Take a fresh look at your lifestyle.

నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి హరీష్‌రావు ఆదేశం

  • ఆగస్టు 15 నుంచి అమలు చేయాలి
  • అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం
  • సిద్ధిపేట జిల్లాలో రూ.50వేల వరకున్న పంట రుణాల మొత్తం 87 కోట్లు
  • జిల్లాలో 24 వేల 600 మంది రైతులకు రుణ విముక్తి

సిద్ధిపేట, ఆగస్టు 4 (ప్రజాతంత్ర బ్యూరో): తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ రెండో దశ కింద 50 వేల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో 50 వేల రూపాయల వరకు ఉన్న పంట రుణాల మాఫీతో 24 వేల 600 మంది రైతులకు సంబంధించిన మొత్తం 87 కోట్ల మాఫీ కానుందని మంత్రి తెలిపారు. ఈ నెల 15నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సిద్ధిపేటలోని కలెక్టరేట్‌ ‌మీటింగ్‌ ‌హాల్‌లో రైతు వేదికల పూర్తి స్థాయిలో వినియోగంపై జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాగులో వస్తున్న నూతన మెళకువలుపై రైతులను చైతన్యవంతం చేసేందుకు ప్రతి రెండు వారాలకు ఒక శిక్షణా కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించాలన్నారు. జిల్లాలో ఆయిల్‌ ‌ఫామ్‌, ‌సెరి కల్చర్‌ ‌సాగుపై వ్యవసాయ విస్తరణ అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఆయిలా ఫామ్‌ ‌సాగును అవగాహన నిమిత్తం అశ్వారావు పేటలోని క్షేత్ర సందర్శనకు ఏఈవోలను తీసుకెళ్లాలని మంత్రి జిల్లా ఉద్యానవన అధికారికి సూచించారు.

జిల్లాలోని ఆదర్శ రైతులను రైతు వేదికల వద్దకు ఆహ్వానించి వారితో వారి అనుభవాలను క్లస్టర్‌ ‌పరిధిలోని రైతులకు వివరించేలా సమావేశాలు నిర్వహించా లన్నారు. క్షేత్రస్థాయిలో వరి వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారులు సందర్శించి మెలుకువలు గ్రహించాలన్నారు. జిల్లాలో వినియోగంలో ని రాని రైతు వేదికలను గుర్తించి వెంటనే వాటిని వినియోగంలోకి తేవాలని అన్నారు. జిల్లాలోని 127 రైతు వేదిక 39 రైతు వేదికల్లో కొన్ని అసంపూర్తి పనులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని వచ్చే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. క్లస్టర్‌ ‌పరిధిలో వెదజల్లే పద్ధతి లో వరి సాగు, ఆయిల్‌ ‌ఫాం, సెరీ కల్చర్‌ ‌సాగు విస్తీర్ణంపై మంత్రి ఏఈవోలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్లస్టర్‌ ‌పరిధిలోని రైతులతో సత్సబంధాలు కలిగివుండాలి మంత్రి ఏఈవోలకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ సక్రమంగా జరిగేలా చూడాలని మంత్రి జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌ ‌కుమార్‌ను ఆదేశించారు. జిల్లాలో రీసెర్చ్ ‌సెంటర్‌లు, యూనివర్సిటీలు ఉన్నాయని వాటి బాధ్యతలను చూస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, నిపుణులు ఉన్నారని వారి అనుభవాలను తీసుకోవాలని మంత్రి సూచించారు.

నారాయణపేట ఏఈవో నాగార్జునకు మంత్రి అభినందన
తన క్లస్టర్‌ ‌పరిధిలోని రైతులతో సత్సంబంధాలను కలిగి ఉంటూ సాగు మెలకువలు ఎప్పటికప్పుడు వారికి తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక వాట్సాప్‌ ‌గ్రూప్‌ను ఏర్పాటు చేసి రైతులను చైతన్యవంతం చేస్తున్న నారాయణపేట వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జునను మంత్రి అభినందించారు. నాగార్జునవను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఏఈవోలు తమ పరిధిలోని రైతులతో నిత్యం సామాజిక మాధ్యమాలు వేదికగా తెలియజేయాలని మంత్రి సూచించారు. గొర్రెల యూనిట్ల పంపిణీపై పశు సంవర్ధక శాఖ అధికారితో మంత్రి సమీక్షించారు. గొర్రెల యూనిట్‌ ‌పెంచిన ధరను రూ. 1,75,000గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెంచిన యూనిట్‌కు అనుగుణంగా ప్రభుత్వ, లబ్ధిదారుల వాటా పెరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ వాటా రూ. 1,31,250లకు, లబ్దిదారుల వాటా రూ. 43,750కు పెరుగుతుందని మంత్రి తెలిపారు.

ఒక యూనిట్‌కు కచ్చితంగా 21 గొర్రెలు వస్తాయన్నారు. జిల్లాలో ఇప్పటికే డిడిలు కట్టి పాత యూనిట్స్ ‌గ్రౌండింగ్‌ ‌కానీ 300 మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తిస్తాయని మంత్రి తెలిపారు. త్వరలో చేపట్టనున్న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కూడా అధికారులు సర్వ సన్నద్ధం కావాలనీ మంత్రి సూచించారు. సొసైటీలను కూడా క్రియాశీలం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరలోనే గొర్రెల పంపిణీపై సొసైటీలతో తాను సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌మూజమిల్‌ఖాన్‌, ఏఎం‌సి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply