Take a fresh look at your lifestyle.

దశాబ్దాల రాజకీయ ప్రస్తానం… అభివృద్ధి శూన్యం ..!

  • కెసిఆర్‌ ఒవైసీ ఒకే ప్లేట్లో బిర్యానీ తింటారు
  • కాశ్మీర్‌లో పీడీపీతో మా పొత్తుకు ఎంఐఎంతో టిఆర్‌ఎస్‌ ‌పొత్తుకు పోలిక లేదు
  • ప్రజా ఉద్యమాలను అడ్డుకునే పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారు
  • మీడియా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: ‘జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని బలపర్చటానికి టీఆరెస్‌ ఆనాడు ఎంఐఎం బలంగా ఉన్నచోట విడిగా పోటీలోకి దిగింది. ఆనాడే చెప్పాం.. టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటు వేసినా ఎంఐఎం పార్టీకి వోటు వేసినా ఒకటే అని. మజ్లీస్‌ ‌పార్టీ తాను బలంగా ఉన్న స్థానాల్లో నేరుగా పోటీ చేసి మిగతా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలవడానికి తన పూర్తి మద్దతును ప్రకటించింది. నిన్న జరిగిన మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ఎన్నికలలో ప్రత్యక్షంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ.. మజ్లిస్‌ ‌పార్టీ యొక్క సహాయ సహకారాలతోటి ఆ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. మరొకసారి ఈ రెండు పార్టీల పోత్తులు..ఎత్తుగడలు స్పష్టం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓవైసీ..కల్వకుంట్ల వారి కుటుంబాలను విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు అని ప్రజలకి మనవి చేస్తున్నాను’ అని కేంద్ర సహాయ హోమ్‌ ‌శాఖా మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

కెసిఆర్‌..అసదుద్దీన్‌ ఇద్దరికి కలిసి ఓకే ప్లేట్లు బిర్యాని తినే అలవాటు ఉందని, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చి ఆరు సంవత్సరాలు కావొస్తున్నా హైదరాబాదులో ఒక హైటెక్‌ ‌సిటీ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ఆయన దుయ్యబట్టారు. మజ్లిస్‌ ‌పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఓల్డ్ ‌సిటీలో కార్పొరేటర్‌, ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు కూడా గత అనేక దశాబ్దాలుగా మజ్లిస్‌ ‌పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏమాత్రం అభివృద్ధిలేదు. మిగులు బడ్జెట్‌లో ఉన్న జిహెచ్‌ఎం‌సి ని అప్పుల జిహెచ్‌ఎం‌సిగా కెసిఆర్‌ ‌మార్చి వేశారు. ఆరు సంవత్సరాల కాలంలో కెసిఆర్‌ అప్పుల జిహెచ్‌ఎం‌సి ఘనత సాధించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వలేని పరిస్థితి, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్న పరిస్థితి నేడు దాపురించిందని ఆయన మండిపడ్డారు. అప్పులు తీసుకొచ్చి హైదరాబాద్‌ ‌హైటెక్‌ ‌సిటీలో అభివృద్ధి చేసి మొత్తం అభివృద్ధి జరిగిందని మొన్న ఎన్నికల్లో ప్రచారం చేయ బోయారని, ఈరోజు ఒక ఓల్డ్ ‌సిటీ మాత్రమే కాదు మజ్లిస్‌ ‌పార్టీ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తోందో అక్కడ అభివృద్ధి జరగటం లేదని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అంబర్‌పేట్‌, ‌సికింద్రాబాద్‌, ‌సనత్‌ ‌నగర్‌, ‌ఖైరతాబాద్‌, ‌గోషామల్‌ అసెంబ్లీలు కూడా అభివృద్ధి కాలేదు.

ఇవన్నీ కూడా టిఆర్‌ఎస్‌ ‌హయాంలో ఓల్డ్ ‌సిటీ లాగా తయారు అయ్యాయి. కేటీఆర్‌..‌కేసీఆర్‌లకు హైటెక్‌ ‌సిటీ తప్ప మరే హైదరాబాద్‌ ‌బస్తి ప్రజలు కనిపించరు. ఓల్డ్ ‌సిటీలో ఖర్చు చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో ఎవరికీ తెలియదని ఆయన విమర్శించారు. ఓల్డ్ ‌సిటీలో ఎంఐఎం హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు. వాస్తవానికి ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఎంఐఎం ‌కలిసి హైదరాబాదులో అభివృద్ధి సాధిస్తామంటే ప్రజలు నమ్మడం లేదు. ఎంఐఎం పార్టీకి అసలు అభివృద్ధి అవసరం లేదు. ప్రజలకు మభ్యపెట్టి నమ్మించి మోసం చేసే అలవాటు ఎంఐఎం పార్టీకి ఉంది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కూడా ఎంఐఎం పార్టీకి సహకరిస్తూ ఆ పార్టీ లాగే తయారయిందని అన్నారు. ఆ రోజే చెప్పాను టిఆర్‌ఎస్‌ ‌పార్టీ మద్దతు లేకపోతే ఓల్డ్ ‌సిటీలో ఎంఐఎం పార్టీ రౌడీయిజం గూండా ఇజం చేసే పరిస్థితి లేదు. హైదరాబాదులో పోలీస్‌ అధికారులు..రెవెన్యూ అధికారులు ఎవరు ఉండాలి, హైదరాబాద్లో కాంట్రాక్టర్లు ఎవరు ఉండాలి అన్నది నిర్ణయించేది ఎంఐఎం పార్టీ. వీటన్నిటికీ సంబంధించి ప్రగతిభవన్లో నిర్ణయాలు జరగడంలేదు. దారుస్సలాంలో నిర్ణయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి పదవిలో కెసిఆర్‌ ‌కూర్చున్నా గాని స్టీరింగ్‌, ‌బ్రేక్‌, ఎక్స్లెటర్‌ ‌మా చేతిలో ఉన్నాయని ఎంఐఎం పదేపదే చెబుతున్నది. మొన్న ఎన్నికల్లో అయితే ఏకంగా మేము అనుకుంటే ఒక్కరోజులో కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చి పడేస్తామని కూడా అక్బరుద్దీన్‌ ఓవైసీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అటువంటి పార్టీతో ఈరోజు టిఆర్‌ఎస్‌ ఏ ‌మొహం పెట్టుకుని పొత్తులు పెట్టుకుందని అడుగుతున్నాం. జిహెచ్‌ఎం‌సి ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ ఎంఐఎం‌తో లాలూచీ పడిన వైనంపై ప్రజలకు వివరించాలని కోరుతున్నామని కిషన్‌ ‌రెడ్డి నిప్పులు చెరిగారు. జిహెచ్‌ఎం‌సి ఎన్నికలలో ఎంఐఎం మద్దతు కనుక లేకపోయినట్లయితే టీఆర్‌ఎస్‌ ‌సింగిల్‌ ‌డిజిట్‌కు పడిపోయేది. ఇప్పటికే 99 స్థానాల నుంచి 54 స్థానాలకు పడిపోయింది. ఎంఐఎం మద్దతు లేకపోతే టీఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌లో మన కలిగేది కాదని ఆయన అన్నారు. సెక్యులరిజం గురించి మాట్లాడే కేసీఆర్‌, ‌మత తత్వ పార్టీ అయిన ఎంఐఎంతో ఎలా పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు వివరించాలని కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. హిందూ దేవతలను కించపరిచే, అవమానపరిచే అసదుద్దీన్‌ ఓవైసీతో కెసిఆర్‌ ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నిచారు.

- Advertisement -

పోలీసులను, భద్రతా సిబ్బంది పక్కన పెడితే వందకోట్ల హిందువులతో తేల్చుకుంటామని చెబుతున్న ఎంఐఎంతో కేసీఆర్‌ ‌జిహెచ్‌ఎం‌సి ఎన్నికలలో అధికారం కోసం కక్కుర్తిపడి పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిచారు. రజాకార్ల వారసత్వంతో వొచ్చి రక్తం చూసిన పార్టీతో కెసిఆర్‌ ఎలా పొత్తు పెట్టుకుంటారు..? మజ్లిస్‌ ‌పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి దండాలు పెట్టడం ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి ఆనవాయితీగా మారిపోయింది. రాష్ట్రాన్ని కల్వకుంట్ల.. ఓవైసీల కుటుంబాలు కలిసి ఏలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన పార్టీతో కెసిఆర్‌ ఎలా జత కడతారు..? అంటూ ఆయన తీస్థ్రాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులకు గానీ, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వారికి గాని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఏ మాత్రం విలువ ఇవ్వటం లేదని, పైగా తెలంగాణ వ్యతిరేక శక్తులకు పెద్దపీట వేసి అందలం ఎక్కిస్తూ తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కీలక నిర్ణయాలను మంత్రి వర్గంలో చర్చించకుండా అసదుద్దీన్‌ ఓవైసీతో మొత్తం విషయాలు చర్చిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కార్పొరేటర్‌ ‌టికెట్లు ఎవరికి ఇవ్వాలి.. ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇవ్వాలన్నది కూడా ఎంఐఎం నాయకులతో కేసీఆర్‌ ‌చర్చిస్తున్నారు.

తెరపై కేసిఆర్‌ ‌కనబడుతున్నా మొత్తం శాసించేది ఎంఐఎం పార్టీనే.. ఈ విషయాలను గమనించాలని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఆరు సంవత్సరాల క్రితం పట్టభద్రుల ఎన్నిక టిఆర్‌ఎస్‌కి నల్లేరు మీద నడక లాగా ఉండింది ఆ సమయంలోనే హైదరాబాద్‌ ‌రంగారెడ్డి.. మహబూబ్‌ ‌నగర్‌ ‌సీటును పూర్తి మెజారిటీతో గెలిపించుకుంన్నాం. వరంగల్‌, ‌ఖమ్మం, నల్గొండ సీటు కొద్దీ తేడాతో ఒడిపోయాం. ఈ రోజు కెసిఆర్‌ ‌పరిస్థితి అంత బాగాలేదు కనుక రెండు సీట్లు కూడా బీజేపీ గెలుస్తుందని, ఆ దిశగానే తాము పనిచేస్తున్నామని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పు అని కెసిఆర్‌ అనడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమే.. ప్రజలు తమ పవిత్రమైన వోటు హక్కుతో ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంలు చేస్తారు. దాన్ని కేసీఆర్‌ ఎడమ కాలి చెప్పు తో పోల్చటం ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరచటంమే అని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ‌సభలో మహిళలను కించపరిచే విధంగా కేసీఆర్‌ ‌మాట్లాడారు. ప్రతి పార్టీ నాయకులు మాట్లాడే మాటల్లో తప్పులను ఎంచే కేసీఆర్‌ ‌తన మాట తీరు ఎలా ఉందో ముందు చూసుకోవాలని కిషన్‌ ‌రెడ్డి హితవు పలికారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా ఉద్యమాలు చేసుకునే హక్కు ఉంది. ఆ హక్కులను కాలరాసే పని కెసిఆర్‌ ‌మనుషులు చేస్తున్నారు. అదిలాబాదులో బిజెపి మండల పార్టీ ప్రెసిడెంట్‌ ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తే.. అతన్ని గృహనిర్బంధం చేసే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎంత నిర్బంధం చేస్తే ప్రజలు అంత పెద్ద ఎత్తున పైకి వొస్తారు.

ప్రజా ఉద్యమాలను అణిచివేసే పార్టీలను ప్రజలు భూస్థాపితం చేయటం ఖాయమని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ‌మెట్రోకి 1400 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని.. ఫలక్‌నామా వరకు పోవలసిన మెట్రోని అబ్దుల్‌ ‌గంజ్‌ ‌వరకు వేసి ఆపివేశారని ఆరోపించారు. ఫలక్‌నామా వరకు మెట్రో ఎందుకు పోలేదో కేసీఆర్‌ ‌చెప్పాలని, దీని వెనక కూడా మజ్లీస్‌ ‌పార్టీ ఉందని ఆయన ఆరోపించారు. ఓల్డ్ ‌సిటీ ఫలక్‌నామ వరకు వెళ్లాల్సిన మెట్రో ఎంఐఎం పార్టీ ఒత్తిడి వలన టిఆర్‌ఎస్‌ అమలు చేయటం లేదు. ఎంఎంటీఎస్‌ 2‌వ ఫేజ్‌ 98 ‌శాతం పూర్తి అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల వాటా ఇవ్వక పోవడం వలన మిగతా ఎంఎంటిఎస్‌ ‌పని ఆగిపోయింది. యాదగిరి గుట్టకి వెళ్ళేవారకు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటం వలన ఆగిపోయింది సెకండ్‌ ‌ఫేస్‌ ‌కి ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.

దాంతో థర్డ్ ‌ఫేస్‌ ‌పనులన్నీ ఆగిపోయాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఎయిమ్స్ ‌హాస్పిటల్‌కి సంబంధించిన పనులు ఆగిపోవటానికి కూడా కారణం కెసిఆర్‌ ‌ప్రభుత్వ వైఖరేనని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మొదటి రెండేళ్లు తాత్సారం చేసి ఇప్పుడు బిల్డప్‌ ఇస్తున్నారని తుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులకు నిధులు కావాలని రాష్టప్రభుత్వం అడిగితే అందులో తప్పు లేదు. అయితే వొచ్చిన నిధులను సద్వినియోగం చేస్తున్నారా లేదా అన్నది కూడా ప్రజలు గమనించాలని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కెసిఆర్‌ ‌కేంద్ర నిధులు సద్వినియోగం చేయటం లేదని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కాశ్మీర్లో పీడీపీతో తాము పొత్తు పెట్టుకుంటే తప్పు లేదుగానీ ఎంఐఎంతో టిఆర్‌ఎస్‌ ‌పొత్తు పెట్టుకుంటే తప్పేంటని విలేఖరులు అడిగితే.. కాశ్మీర్‌ ‌పరిస్థితి వేరు తెలంగాణ పరిస్థితి వేరు అని సమాధానం దాటవేశారు. షర్మిల పార్టీపై మాట్లాడడానికి కూడా కిషన్‌ ‌రెడ్డి దాటవేత వైఖరినే అనుసరించారు.

Leave a Reply