Take a fresh look at your lifestyle.

దశాబ్దాల విద్యా విధానం బాధ్యత గల పౌరుల్ని తయారు చేయలేదు: విజయశాంతి

హైదరాబాద్‌, ‌జూలై 31 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): దశాబ్దాల కాలంగా మన దేశంలో అమలవుతూ వచ్చిన విద్యా విధానం వివేకం లేని యంత్రాల్లాంటి ఉద్యోగులనే ఎక్కువగా సృష్టించింది తప్ప నాయకత్వ లక్షణాలు గల బాధ్యతగల పౌరుల్ని తయారు చెయ్యడంలో విఫలమైందని చెప్పక తప్పదనీ బిజెపి సీనియర్‌ ‌లీడర్‌, ‌మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ ‌మీడియా ద్వారా ఓ పోస్టు చేస్తూ…పరిస్థితుల్ని తిరగరాస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రస్తుత సర్కారు గత ఏడాది నూతన విద్యా విధా నాన్ని ప్రవేశపెట్టిందనీ, ఈ నూతన వ్యవస్థలో అన్ని వర్గాలకూ లాభదాయకంగా ఉండేలా అఖిల భారత వైద్య విద్యలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యుఎస్‌ ‌వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంతో శుభపరిణామం అన్నారు.

కొరోనా వంటి ప్రకృతి విపత్తులు విలయతాండవం చేస్తున్న తరుణంలో… మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కృత్రిమ మేధస్సులో శిక్షణనివ్వాలన్న ఆలోచన మన కేంద్ర ప్రభుత్వ ముందు చూపునకు దర్పణం పడుతోందన్నారు. ఇక ఇంజనీరింగ్‌ ‌కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లో అందించాలన్న నిర్ణయం మన దేశీయ భాషలకు కొత్త ఊపిరిపోస్తూ భావితరాలకు మాతృభాషలోని మాధుర్యాన్ని అందిస్తుందనీ, ఈ క్రమంలోనే బధిర లిపిని ఇతర భాషల్లాగే విద్యాసంస్థల్లో చదువుకోవడానికి వీలు కల్పించడమన్నది ఆ ప్రత్యేక అవసరాలున్న పౌరుల పట్ల మన ప్రధాని సమ దృష్టిని తెలియజేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాలను రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకుని బాధ్యత గల రేపటిపౌరులను తయారు చెయ్యడంలో తమ వంతు కృషి చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాననీ ఆ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.

Leave a Reply