామన్నారు. విభజన చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలించేందుకు సమావేశంలో అంగీకారం కుదిరిందన్నారు. కృష్ణా గోదావరీ నదీ జలాలను ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరారనీ, అవసరమైతే నదీ జలాలపై తాము సుప్రీం కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసినట్లు చెప్పారు. తెలంగాణ కేసును ఉపసంహరించుకున్న మీదట న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందకు వెళతామని స్పష్ఠం చేశారు. నదీ జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకుని ట్రైబ్యునల్‌కు వెళతామనీ, నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం ట్రైబ్యునల్‌కు ఉందని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై సైతం చట్టప్రకారమే ముందుకు వెళతామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడమే కేందప్రభుత్వ లక్ష్యమనీ, ఆ ప్రాజెక్టుపై బిల్లులు ఇచ్చిన మేరకు ఏపీకి నిధులు విడుదల చేశామని చెప్పారు. వీలైతే ఈ నెలాఖరులో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని చెప్పారు. ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేలా చూస్తామని షెకావత్ వివరించారు.